Liquor Scam Politics : కవిత హస్తం ఉంటే చెప్పాల్సింది సీబీఐనా ? బీజేపీనా ? ముందస్తు ఆరోపణలు రాజకీయమేనా ?
ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ ఏమీ చెప్పకుండానే కల్వకుంట్ల కవితను ఎందుకు బీజేపీ కార్నర్ చేస్తోంది. రాజకీయంగా ఒత్తిడి తెచ్చే వ్యూహమేనా ?
Liquor Scam Politics : ఢిల్లీ లిక్కర్ స్కాం ఢిల్లీలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రకంపనలు రేపుతోంది. ఇంకా చెప్పాలంటే ఢిల్లీ కంటే తెలంగాణలోనే ఎక్కువ రీ సౌండ్ వస్తోంది. ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ ప్రత్యేకంగా ప్రెస్‌మీట్లు పెట్టి కేసీఆర్ కుమార్తె, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితను టార్గెట్ చేశారు. అసలు మొత్తం ఆమె కనుసన్నల్లోనే జరిగిందని ఆరోపిస్తున్నారు. ఎవరెవరు చర్చల్లో పాల్గొన్నది..ఎంత చేతులు మారింది కూడా చెబుతున్నారు. అందుకే ఈ విషయం కలకలం రేపుతోంది. సహజంగానే ఈ ఆరోపణల్ని కవిత ఖండించారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటున్నారు. అయితే ఢిల్లీలో లిక్కర్ స్కాం జరిగితే తెలంగాణపై ఎందుకు గురి పెట్టారు ? సీబీఐ ఏమీ చెప్పకుండానే బీజేపీ నేతలు ఎందుకు కవితను టార్గెట్ చేశారు ? ఢిల్లీ నుంచి బీజేపీ తెలంగాణపై గురి పెట్టిందా ?
సీబీఐ కన్నా ముందే బీజేపీ ఆరోపణలు!
నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత పేరును ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో బీజేపీ ఎంపీ నేరుగా ప్రస్తావించడంతో తెలంగాణలో రాజకీయ సంచలనం అయింది. నిజానికి ఈ అంశంపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అందులో ఓ తెలుగు ఐఏఎస్ అధికారి పేరు అలాగే.. హైదరాబాద్‌లో శాశ్వత నివాస చిరునామా ఉండి..బెంగళూరు కేంద్రంగా వ్యాపారం చేస్తున్న అరుణ్ రామచంద్ర పిళ్లై పేర్లు ఉన్నాయి. కానీ వీరు ఫలానా తెలంగాణ నేతలతో కుమ్మక్కయ్యారని.. ఎఫ్ఐఆర్‌లో ఎక్కడా ప్రస్తావించలేదు. కల్వకుంట్ల కవిత పేరు అసలే లేదు. కానీ బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ మాత్రం పూర్తిగా తెలంగాణపైనే దృష్టి కేంద్రీకరించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంకు కేంద్రం హైదరాబాద్ అని.. మనీష్ సిసోడియా చాలా సార్లు హైదరాబాద్ వెళ్లి చర్చలు జరిపి డీల్ కుదుర్చుకుని వచ్చారని ఆరోపించారు. సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన రోజున ఈ మాట చెప్పారు. కానీ తర్వాతి అంటే ఆదివారం.. మరింత దూకుడైన ఆరోపణలు చేసారు. నేరుగా కల్వకుంట్ల కవితను టార్గెట్ చేశారు. నిజంగా ఇలాంటిదేమైనా ఉంటే.. సీబీఐ దర్యాప్తులో తేలుతుంది. కానీ అలాంటిదేమీ లేకుండా తామే దర్యాప్తు చేసినట్లుగా బీజేపీ ఎంపీ ప్రకటించడం అందరిలోనూ ఆశ్చర్యానికి కారణం అవుతోంది.
అసలు టార్గెట్ కేసీఆరేనా ?
