Why YSRCP Support BJP : పార్లమెంట్‌లో బేషరతుగా మద్దతు - అడగకపోయినా బీజేపీకి వైసీపీకి మద్దతు ఎందుకు ప్రకటిస్తోంది ?
అడగకపోయినా బీజేపీకే వైసీపీ మద్దతు రాజ్యసభలో వైసీపీ కీలకంఅయినా ఎందుకు షరతులు పెట్టడం లేదు ?రాష్ట్రానికి రావాల్సిన వాటిని ఎందుకు అడగడం లేదు ?కేసుల కోసం రాజీ పడుతున్నారన్న విమర్శలు అందుకే
Why YSRCP Support BJP : పార్లమెంట్ లో అత్యంత కీలకమైన బిల్లులు చర్చకు రాబోతున్నాయి. ఢిల్లీ ప్రభుత్వ అధికారాలు తగ్గిస్తూ.. లెఫ్టినెంట్ గవర్నర్‌నే ప్రభుత్వంగా మార్చే బిల్లుకు వైఎస్ఆర్‌సీపీ మద్దతు ఇస్తామని ప్రకటించింది. అలాగే ఇండియా కూటమి పెట్టిన అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకమని.. బీజేపీకి తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేసింది. త్వరలో యూనిఫాం సివిల్ కోడ్ బిల్లు పెడితే దానికీ మద్దతిచ్చే అవకాశాలే ఉన్నాయని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ముస్లింలకు నష్టం జరగబోదని.. ఏదైనా జరిగితే తాము అండగా ఉంటామని చెబుతూ బీజేపీకి మద్దతు ప్రకటించవచ్చు. ఇక్కడ విషయం ఏమిటంటే బీజేపీ అసలు మద్దతు ఇవ్వాలని అడగకపోవడం.
ఢిల్లీ ఆర్డినెన్స్ కు మద్దతు కావాలని అడగని బీజేపీ
భారతీయ జనతా పార్టీ రాష్ట్రపతి ఎన్నికల్లో తప్ప మరే సందర్భంలోనూ వైఎస్ఆర్‌సీపీ మద్దతు కావాలని అడగలేదు. కానీ.. వైసీపీ ప్రతి సందర్భంలోనూ బిల్లుకు మద్దతు ప్రకటించింది. అనుకూలంగా ఓటేసింది. రైతు చట్టాలకూ మద్దతు ఇచ్చింది. ఇప్పుడు ఢిల్లీ ఆర్డినెన్స్‌కు మద్దతు కావాలని కూడా బీజేపీ వర్గాలు వైసీపీని అడగలేదు. ఇండియా కూటమి పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకించాలని కూడా అడగలేదు. కానీ.. బీజేపీ వైపు ఉండటం.. తమకు ముఖ్యమన్నట్లుగా వైఎస్ఆర్‌సీపీ ఎంపీలు వ్యవహరిస్తున్నారు . ఆ పార్టీ స్ట్రాటజీ బీజేపీతో సన్నిహితంగా ఉండటం.
ఏపీలో జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ - సర్కార్‌పై విమర్శలు !
ఏపీలో బీజేపీ వైసీపీ ప్రత్యర్థి పార్టీ జనసేనతో పొత్తులో ఉంది. అంతే కాదు.. ఇటీవల వైసీపీ సర్కార్ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. కేంద్రం నుంచి ఏపీ పర్యటనకు వచ్చిన అమిత్ షా, జేపీ నడ్డా కూడా ఏపీలో ఉన్నది అవినీతి ప్రభుత్వమని విమర్శించారు. అయితే వైసీపీ నేతలు వారి విమర్శలను కూడా టీడీపీ స్కిప్ట్ అని కవర్ చేసుకున్నారు కానీ బీజేపీ అగ్రనేతల్ని.. బీజేపీని విమర్శించడానికి సిద్ధపడలేదు. ఓ రకంగా వైఎస్ఆర్‌సీపీ .. తమను విమర్శించే బీజేపీ నేతలను టీడీపీ గాటన కట్టేస్తోంది. మిగతా విషయాల్లో బీజేపీ వెంట నడుస్తోంది. వారు చేసే విమర్శలకు కూడా సమాధానం ఇవ్వలేకపోతోంది. జనసేనతో కలిసి వైసీపీ సర్కార్ ను దింపేస్తామని కూడా చెబుతోంది. అయినా బీజేపీకి దూరమవ్వాలని అనుకోవడం లేదు వైఎస్ఆర్‌సీపీ.
రాజ్యసభలో వైసీపీ బలం కీలకం
రాజ్యసభలో ఏ బిల్లు పాసవ్వాలన్నా... వైసీపీ మద్దతు కీలకం. రాజ్యసభలో మొత్తం 245 స్థానాలు ఉండగా అందులో 8 ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. అంటే ఎగువ సభలో 237 సీట్లు ఉన్నాయి.
చట్టాన్ని తీసుకురావాలంటే బీజేపీకి కనీసం 119 మంది రాజ్యసభ సభ్యుల మద్దతు అవసరం.ప్రస్తుతం ఎగువ సభలో బీజేపీకి 92 మంది సభ్యులున్నారు. గత వారం ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు హర్‌ద్వార్ దూబే మరణించడంతో అది ఒక స్థానాన్ని కోల్పోయింది. ఇతర మిత్రపక్షాలతో కలిపి, రాజ్యసభలో BJP నేతృత్వంలోని NDA మొత్తం బలం 109. ఎగువ సభ ద్వారా బిల్లును విజయవంతంగా చూడాలంటే దానికి మరో 10 మంది సభ్యుల మద్దతు అవసరం. బిజెడి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ రెండింటికీ 9 మంది సభ్యులు ఉన్నారు. ఈ రెండు పార్టీలు బీజేపీకే మద్దతిస్తున్నాయి. ఇవ్వకపోతే బిల్ పాసవడం కష్టం. అంటే సభలో BJD మద్దతు ఇచ్చినప్పటికీ బిజెపికి 1 ఓటు తగ్గుతుంది. అంటే.. వైసీపీ డిమాండ్ చేయగలిగే స్థితిలోనే ఉందని అనుకోవచ్చు.
కనీసం రాష్ట్ర ప్రయోజనాల డిమాండ్లు అయినాపెట్టలేరా ?
బీజేపీకి మద్దతు ప్రకటిస్తున్న వైసీపీ.. కేంద్రం నుంచి రాష్ట్రం కోసం రావాల్సిన ప్రయోజనాలను.. విభజన చట్టంలోని అంశాలను డిమాండ్ చేయలేకపోతోంది. అందుకే వ్యక్తిగత కేసుల కోసమే.. మొత్తం రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెడుతున్నారని విపక్షాలతో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అయినా వైసీపీ వాటిని పట్టించుకోవడం లేదు