Ts Congress : పొత్తులపై అసందర్భ ప్రకటనలు - తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు బీఆర్ఎస్‌కు మేలు చేస్తున్నారా ?
పొత్తులపై ఎందుకు ప్రకటనలు చేస్తున్నారు ?పోరాడుతున్న ప్రత్యర్థితో పొత్తులని ప్రచారం చేసుకుంటారా?ఇలాంటి ప్రచారం జరిగితే ప్రత్యామ్నాయంగా గుర్తిస్తారా ?రేవంత్ పోరాటాన్ని తక్కువ చేస్తున్నారా ?
Ts Congress : భారత రాష్ట్ర సమితి తెలంగాణ రాజకీయాల్లో అధికార పార్టీ. ఆ పార్టీతో పోటీ పడి.. ఓడించి అధికారం చేపట్టాలని కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ వద్దని ప్రజలు అనుకుంటే ..ఈ రెండింటిలో ఏ పార్టీ ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని ప్రజలు భావిస్తే..... ఆ పార్టీకి ఓట్లేస్తారు. అంటే ఇక్కడ ప్రధానంగా కావాల్సింది బీఆర్ఎస్ ప్రత్యర్థి హోదా. ప్రత్యామ్నాయం కేటగిరి. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఏం చేస్తున్నారు ? బీఆర్ఎస్‌తో పొత్తులంటూ ప్రకటనలు చేస్తున్నారు. దీని వల్ల ఎవరికి లాభం ? బీఆర్ఎస్‌కా ? కాంగ్రెస్ పార్టీకా ?
బీఆర్ఎస్‌తో పొత్తు కోసం సీనియర్లు తాపత్రయ పడుతున్నారా ?
కొద్ది రోజుల కిందట కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీలో బీఆర్ఎస్‌తో పొత్తుల గురించి మాట్లాడారు. ఎంత రచ్చ కావాలో అంతా అయింది. ఆ తర్వాత తీరిగ్గా తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని లైట్ తీుకున్నారు. కానీ ప్రజల్లో మాత్రం చర్చ ప్రారంభమయింది. తాజాగా సీనియర్ నేత జానారెడ్డి కూడా అదే మాట్లాడారు. రాహుల్ గాంధీ ఇష్యూలో బీఆర్ఎస్ మద్దతు పలికిందని ఆ పార్టీతో పొత్తులు పెట్టుకునే అవకాశం ఉందని తేల్చారు. ఆయన మాటలు మరోసారి కలకలం రేపాయి. సాయంత్రానికి తాను ఆ మాటలు మాట్లాడలేదని కవర్ చేసుకున్నారు. కానీ జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోయింది. అయితే సీనియర్ నేతలు ఉద్దేశపూర్వకంగానే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. బీఆర్ఎస్‌తో పొత్తు విషయాన్ని ముందుకు తీసుకెల్లాలని అనుకుంటున్నారన్న అభిప్రాయం ఆ పార్టీలోనే వినిపిస్తోంది.
చావో రేవో అన్నట్లుగా పోరాటం చేస్తున్న రేవంత్ !
మరో వైపు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చావో రేవో అన్నంతగా పోరాటం చేస్తున్నారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ఆయన ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. కేటీఆర్ ను కార్నర్ చేస్తున్నారు. రాహుల్ అనర్హతా అంశంలో కేటీఆర్ .. పాజిటివ్ వ్యాఖ్యలు చేసినా వదిలి పెట్టలేదు.బీఆర్ఎస్‌పై ఏ మాత్రం సాఫ్ట్ కార్నర్ చూపించినా మొదటికే మోసం వస్తుందని.. రెండు పార్టీలు ఒకటే అనే అభిప్రాయం ప్రజల్లో బలపడితే కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోతుందని రేవంత్ రెడ్డికి తెలుసు. అందుకే జాతీయ స్థాయి రాజకీయాల గురించి పట్టించుకోకుండా పోరాటం ఉద్ధృతం చేస్తున్నారు. పాదయాత్రను కొనసాగించబోతున్నారు. ఇాలాంటి పరిస్థితుల్లో సీనియర్ల కామెంట్లు ఆయన పోరాటాన్ని బలహీనం చేస్తున్నాయన్న అభిప్రాయాన్ని కొంత మంది వ్యక్తం చేస్తున్నారు. పొత్తులపై మాట్లాడకుండా హైకమాండ్ కట్టడి చేయాల్సి ఉందంటున్నారు.
ఎన్నికల తర్వాత పొత్తుల గురించి ఇప్పుడెందుకు ?
ఎలా చూసినా తెలంగాణలో ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకునే అవకాశాలు లేనే లేవు. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చే ఫలితాలను బట్టి తర్వాత ఎవరు ఏ పార్టీతో కలుస్తారు అసలు కలుస్తారా లేదా అన్నది తేలుతుంది. హంగ్ లాంటి పరిస్థితి వస్తే కాంగ్రెస్, బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ కలవవు కాబట్టి బీఆర్ఎస్ ఎవరితో కలవాలనుకుంటే వారితో కలుస్తుంది. బీజేపీపై ఇప్పుడు బీఆర్ఎస్ తీవ్రంగా పోరాడుతూ ఉండవచ్చు.. కానీ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరు. అందుకే ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో అంచనా వేయడం కష్టం. వచ్చే ఫలితాలను బట్టి పరస్పర రాజకీయ ప్రయోజనాలను బట్టి పార్టీలు నిర్ణయం తీసుకుంటాయి. కానీ కానీ కాంగ్రెస్ పార్టీ సీనియర్లు మాత్రం ముందే తొందరపడి ప్రకటనలు చేస్తున్నారు.