Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్ రాతను ప్రియాంకాగాంధీ మారుస్తారా ? సీనియర్లు మారుతారా?
ప్రియాంక గాంధీ తెలంగాణ కాంగ్రెస్ రాత మారుస్తారా ?ఇంచార్జ్ గా బాధ్యతలు తీసుకుంటారా ?అనధికారికంగానే పార్టని కంట్రోల్ చేస్తారా?సీనియర్లను దారిలోకి తీసుకు రాగలగుతారా ?
Telangana Congress : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జనంలోకి వెళ్లే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అధికార పార్టీతో పాటు బీజేపీకి ధీటుగా సభలు, సమావేశాలతో హోరెత్తించాలన్న వ్యూహంలో భాగంగా ఈ నెల 8న సరూర్ నగర్‌లో బహిరంగ సభ ఏర్పాటు చేసింది. నిరుద్యోగులు, యువతను ఆకట్టుకునేందుకు ఏర్పాటు చేసిన ఈ సభకు ప్రియాంక గాంధి హాజరు కానున్నారు. యూత్ డిక్లరేషన్ సభ గా పేరు పెట్టిన ఈ సమావేశానికి రాష్ర్టం నలుమూలల నుంచి భారీగా నిరుద్యోగులు హాజరవుతారని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. ఇంతకు ముందు చాలా సార్లు ప్రియాంక హైదరాబాద్‌కు వచ్చినప్పటికీ… రాజకీయ సభలో పాల్గొనటం ఇదే మొదటి సారి కావడంతో ఈ నిరుద్యోగ సభపై ఆసక్తి నెలకొంది. అందుకు తగ్గట్టే భారీ ఏర్పాట్లు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ.
అనధికారిక ఇంచార్జ్‌గా ప్రియాంక గాంధీ సూపర్ వైజ్ చేయబోతున్నారా?
తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జిగా ప్రియాంకా గాంధీ ఉండబోతున్నారన్న ప్రచారం కొంత కాలంగా సాగుతోంది. ప్రియాంక గాంధీని తెలంగాణ ఇన్‌చార్జిగా నియమించబోతున్నారంటూ గతంలోనూ ఈ తరహా ఊహాగానాలు వెలువడ్డాయి. ఫిబ్రవరి 2019లో ఆమె క్రియాశీల రాజకీయాల్లో అడుగుపెట్టినప్పుడు తొలి బాధ్యతగా తెలంగాణ కాంగ్రెస్‌ను అప్పగించబోతున్నారని ప్రచారం నడిచింది. కాంగ్రెస్ వర్గాలు కూడా ఈ ప్రచారాన్ని ఖండించలేదు. కానీ చివరికి అటువంటిదేమీ జరగలేదు. నాడు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తూర్పు ఉత్తరప్రదేశ్ బాధ్యతలను ఆమెకు అప్పగించారు. దీంతో అప్పటి నుంచి ఈ బాధ్యతల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. ఇక గతేడాది కూడా ప్రియాంక గాంధీకి దక్షిణాది రాష్ట్రాల బాధ్యతలు అప్పగించబోతున్నారని స్వయంగా కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సమావేశాలు కూడా నిర్వహించారు. కానీ అధికారికంగా ప్రకటన చేయలేదు.
దక్షిణాదిలో పార్టీ బలోపేత బాధ్యతలు తీుకుంటారా ?
దక్షిణాది రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు పార్టీ ఇంచార్జీగా ప్రియాంకా గాంధీ వ్యవహరించే అవకాశం ఉంది. అయితే అధికారికమా.. అనధికారికంగా అన్నదానిపై స్పష్టత లేదు. ప్రియాంకా గాంధీ ఇప్పటి వరకూ యూపీతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో బాధ్యతలు తీసుకున్నారు. దక్షిణాదిపై పెద్దగా దృష్టి పెట్టలేదు. ఉత్తరాదిలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య కొన్ని రాష్ట్రాల్లో హోరాహోరీ పోరు నడుస్తోంది. దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీకి.. ప్రాంతీయ పార్టీల మధ్య పోరు నడుస్తోంది. కర్ణాటకలో బీజేపీతో పోటీ పడుతోంది. అయితే దక్షిణాదిలోనూ బలంగా ఉన్న కొన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీ బలహీనపడుతోందన్న సంకేతాలు వస్తున్నాయి. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజల్లోకి వెళ్లి అధికారం దక్కించుకోవడంలో రెండు సార్లు విఫలం కావడమే కాకుండా ఇప్పుడు మరింతగా బలహీనమవుతోందన్న అభిప్రాయాలు కాంగ్రెస్ మీద వస్తున్నాయి. దీంతో స్వయంగా ప్రియాంకా గాంధీ రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
పార్టీ పరిస్థితిని ప్రియాంకా గాంధీ మార్చేస్తారా ?
ప్రియాంగా గాంధీకి మొదటి టాస్క్‌గా తెలంగాణ ఉండే అవకాశం ఉంది. ఏడాది చివరిలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారం అంతా రచ్చ రచ్చగా ఉంది. ఇప్పుడు ప్రియాంకా గాంధీ ఎంట్రీతో వీటన్నింటికీ చెక్ పెట్టే అవకాశం ఉందని అనుకోవచ్చు. ప్రియాంకా గాంధీ ఇటీవల రాజకీయాలను సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఆమెకు మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయని.. కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతూ ఉంటాయి. ప్రియాంక కాంగ్రెస్ రాత మారుస్తుందని క్యాడర్ గట్టి నమ్మకంతో ఉన్నారు.