కల్వకుంట్ల కవిత ఇప్పుడు ఎంపీ కూడా కాదు. కానీ ఆమెను బీజేపీ టార్గెట్ చేయడం వెనుక రాజకీయం ఉందన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. టీఆర్ఎస్ జాతీయ రాజకీయాలను కేసీఆర్ తరపున ఆయన సమన్వయం చేస్తున్నారు. ఇంత మాత్రం దానికే కవితపై బీజేపీ ఆరోపణలు చేసే అవకాశం లేదు. బీజేపీ అసలు టార్గెట్ కేసీఆరేనని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. ఎంపీ పర్వేశ్ శర్మ కూడా ...కేసీఆర్‌కు తెలియకుండా కవిత ఈ స్కాంను డీల్ చేయరని వాదిస్తున్నారు. అంటే.. ఎలా చూసినా.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరును ప్రస్తావించడం ద్వారా కేసీఆర్‌పై ఒత్తిడి పెంచాలన్న వ్యూహం బీజేపీ అమలు చేస్తోందని భావిస్తున్నారు.
రేపు సీబీఐ ఇవే ఆరోపణలు చేసినా నమ్ముతారా ?
అయితే కవిత ప్రమేయం లేకుండా.. తాము ఎందుకు ఆరోపణలు చేస్తామని బీజేపీ నేతలు వాదిస్తున్నారు. అదీ కూడా ఢిల్లీ బీజేపీ ఎందుకు చేస్తారని.. తమకు పక్కా సమాచారం ఉందని బీజేపీ నేతలు అంటున్నారు. అలాంటి సమాచారం ఏదైనా ఉంటే.. ముందుగా సీబీఐ చట్టపరమైన చర్యలు తీసుకుంటే నమ్మశక్యంగా ఉంటుంది కానీ..బీజేపీ నేతలు ఇలా ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా రాజకీయమనే అనుకుంటారు. ప్రస్తుతం అదే జరుగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో బయటపడుతున్న..బయటపడిన విషయాలను అడ్డం పెట్టుకుని బీజేపీ రాజకీయం చేయాలనుకుంటోందన్న అనుమానాలు టీఆర్ఎస్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇవాళ బీజేపీ నేతలు చెప్పిన విషయాల్నే రేపు తాము దర్యాప్తులో కనుగొన్నామని సీబీఐ అధికారులు ప్రకటిస్తే.. చాలా మందికి సందేహాలు వస్తాయి. బీజేపీ నేతలు చెప్పిందే సీబీఐ చెబుతోందని విమర్శలు వస్తాయి. ఒక వేళ సీబీఐ ఆ ఆరోపణలు చేయకపోతే బీజేపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేసినట్లు ప్రజలు నమ్ముతారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంతో బీజేపీ బడా రాజకీయం చేసే చాన్స్ !
ఢిల్లీలో జరిగినట్లుగా చెబుతున్న లిక్కర్ స్కాం విషయంలో సీబీఐ చర్యలు బీజేపీకి అనేక రాజకీయ అంశాల్లో కలిసి వచ్చేలా చేయనున్నాయి. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ చురుగ్గా పని చేస్తోంది. సిసోడియాను అరెస్ట్ చేస్తే కేజ్రీవాల్ ఒంటరి అవుతారు. అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకూ చిక్కని పట్టు ఈ స్కాంతో చిక్కే అవకాశం ఉంది. తెలంగాణతో పాటు ఏపీకి చెందిన వారు కూడా ఈ స్కాంలో ఉన్నారని....నేరుగా వైసీపీ హైకమాండ్‌పైనే కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ విజయవాడలో విమర్శలు చేశారు. త్వరలో అన్నీ బయటకు వస్తాయన్నారు. ఎలా చూసినా.. బీజేపీకి ఢిల్లీలో తీగ దొరికింది.. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్ని లాగేస్తోంది. ఎక్కడి వరకూ లాగగలరనేది కాలమే తేల్చాలి..!