(Source: ECI/ABP News/ABP Majha)
వైఎస్ షర్మిల అరెస్ట్ తర్వాత ఏం జరగబోతుంది?
పాదయాత్ర మొదట్లో షర్మిల తెలంగాణకి వైఎస్సార్ హయాంలో ఎలాంటి మేలు చేశారో..సంక్షేమ ఫలాలు ఎలా అందించారో చెప్పుకొచ్చారు షర్మిల. తన తండ్రి పాలన తిరిగి రావాలంటే అవకాశం ఇవ్వాలని కోరారు.
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అరెస్ట్ తో తెలంగాణలో మరోసారి రాజకీయాలు రసకందాయంలోపడ్డాయి. అధికారపార్టీపై ఓ వైపు బీజేపీ ఇంకోవైపు షర్మిల శృతిమించిన మాటలతో టార్గెట్ చేయడం వల్లే ఈ దాడులు జరిగాయని కొందరు అంటున్నారు. తప్పులను ఎత్తిచూపితే అరెస్ట్ లు చేస్తారా అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇంతకీ షర్మిల అరెస్ట్ ఎవరికి లాభం ?
తెలంగాణలో కారు పార్టీకి ఓ వైపు బీజేపీ మరోవైపు వైఎస్సార్ తెలంగాణ పార్టీ చుక్కలు చూపిస్తోందని టాక్ ఉంది. అయితే ఇందులో నిజం లేదన్న వాదన కూడా ఉంది. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల గత కొన్నినెలలుగా రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్నారు. అయితే ఆశించిన స్థాయిలో షర్మిలకి తెలంగాణ ప్రజల నుంచి మద్దతు లేదన్నది కొందరి వాదన. అందుకే అధికారపార్టీని టార్గెట్ చేసుకొని విమర్శలకు దిగుతున్నారని అవి శృతిమించడం వల్లే ఈ దాడులన్న వాదన కూడా లేకపోలేదు.
పాదయాత్ర మొదట్లో షర్మిల తెలంగాణకి వైఎస్సార్ హయాంలో ఎలాంటి మేలు చేశారో..సంక్షేమ ఫలాలు ఎలా అందించారో చెప్పుకొచ్చారు షర్మిల. తన తండ్రి పాలన తిరిగి తెలంగాణలో రావాలంటే తమ పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరారు. ఇలా సాగుతున్న షర్మిల పాదయాత్రలో రోజులు గడుస్తున్న కొద్దీ అధికారపార్టీపై విమర్శలు కూడా పెరుగుతూ వచ్చాయి. ఫాంహౌజ్ సిఎం అని, అవినీతి పాలనని కెసిఆర్ పై విమర్శలు చేయడమే కాకుండా ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపిస్తూ పాదయాత్రని కొనసాగిస్తూ వచ్చారు. అయితే షర్మిల విమర్శలను గులాబీదళం పెద్దగా పట్టించుకోలేదు. ఆపార్టీ నేతలెవరూ అసలు షర్మిల పేరు ఎత్తడానికి కూడా అంతగా ఆసక్తి చూపించలేదు. సోషల్ మీడియా వేదికగా షర్మిలకి కౌంటర్లు ఇస్తూ వచ్చారు.
పెద్దగా ప్రభావం చూపించకుండా సాగిపోతున్న షర్మిల పాదయాత్ర ఒక్కసారిగా హైలెట్ అయ్యింది. రంగల్ జిల్లాలో సాగుతున్న పాదయాత్రలో షర్మిల నర్సంపేట ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలు టీఆర్‌ఎస్, వైఎస్సార్‌టీపీ శ్రేణుల మధ్య ఉద్రిక్తతకు దారితీసింది. షర్మిల ఫ్లెక్సీలు, బస్సుకి టీఆర్‌ఎస్ శ్రేణులు నిప్పుపెట్టారు. ఎవరు ఈ దాడులు చేయించారో మాకు తెలుసునని ఆ సాక్ష్యాలు కూడా మా దగ్గర ఉన్నాయన్న షర్మిల... బాధ్యులపై చర్యలు తీసుకునే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా? పోలీసులకు ఉందా ? అని ప్రశ్నించారు. ఈలోపే షర్మిలని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కి తరలించారు.
అధికారపార్టీపై, నేతలను టార్గెట్ చేస్తూ షర్మిల తన పాదయాత్రలో పలు ఆరోపణలు, విమర్శలు చేశారు. అప్పుడు స్పందించని టీఆర్ ఎస్ శ్రేణులు ఇప్పుడు ఎందుకు దాడులకు దిగుతున్నారన్నదే రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది. బీజేపీ పాదయాత్రలకు అధికారపార్టీ ఆటంకాలు కలిగిస్తోందని ఆపార్టీ పదేపదే ఆరోపణలు చేస్తోంది. కానీ తెలంగాణలో వైఎస్‌ఆర్‌టీపీ పాదయాత్రలకు ఎలాంటి అభ్యంతరాలు, ఆటంకాలను ఇప్పటివరకు అధికారపార్టీ కలిగించలేదు. అయితే మొదటిసారి నర్సంపేట ఎమ్మెల్యేపై చేసిన ఆరోపణలకు ప్రతిగా ఈ దాడులు జరిగాయన్న వాదన వినిపిస్తోంది. విపక్షాల పాదయాత్రలకు తెలంగాణలో ఇక ఫుల్ స్టాప్ పెట్టాలన్న ఆలోచనలో టీఆర్‌ఎస్ ఉందా? అధికారపార్టీని విమర్శిస్తే దాడులు తప్పవన్న హెచ్చరికా ? లేదంటే షర్మిల రాజకీయ మైలేజ్ ని పెంచే ప్రక్రియలో భాగంగానే ఈ ప్లాన్ చేశారా? అన్నది చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టినప్పుడు కానీ, ఆమె పాదయాత్ర మొదలెట్టినప్పటి నుంచి కానీ పెద్దగా ప్రభావం చూపించలేకపోయాారు. ఈ మధ్యకాలంలో జరిగిన స్థానిక, ఉప ఎన్నికల్లోనూ ఆపార్టీ పోటీలో నిలబడలేదు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో వైఎస్సార్‌టీపీ అనేది ఒకటి ఉందన్న విషయమే మర్చిపోయే పరిస్థతి వచ్చిందన్నది వాస్తవం. అందుకే అటు టీఆర్ ఎస్ ఇటు వైఎస్సార్‌టీపీ వ్యూహంలో భాగంగానే ఈ దాడులు, అరెస్ట్‌లన్న వాదన కూడా లేకపోలేదు.
బీజేపీని అడ్డుకోవడానికి తెలంగాణి సిఎం కెసిఆర్ ఓ వైపు సిట్ దర్యాప్తులు మరోవైపు ఏసీబీ దాడులు ఇంకోవైపు షర్మిలని హైలెట్ చేయడమని రాజకీయ విమర్శకులు భావిస్తున్నారు. ఇన్నాళ్లు మీడియాలో హైలెట్ కాలేకపోయిన షర్మిల ఇప్పుడు ఒక్క అరెస్ట్ తో అందరి దృష్టిని ఆకర్షించే అవకాశాలు లేకపోలేదంటున్నారు. అసలు కెసిఆర్ ప్రోత్సాహంతోనే ఆమె తెలంగాణలో పార్టీ పెట్టారని అప్పట్లో వార్తలు వచ్చాయి. మరి అలాంటిది ఇప్పుడు ఆమెని ఎందుకు అరెస్ట్ చేస్తారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.