Andhra Fake Votes : ఎక్కడా లేని ఫేక్ ఓట్ల వివాదం ఏపీలోనే ఎందుకు ? అంత ఈజీగా ఓటర్ల జాబితాను మార్చేయవచ్చా ?
ఆంధ్రప్రదేశ్‌లోనే ఫేక్ ఓట్ల దుమారం ఎందుకు ?రాజకీయ పార్టీలు అన్ని గీతలు దాటిపోతున్నాయా ?అధికార దుర్వినియోగం జరుగుతోందా ?ఓటర్ల జాబితాలో అనూహ్యమైన మార్పు చేర్పులు ఎందుకు ?
Andhra Fake Votes : ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితాను ఇష్టారీతిన మార్చేశారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. స్వయంగా సీఈవో కూడా ఇది నిజమేనని కరెక్ట్ చేస్తామని అంగీకరించాల్సి వచ్చింది. తర్వాత సీఈవోను.. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పిలిచి క్లాస్ తీసుకున్నారన్న ప్రచారమూ జరుగుతోంది. అసలు ఏపీలో ఓటర్ల జాబితాను అంత సులువుగా మార్చేయవచ్చా ? వాలంటీర్ల ఓట్లను కలపడం.. తీసేయడానికి అధికారం కలిగి ఉన్నారా? ఏపీ ఓటర్ల జాబితాలో అసలేం జరుగుతోంది.
కలపడం అయినా తీసేయడం అయినా పక్కా విచారణ తర్వాతే !
ఓటర్ల జాబితాలో ఓట్లు తీసేయడం అయినా..కలపడం అయినా పక్కా విచారణ తర్వాతే చేయాలని నిబంధనలు చెబుతున్నాయి. ఎవరైనా కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ధృవపత్రాలు తీసుకుంటారు. ఇప్పుడు ఆధార్ అప్రకటితంగా అయినా తప్పనిసరి చేశారు. అందుకే ఆధార్ సీడింగ్ చేసుకుంటే డబుల్ ఎంట్రీ ఉండే అవకాశం లేదు. దరఖాస్తు చేసుకున్నా ఇవ్వరు. అదే సమయంలో ఓటర్‌ను లిస్ట్ నుంచి తప్పించాలంటే. ఖచ్చితంగా నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. సమాధానం ఇచ్చిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలి. కానీ ఏపీలో ఇలా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఓటర్లను తీసేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. అలాగే ఎలాంటి ఆధార్ లేకుండానే లక్షల దొంగ ఓట్లను చేర్చారన్న ఆరోపణలూ వస్తున్నాయి.
జీరో డోర్ నెంబర్లతో వేల ఓట్లు ఎలా సాధ్యం ?
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరులో 30వేలకుపైగా జీరో డోర్ నెంబర్ తో ఉన్నాయి. అంటే.. అసలు డోర్ నెంబర్ లేని ఇళ్లలో అంత మంది ఉన్నారన్నమాట. అది నిజమేనా అంటే.. డోర్ నెంబర్ లేని ఇళ్లే ఉండవని అధికారవర్గాలు చెబుతున్నాయి. పంచాయతీల్లోనూ డోర్ నెంబర్లు ఉంటాయి. ఇలాంటి ఓట్లు లక్షల్లో బయటపడ్డాయి. కనీసం పాతిక నియోజకవర్గాల్లో ప్రబావితం చూపే స్థాయిలో ఉన్నాయి. అందుకే ఎక్కువ మంది ఓటర్ల జాబితాను తారు మారు చేశారని నమ్ముతున్నారు. ఆ మధ్య జరిగిన ఉపఎన్నికల్లో .. మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు పెద్ద ఎత్తున టూరిస్ట్ బస్సుల్లో రావడం సంచలనం రేపింది. చివరికి గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ తిరుపతిలో తమిళనాడు నుంచి ఓట్లు వేశారు. అలాంటి ఘటనలు కళ్ల ముందు ఉన్నప్పుడు ఎక్కువ మంది ఓటర్ల జాబితాలో అవకతవకలు వస్తే నమ్ముతారు.
ఆధార్ సీడింగ్ వల్ల ఎక్కవ ఓట్లు గల్లంతయ్యాయా ?
ఓటుకు ఆధార్ అనుసంధానం చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. కానీ అది తప్పనిసరి కాదు. ఓటర్ కు ఇష్టమైతేనే ఇవ్వొచ్చు. ఆధార్ లేదన్న కారణంగా ఓటు హక్కు నిరాకరించలేరు. ఇక్కడే దొంగ ఓట్లను చేర్చుకోవడానికి.. తమకు అనుకూలం కాని పార్టీల ఓటర్లను తొలగించడానికి ఓ అవకాశంగా చేసుకున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున ఓట్ల గల్లంతు ఆరోపణలు ఇందుకే వస్తున్నాయి. రాష్ట్ర స్థాయిలో అధికారుల ప్రమేయంతోనే ఇలా జరుగుతాయి. అందుకే టీడీపీ నేత పయ్యావుల కేశవ్.. నేరుగా సీఈసీకి ఫిర్యాదు చేశారు. అక్కడ్నుంచి ఓ ప్రత్యేక టీమ్ ను.. ఉరవకొండకు పంపించారు. దీంతో అక్రమాలు బయటపడ్డాయి. ఇద్దరు ముగ్గురు బీఎల్వోలను సస్పెండ్ చేశారు.
ప్రజలందరూ స్వేచ్చగా ఓటు వేయగలిగినప్పుడే ప్రజాస్వామ్యానికి అర్థం
ప్రజలందరూ..ఎవరి ఓట్లను వారు స్వేచ్చగా ఓటు వేసినప్పుడే ప్రజాస్వామ్యానికిసార్థకత ఉంటుంది. తమకు ఇష్టం లేనివారి ఓట్లను తీసేసి అనుకూలమైన వారితో ఓటింగ్ చేయించుకుని గెలిచామని అనుకుటే అది నియంతృత్వానికి దారి తస్తుందన్న వాదన ఉంది. అందుకే ఈసీ కూడా ఓటర్ల జాబితాపై ప్రత్యేక దృష్టి పెడుతుంది. కానీ ఎంత పక్కగా ఓటర్ల జాబితా రెడీ చేస్తుందన్నదే కీలకం. అంతా అయిపోయాక సారీ చెబితే.. అది ప్రజాస్వామ్యానికి ద్రోహంచేసినట్లే అవుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.