CM Lokesh: ఇక లోకేష్ సీఎం నినాదం - చంద్రబాబు ఢిల్లీ వెళ్తారా ?
Andhra Pradeshఛ: లోకేష్‌ను సీఎం చేయాలనే డిమాండ్ టీడీపీలో వినిపిస్తోంది. వ్యూహాత్మకంగానే వినిపిస్తున్నారా?
![CM Lokesh: ఇక లోకేష్ సీఎం నినాదం - చంద్రబాబు ఢిల్లీ వెళ్తారా ? What is the strategy behind the slogan CM Lokesh CM Lokesh: ఇక లోకేష్ సీఎం నినాదం - చంద్రబాబు ఢిల్లీ వెళ్తారా ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/20/c5a244f44b4fd5af5191bdde593a8ab41737391367641228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
What is the strategy behind the slogan CM Lokesh: డిప్యూటీ సీఎం నారా లోకేష్ అనే నినాదాన్ని ఆపాలని టీడీపీ హైకమాండ్ ఇలా ఆదేశాలు ఇచ్చిన వెంటనే అలా ఏకంగా ముఖ్యమంత్రి నినాదాన్ని వినిపించారు. అదీ కూడా చంద్రబాబు,లోకేష్ సమక్షంలోనే. జ్యూరిచ్ లో చేసిన ఈ ప్రకటన ఏపీ రాజకీయాల్లో హైలెట్ అయింది. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఎందుకు లోకేష్ సీఎం నినాదం తీసుకు వస్తున్నారన్నది టీడీపీ వర్గాలోనే కాదు మొత్తం ఏపీ రాజకీయవర్గాల్లోనే చర్చనీయాంశం అవుతుంది. చంద్రబాబు వారసుడి కోసం ప్లాన్ బీ అమలు చేస్తున్నారా అన్న సందేహాలు ప్రారంభమయ్యాయి.
తిరుగులేని మెజార్టీతో ఉన్న తెలుగు దేశం
తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఎవరు సీఎంగా ఉండాలో నిర్ణయించుకునే శక్తి ఉంది. సాధారణ మెజార్టీకి 88 మంది ఎమ్మెల్యేలు అవసరం అయితే.. అంత కంటే యాభై మంది ఎక్కువే ఉన్నారు. మిత్రపక్షాలతో కలిస్తే ఇక చెప్పాల్సిన పని లేదు. ఒక వేళ మిత్రపక్షాలు నారా లోకేష్ ను సీఎంగా అంగీకరించకపోతే.. ఆయనకు అంత అనుభవం లేదని అనుకుంటే... టీడీపీ సొంతంగా నిర్ణయం తీసుకునేంత బలం ఉంది. అయితే అలాంటి నిర్ణయాలు తీసుకుంటారా లేదా అన్నది మాత్రం సస్పెన్స్. 99శాతం తీసుకోరని చంద్రబాబు రాజకీయాల గురించి అవగాహన ఉన్న వారికి ఓ స్పష్టత ఉంటుంది.
చంద్రబాబు ఢిల్లీకి వెళ్లే ఆలోచనలో ఉన్నారా ?
వారసుడ్ని ట్రాక్‌లో పెట్టాలని చంద్రబాబు అనుకోకుండా ఉండరు. కేంద్రంలో రాహుల్ గాంధీ, తెలంగాణలో కేటీఆర్‌ల పరిస్థితి చూస్తే.. నారా లోకేష్‌కు అలాంటి పరిస్థితి రాకుండా ముందుగానే సీఎంను చేసి ఆయనను పాలనా పరంగా కూడా నిరూపించుకునే అవకాశం కల్పించాలన్న ఆలోచన బాగుంటుందని అనుకుంటున్నారు. కేటీఆర్ ను చాలా సార్లు సీఎంను చేస్తారనే ప్రచారం జరిగింది. చివరికి అలాంటిది జరగకుండానే బీఆర్ఎస్ ఓడిపోయింది. ఇప్పుడు ప్రతిపక్ష నేత కేటీఆర్ పోరాడుతున్నారు. నారా లోకేష్‌కు ఈ అవకాశం ముందే వచ్చింది. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో కష్టాలకు ఎదురీది రాజకీయం చేశారు. పాదయాత్ర చేసి తన ఇమేజ్ ను పూర్తిగా మార్చుకున్నారు. పార్టీపై, ప్రభుత్వంపై పట్టు సాధించే దిశగా వెళ్తున్నారు. అందుకే చంద్రబాబు మరో ఏడాదికైనా.. లోకేష్ సీఎం అనే చర్చ పెట్టి మిత్రపక్షాలను ఒప్పించి పగ్గాలు అప్పగించి తాను ఢిల్లీకి వెళ్లే ఆలోచన చేయవచ్చని అంచనా వేస్తున్నారు.
మిత్రపక్షాలను మెల్లగా ఒప్పించడానికే చర్చలు !
టీడీపీకి పూర్తి స్థాయిలో మెజార్టీ ఉండవచ్చు కానీ.. కూటమిగా పోటీ చేశారు. అలాంటి సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. కూటమిలో చర్చించి తీసుకోవడం నైతికం. అందుకే చంద్రబాబు ఆ పార్టీల మద్దతు పొందేందుకు మెల్లగా ఈ అంశాన్ని చర్చకు పెడుతున్నారన్న అభిప్రాయం కూడా ఉంది. అయితే చంద్రబాబు రాష్ట్రాన్ని గట్టెక్కించాలన్న ఓ మిషన్ మీద ఉన్నారు. పోలవరం, అమరావతి, బనకచర్ల ప్రాజెక్టుల్ని పూర్తి చేసి ఏపీకి ఓ దశ..దిశ తీసుకు రావాలనుకుంటున్నారు.వచ్చే ఐదేళ్ల పాటు ఆయన ఇదే ఆలోచన చేస్తారని మరో ఆలోచన చేయరని టీడీపీ వర్గాలంటున్నాయి. ఇప్పుడు జరుగుతున్న ప్రచారం అంతా వ్యక్తిగత అభిప్రాయాలేనని అంటున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)