Andhra BJP : చేరినోళ్లంతా మళ్లీ వెళ్లిపోతారా ? ఏపీలో బీజేపీకి జనసేన షాక్ తప్పదా?
బీజేపీకి జనసేన దూరం అవుతున్న వాతావరణం ఏర్పడింది. దీంతో ఇప్పటి వరకూ పార్టీలో చేరిన వారంతా గుడ్ బై చెబుతారన్న చర్చ ప్రారంభమయింది.
Andhra BJP : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ - జనసేన కూటమికి బీటలు వారుతున్నాయి. అదే సమయంలో బీజేపీ నుంచి కీలక నేతలు జంప్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ బీజేపీ మాజీ చీఫ్ కన్నా లక్ష్మినారాయణ హింట్ ఇచ్చారు. మరికొందరు అదే బాటలో ఉన్నారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. జనసేన కూడా లేకపోతే.. బీజేపీ బలాన్ని నమ్ముకుని ఏపీలో పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రావని ఎక్కువ మంది నేతలు ఆందోళన చెందుతున్నారు. గతంలో టీడీపీ నుంచి వచ్చి చేరిన నేతలు ఈ విషయంలో మరింతగా ఆలోచిస్తున్నారు. అందుకే రానున్న రోజుల్లో ఏపీ బీజేపీకి మరంత గడ్డు కాలం రావొచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది.
జనసేన దూరం అవుతూండటంతో నిరాశలో బీజేపీ ద్వితీయ శ్రేణి నేతలు!
భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తోంది కానీ.. ఆ పార్టీకి ఏదీ కలసి రావడం లేదు. దీనికి కారణం ప్రతీ రాజకీయ పార్టీ ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాల్సిన ఓటు బ్యాంక్‌ను ఆ పార్టీ ఇప్పటి వరకూ ఏర్పాటు చేసుకోలేకపోయింది. ఫలానా సామాజికవర్గం లేదా ఫలానా వర్గం తమకు అండగా ఉంటుందని బీజేపీ గట్టిగా నమ్మకం పెట్టుకోలేని పరిస్థితి ఉంది. కానీ జనసేన పార్టీకి అలాంటి చఓటు బ్యాంక్ ఉంది. ఈ కారణంగా బీజేపీ నేతల్లో కాస్తంత ధైర్యం ఉండేది. కానీ ఇప్పుడు అనూహ్యంగా జనసేనాధినేత తన వ్యూహం మార్చుకున్నట్లుగా ప్రకటించారు. అయితే ఆయన ఉద్దేశం ప్రకారం టీడీపీతో వెళ్లడం ఖాయమే. అంటే బీజేపీకి గుడ్ బై చెప్పినట్లే. అందుకే.. బీజేపీ ద్వితీయ శ్రేణి నేతల్లో నిరాశ కనిపిస్తోంది. పవన్ కల్యాణ్‌ను తమతో ఉంచుకోలేకపోయామన్న అసంతృప్తి కనిపిస్తోంది.
గతంలో వెల్లువలా వచ్చిన చేరికలు ఇప్పుడు రివర్స్ అయ్యే అవకాశం !
గత ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితుల కారణంగా అనేక మంది నేతలు భారతీయ జనతా పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో ఏకంగా విలీనం అయ్యారు. కొంత మంది ప్రజా జీవితంలో లేనప్పటికీ మరికొంత మంది ప్రజల్లో ఆదరణ ఉన్న నేతలు బీజేపీలో చేరారు. బాపట్ల నుంచి అన్నం సతీష్, జమ్మలమడుగు నుంచి ఆదినారాయణరెడ్డి, ధర్మవరం నుంచి వరదాపురం సూరితో పాటు చాలా మంది నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అలాంటి వారి రాకతో బీజేపీ బలపడినట్లయింది. ఇప్పటికిప్పుడు బీజేపీ మీటింగ్ జరిగితే.. ఇలా వచ్చి చేరిన నేతలే సగం మంది ఉంటారు. కానీ ఇప్పుడు వారిలో సగం మంది రివర్స్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆదినారాయణరెడ్డి తన సోదరుడి కుమారుడ్ని టీడీపీలో చేర్పించారు. వరదాపురం సూరి టీడీపీ అధినేత గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారు. కన్నా లక్ష్మినారాయణ అయితే ఓ అడుగు ముందే ఉన్నారు. ఇలా వలస వచ్చిన వారంతా రివర్స్ అయితే మళ్లీ బీజేపీ పరిస్థితి మొదటికి వస్తుంది.
పొత్తు ఉంటే..పార్టీ నేతలు ఆగే అవకాశం !
బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని అనిపిస్తూండటం వల్లనే ఎక్కువ మంది నేతుల ఆ పార్టీలో ఉండే ధైర్యం చేయలేకపోతున్నారు. ఈ సారి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేసి గెలవాలంటే.. ప్రధాన పార్టీల అభ్యర్థిగా లేదా వారి మద్దతుతోనే పోటీ చేయాలని భావిస్తున్నారు. బీజేపీ తరపున పోటీ చేస్తే గెలవలేమని నమ్ముతున్నారు. అదే సమయంలో పొత్తులో ఉంటే మాత్రం నేతలు బీజేపీలోనే కొనసాగే అవకాశం ఉంది. జనసేన, టీడీపీతో కలిసి బీజేపీ వెళ్లాలని అనుకుంటే మాత్రం ఆ పార్టీ నేతలు... బీజేపీలోనే కొనసాగే అవకాశం ఉందంటున్నారు. అయితే ఏపీలో బీజేపీకి ఉన్న బలం ప్రకారం.. ఆ పార్టీకి సీట్లు కేటాయించేందుకు టీడీపీ, జనసేన సిద్ధపడే అవకాశాలు ఉండవు. అందుకే నేతలు డైలమాలో పడుతున్నారు.
మొత్తంగా జనసేన పార్టీ దూరం పెట్టడం వల్ల.. ఏపీ బీజేపీకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. పార్టీ నేతల్ని కాపాడుకోవడానికి బీజేపీ ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.