Telangana News : దేశ రెండో రాజధానిగా హైదరాబాద్ - అంబేద్కర్ మనవడి సూచనను కేసీఆర్ సీరియస్‌గా తీసుకుంటారా ?
హైదరాబాద్‌ను రెండో రాజధానిగా చేయడానికి బీఆర్ఎస్ అంగీకరిస్తుందా ?ప్రకాష్ అంబేద్కర్ వ్యాఖ్యలను కేసీఆర్ ఎలా తీసుకుంటారు?బీఆర్ఎస్ కార్యాచరణలో ఓ భాగం చేస్తారా ?
Telangana News : హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహా అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ప్రకాష్ అంబేద్కర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిగా చేయాలని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ కన్న కలలను నిజం చేయాలని ఆయన మనుమడు ప్రకాశ్ అంబేడ్కర్ అన్నారు. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని రెండో రాజధాని కోసం కేంద్రాన్ని డిమాండ్ చేయాలని పిలుపునిచ్చారు. దేశ రక్షణ కోణంలో హైదరాబాద్ రెండో రాజధానిగా ఉండాలని అంబేడ్కర్ బలంగా కోరేవారన్నారు. కేసీఆర్ సమక్షంలో చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు బీఆర్ఎస్ స్ట్రాటజీలో భాగం అవుతాయా అన్న చర్చ ప్రారంభమయింది.
తరచూ చర్చల్లోకి వస్తున్న రెండో రాజధాని !
దక్షిణాదిన రెండో రాజధాని ఉండాలన్న ప్రస్తావన చాలా రోజులుగా వస్తున్నదే. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ స్వాతంత్రోద్యమ కాలంలోనే ఈ మాట చెప్పారన్న ప్రచారం ఉంది. హైదరాబాద్ ను సెకెండ్ కేపిటల్ చేయాలంటూ థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్ అనే పుస్తకం 11వ అధ్యాయంలో అంబేడ్కర్ రాశారు. ఈ పుస్తకం 1955లో ప్రచురితమైనప్పుడు జనం అంబేడ్కర్ వాదనతో ఏకీభవించారు అయితే అది కార్యరూపానికి నోచుకోలేదు. తర్వాత మరుగున పడిపోయింది. ఇటీవలి కాలంలో మారిపోతున్న రాజకీయ ప్రాధాన్యలతో ఉత్తర దక్షిణ తారతమ్యాలను పోగొట్టేందుకు సెకెండ్ కేపిటల్ ఒకటి కావాలన్న అభిప్రాయం చాలా రోజులుగా ఉంది. ప్రకాష్ అంబేద్కర్ వ్యాఖ్యలతో మరింత విస్తృతంగా చర్చ ప్రారంభమయింది.
రక్షణ పరంగా హైదరాబాద్ సేఫ్ !
దక్షిణాదిన సౌతిండియాలో ఒక కేపిటల్ ఏర్పాటు చేయాలన ప్రస్తావన వచ్చినప్పుడు రెండు మూడు నగరాల పేర్లు తెరపైకి వచ్చాయి. హైదరాబాద్ తో పాటు బెంగళూరు చెన్నై మహానగరాల పేర్లు కూడా వినిపించాయి. అయితే వాతావరణ సమతౌల్యత విషయంలో అందరూ హైదరాబాద్ కే మొగ్గు కనిపించింది. ల్యాండ్ లాక్డ్ ప్రదేశమైన హైదరాబాద్ కు సెక్యూరిటీ రిస్క్ లేదు. ఏ నగరంతో పోల్చుకున్నా భద్రతలో హైదరాబాద్ కు సాటి లేదు. ప్రకాశ్ అంబేడ్కర్ చెప్పినట్లుగా ఢిల్లీ మన దేశ సరిహద్దుకు కేవలం 300 కిలోమీటర్ల దూరంలో ఉంది. పాకిస్తాన్ దండయాత్రకు చాలా దగ్గరగా ఉంటుందని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. హస్తినాపురి నగరం రోజురోజుకు కాలుష్య కాసారంగా మారిపోతోంది. చలికాలం వచ్చిందంటే చాలు పొల్యుషన్ తో జనం రోగాల బారిన పడుతున్నారు. కాలుష్యం ప్రజలినప్పుడల్లా కేపిటల్ మార్పుపై చర్చ జరుగుతోంది.
ఢిల్లీలో పెరిగిపోయిన సమస్యలు
ఆంగ్లేయుల కాలంలో రాజధానిని కోల్ కతాకు మార్చిన 1911లో మళ్లీ ఢిల్లీకి వచ్చేసింది. అప్పటి నుంచి ప్రతీ ఏటా ఢిల్లీపై వత్తిడి పెరుగుతూనే ఉంది. అందుకే సెకెండ్ కేపిటల్ కావాలన్న డిమాండ్ పెరుగుతోంది. హైదరాబాద్ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చి సెకెండ్ కేపిటల్ గా ప్రకటించాలన్న ప్రతిపాదన చాలా రోజులుగా ఉన్నదే. బీజేపీ ఆ దిశగా ఆలోచిస్తే బావుంటుందన్న చర్చ చాలా రోజులుగా జరుగుతోంది. మోదీ అమిత్ షా అనుకుంటే ఆ పని చేయగలరన్న విశ్వాసమూ అందరికీ ఉంది. సెకండ్ క్యాపిటల్‌గా మారిస్తే బీఆర్ఎస్ అంగీకరించవచ్చు కానీ.. కేంద్ర పాలిత ప్రాంతం అంటే అంగీకరించే సమస్యే ఉండదు. అయితే ఇలాంటి డిమాండ్ బీఆర్ఎస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కార్యక్రమంలోనే వినిపించడం ఆశ్చర్యకరం. దీనిపై బీఆర్ఎస్ స్టాండ్ ను బట్టి తదుపరి అడుగులు ఉండే అవకాశం ఉంది.