Governor Vs Government : తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య వివాదం ఎందుకు ? అసలు సమస్య ఏమిటి ?
తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య ఉన్న అసలు వివాదం ఏమిటి ?సద్దుమణిగిందన్న వివాదం ఎందుకు పెద్దదయింది ?సుప్రీంకోర్టుకు వెళ్లే ముందు రాజ్ భవన్‌కు ఎందుకెళ్లలేదు?
Governor Vs Government : తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య ఏర్పడిన వివాదం బడ్జెట్ సమావేశాల సందర్భంగా జరిగిన పరిణామాలతో ముగిసిపోయిందని అనుకున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం అనూహ్యంగా సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో గవర్నర్, ప్రభుత్వం మధ్య సానుకూల వాతావరణం ఏర్పడలేదని స్పష్టయింది. ఇప్పుడు ప్రభుత్వం కోర్టుకు వెళ్లడంతో వివాదం మరింత ముదిరినట్లయింది. ఢిల్లీకి వెళ్లే బదులు రాజ్ భవన్‌కు రావాల్సిందని గవర్నర్ తమిళిసై.. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. సీఎస్ అసలు గౌరవించడం లేదని ఆమె అంటున్నారు. దీంతో అసలు సమస్య ఏమిటన్నది రాజకీయ వర్గాలకూ అంతుబట్టడం లేదు.
పది బిల్లులు పెండింగ్‌లో పెట్టిన గవర్నర్ తమిళిసై !
ప్రస్తుతం తెలంగాణ గవర్నర్ వద్ద అసెంబ్లీ ఆమోదించిన పది బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఉభయ సభలు ఆమోదముద్ర వేసిన 8 బిల్లుల్లో ఒక్క బిల్లును మాత్రమే ఆమోదించారు. ఏడు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ఆమోదించిన బిల్లుల్లో ద్రవ్య వినిమయ బిల్లుకు వెంటనే ఆమోదముద్ర వేసిన గవర్నర్ తమిళి సై మరో మూడు బిల్లులపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మొత్తం పది బిల్లులపై గవర్నర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. దీనిపై గతంలో తెలంగాణ మంత్రులు విమర్శలు గుప్పించారు. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లింది. గవర్నర్ బిల్లులను ఆమోదించడంలేదని.. వెంటనే నిర్ణయం తీసుకునేలా గవర్నర్ ను ఆదేశించాలని కోరింది.
హైకోర్టుకు వెళ్లి పూర్తిగా వెనక్కి తగ్గిన తెలంగాణ ప్రభుత్వం !
గవర్నర్‌పై న్యాయస్థానానికి వెళ్లడం తెలంగాణ ప్రభుత్వానికి ఇదే మొదటి సారి కాదు. ఇటీవల గవర్నర్ అసెంబ్లీలో పెట్టాలనుకున్న బడ్జెట్‌ను ఆమోదించకపోవడంతో హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే తర్వాత ఆ బిల్లును ఉపసంహరించుకుని గవర్నర్ ప్రసంగాన్ని అసెంబ్లీలో పెట్టేందుకు అంగీకరించారు. ప్రసంగం సాఫీగా సాపోయింది. గవర్నర్ కు ప్రోటోకాల్ విషయంలో ఇబ్బంది రానీయలేదు. దానికి తగ్గట్లుగానే గవర్నర్ కూడా ఎక్కడా ప్రసంగంలో వివాదాల జోలికి వెళ్లలేదు. అలాగే ద్రవ్య వినిమయ బిల్లును కూడా ఆమోదించారు. కానీ ఇతర బిల్లులను పెండింగ్‌లో పెట్టారు. దీంతో వివాదం ప్రారంభమయింది.
ప్రోటోకాల్ దగ్గరే వివాదం ఏర్పడుతోందా ?
బడ్జెట్ సమావేశాల దగ్గర సఖ్యత కుదిరినా తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ కు కల్పించాల్సిన ప్రోటోకాల్ కల్పించకపోవడంతోనే గవర్నర్ గుర్రుగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. చీఫ్ సెక్రటరీ తనను మర్యాదపూర్వకంగా కూడా కలవడం లేదని.. ఇవ్వాల్సిన ప్రోటోకాల్ కూడా ఇవ్వడం లేదని భావిస్తున్నారు. మామూలుగా కొత్త సీఎస్ వస్తే గవర్నర్ ను మర్యాదపూర్వకంగా కలుస్తారు. కానీ సీఎస్ శాంతి కుమారి కలవలేదు. రిపబ్లిక్ డే వేడుకల్లో హైకోర్టు ఆదేశాల మేరకు పాల్గొన్నారు కానీ.. ప్రత్యేకంగా సమావేశం కాలేదు. అలాగే గవర్నర్ ..రాజకీయం చేస్తున్నారని ఆమెకు ప్రోటోకాల్ ఇవ్వాల్సిన అవసరం ఏమిటన్న భావనలో బీఆర్ఎస్ నేతలుున్నారు. దీంతో వివాదం మళ్లీ ప్రారంభమయిందని భావిస్తున్నారు.
గవర్నర్ బిల్లులను తిరస్కరిస్తే మరోసారి అసెంబ్లీలో ఆమోదించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నించే అవకాశం ఉంది. ఆమోదిస్తే సమస్య ఉండదు. అటు ఆమోదించకుండా.. ఇటు తిరస్కరిచకుండాపెండింగ్‌లో పెట్టడంతో ఆ చట్టాలను అసెంబ్లీ పాస్ చేసినా.. ఆమల్లోకి రావడం లేదు.