Telangana Poltics : తెలంగాణ చీఫ్‌ను మారుస్తారని మళ్లీ ప్రచారం - బీజేపీ హైకమాండ్ పరిస్థితుల్ని ఎలా చక్కదిద్దుతుంది ?
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ను మారుస్తారా ?ఈటల రాజేందర్ కు కీలక పదవి ఇస్తారా?తెలంగాణలో నేతల్ని ఎలా సమన్వయం చేస్తారు ?
Telangana Poltics : నిన్నామొన్నటిదాకా ఎంతో హైప్ తెచ్చుకున్న తెలంగాణ బీజేపీ ఇప్పుడు అనేక కష్టాలను ఎదుర్కొంటోంది. అధికారం సంగతి ఎలా ఉన్నా పార్టీ పరిస్థితి అస్తవ్యస్థంగా మారుతోంది. నేతల మధ్య పోరు మొదలైంది. పార్టీలో సమన్వయం కొరవడింది. పార్టీని రాష్ట్రంలో పునర్‌వ్యవస్థీకరణ చేయడంతోపాటు బాధత్యలను కూడా నేతల మధ్య పంపిణీ చేయాలని జాతీయ నాయకత్వం భావిస్తోంది. ఈటల రాజేందర్ మరోసారి ఢిల్లీకి పయనం కావడంతో బండి సంజయ్ ను కూడా మార్చుతారనే ప్రచారం ప్రారంభమయింది. గతంలో ఇలాంటి ప్రచారమే జరిగినా... ఖండించారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మళ్లీ మారుతున్నట్లుగా కనిపిస్తున్నాయి.
కొత్త - పాత నేతల మధ్య పంచాయతీ
బీజేపీలో గతంలో కనిపించిన ఉత్సాహం ఇప్పుడు లేదు. పార్టీలోకి వలస వచ్చిన నేతలు.. పాత నేతల మధ్య కోల్డ్ వార్ తారా స్థాయికి చేరింది. బీజేపీ లో కోవర్టులు ఉన్నారని, వారే కాషాయ పార్టీని బలహీనపరిచే కుట్ర చేస్తున్నారని, వారి గురించి త్వరలోనే పేర్లు బయటపెడతామని కొంత మంది చేస్తున్న ప్రకటనలతో పరిస్థితి దిగజారిపతోంది. కోవర్టుల గురించి ఈటల మొదలు చాలా మంది నేతలు ప్రస్తావిస్తున్నారు. ఒక విధంగా బండి సంజయ్ వర్గం..ఈట వర్గంగా పార్టీలే నేతల మధ్య చీలిక కనిపిస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ పదవీ కాలం ముగిసింది. అయినప్పటికీ ఎన్నికలు దగ్గరలో ఉన్నందున ఆయనను మార్చే అవకాశం లేదని హైకమాండ్ చెబుతోంది. మార్చాల్సిందేనని వలస నేతలు పట్టుబడుతున్నారు.
వలస నేతలు - పాత నేతల మధ్య సమన్వయమే పెద్ద సవాల్
తెలంగాణలో అధికారంలోకి వస్తామని ఎన్నో ఆశలు పెట్టుకున్న బీజేపీ హైకమాండ్.. పార్టీ లో పరిస్థితుల పైన..తీసుకోవాల్సిన చర్యల పైన పార్టీ నాయకత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పార్టీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మాజీ ఎంపీలు వివేక్ వెంకటస్వామి, కొండా విశ్వేశ్వరరెడ్డి అధిష్టానం పెద్దలతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం పార్టీ పరిస్థితి, ఎన్నికల నేపథ్యంలో చేయాల్సిన మార్పులు చేర్పులపైనా వారు అధిష్టానానికి వివరించినట్లు తెలిసింది. పార్టీలో చేరికలు, అసెంబ్లి ఎన్నికల్లో పొత్తులు, రాష్ట్రంలో పార్టీ పదవులపై ఇటీవల కీలక నేతలు తలా ఒక మాట మాట్లాడుతుండ డంపై ఆ పార్టీ అధిష్టానం ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. ఎన్నికల ముందు కీలక నేతల మధ్య సమన్వయం లోపించడం పార్టీని దెబ్బతీయడం ఖాయమన్న నిర్ణయానికి అధి ష్టానం వచ్చినట్లు తెలుస్తోంది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పార్టీని రాష్ట్రంలో పునర్‌వ్యవస్థీకరణ చేయడంతోపాటు బాధత్యలను కూడా నేతల మధ్య పంపిణీ చేయాలని జాతీయ నాయకత్వం భావిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
సీనియర్ నేతలకు కీలక పదవులు ఇచ్చే అవకాశం
మూడు నాలుగు రోజుల్లో తెలంగాణ బీజేపీలో కీలకంగా వ్యవహరిస్తున్న నేతలతో పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా తోపాటు అగ్రనేత అమిత్ షా ఢిల్లిలో ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే ప్రచార, హామీల, మేనిఫెస్టో, క్రమశిక్షణా తదితర కమిటీలను కొత్త నేతలతో అధిష్టానం భర్తీ చేయనున్నట్లు కూడా చర్చ సాగుతోంది. ఈటల రాజేందర్ కు ఎన్నికల వ్యూహాల ఖరారు కమిటీ లేదా ప్రచార కమిటీ వంటి కీలక బాధ్యతలను అప్పగించే యోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. బండి సంజయ్ ను మారుస్తారని ప్రచారం సాగుతున్నా.. ఎన్నికల సమయంలో మార్పు సరి కాదనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.