ఊరి మీద విరుచుకుపడి ప్రాణాలు తీసేసిన పెద్దపులి
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మహిళపై పెద్దపులి దాడి చేయడం సంచలనం అయింది. ఈ పెద్దపులి దాడిలో ఆ మహిళ మృతి చెందింది. కాగజ్ నగర్ మండలంలోని బెంగాల్ క్యాంప్ 6వ నెంబర్ లో గన్నారం గ్రామానికి చెందిన మోర్లే లక్ష్మీ అనే మహిళపై పులి దాడి చేసింది. పులి సంచారంతో కాగజ్ నగర్ సమీప ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే జిల్లాలో పులి దాడిలో ముగ్గురు మరణించిన విషయం అందరికి తెలిసిందే. అదేవిధంగా ఏనుగు దాడిలో ఇద్దరు మరణించారు. అయిన ఫారెస్ట్ అధికారుల నుంచి ఎటువంటి చలనం లేదని.. తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కమిటీ విమర్శిస్తోంది. పెద్దపులిని వెంటనే బంధించి తడోబా పులుల సంరక్షణ ప్రాంతానికి తరలించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. పులి దాడిలో చనిపోయిన లక్ష్మీ కుటుంబానికి న్యాయం చేయాలని.. మహారాష్ట్ర తరహాలో 15 లక్షల ఎక్స్ గ్రెషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు, 5 ఎకరాల సాగు భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు.