Vijayasai Reddy in Delhi : రాష్ట్రం కోసం ఎవరికైనా మద్దతు - ఢిల్లీలో విజయసాయిరెడ్డి ప్రకటన - బీజేపీకి సిగ్నల్స్ పంపారా ?
Andhra Politics : రాష్ట్రానికి సహకరించిన వారికి మద్దతిస్తామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. బీజేపీ కూటమికే మద్దతని పరోక్ష సంకేతాలు పంపారని జాతీయ రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నారు.
YSRCP Support : వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరికైనా మద్దతిస్తారని .. తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఢిల్లీలో మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఏపీలో ఎన్నికల తర్వాత వైసీపీ క్యాడర్ పై దాడులు జరుగుతున్నాయని పోలీసులు పట్టించుకోవం లేదని చెప్పేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కీలక విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తమ లక్ష్యం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటమేనని స్పష్టం చేశారు. పార్లమెంట్‌లో ఏదైనా బిల్లు పాస్ అవడానికి వస్తే.. ఆ బిల్లు రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటే తాము మద్దతిస్తామన్నారు. ప్రత్యేకంగా తాము ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వబోమని..ఏ నిర్ణయం అయినా రాష్ట్ర ప్రయోజనాల మేరకే ఉంటుందన్నారు.
#WATCH | Andhra Pradesh: YSRCP leader Vijayasai Reddy V says, "Our objective is to protect the interest of the state, of the people of the state and the country. Whichever bill comes into the parliament and the govt would like to pass, if it will be by the constitution and… pic.twitter.com/VN1FVOtYuE
— ANI (@ANI) June 12, 2024
విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు బీజేపీకి పరోక్ష మద్దతు ప్రకటిస్తున్నట్లుగా ఉన్నాయని జాతీయ రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి అవసరమైన దాని కన్నా ఇరవై మంది లోక్ సభ సభ్యులు ఎక్కువే ఉన్నప్పటికీ ముంద జాగ్రత్తగా మరింత మంది లోక్ సభ సభ్యుల మద్దతు కోసం ప్రయత్నిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో నలుగురు ఎంపీలు ఉన్న వైసీపీ బిల్లుల వారీగా మద్దతిస్తామని చెప్పడం.. తమ ఉద్దేశాన్ని బీజేపీ హైకమాండ్‌కు పంపడమేనని అంటున్నారు.
లోక్‌సభలోనే కాకండా. రాజ్యసభలో వైసీపీకి పదకొండు మంది సభ్యులు ఉన్నారు. ఎన్డీఏ కూటమికి రాజ్యసభలో మెజార్టీ లేదు. వైసీపీ సభ్యులపై ఆధారపడి బిల్లులు పాస్ చేసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. ప్రెస్ మీట్‌లో విజయసాయిరెడ్డి పరోక్షంగా ఇదే మాట చెప్పారు. టీడీపీకి ఒక్క రాజ్యసభ సభ్యుడు కూడా లేరని.. పదహారు మంది లోక్ సభ సభ్యులున్నారని.. తమకు నలుగురు లోక్‌సభ ఎంపీలు, పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారని గుర్తు చేశారు. తమ కంటే టీడీపీకి ఒకే ఎంపీ ఎక్కువగా ఉన్నారన్నారు. ఈ మాటల ద్వారా బీజేపీకి తమ ప్రాధాన్యాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేశారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
వైసీపీ ఇండియా కూటమి వైపు వెళ్లే అవకాశం లేదు. తాము ఎన్డీఏకే మద్దతిస్తామని ఎన్నికలకు ముందు కూడా సంకేతాలు పంపారు. ఇప్పుడు ఘోర పరాజయం ఎదురైనా తాము బీజేపీకి అప్రకటిత మిత్రపక్షంగా ఉంటామన్న సంకేతాలను పంపుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో వివేకా హత్య కేసు విషయంలో.. జగన్ అక్రమాస్తుల విషయంలో.. తమకు అనుకూలంగా వ్యవస్థల్ని నెమ్మదిగా కదిలేలా చేశారన్న ఆరోపణలను టీడీపీ చేస్తూ వచ్చింది. ఇప్పుడు తమకు ఉన్న ఎంపీలతో అదే పని చేస్తోందని.. టీడీపీ నేతలు విమర్శించే అవకాశం ఉంది.