Chandrababu Naidu Arrest : బీజేపీకి సమస్యగా చంద్రబాబు అరెస్టు ఇష్యూ - కమలం పార్టీ మద్దతుతోనే జగన్ ఇదంతా చేస్తున్నారా ?
బీజేపీ మద్దతుతోనే చంద్రబాబు అరెస్ట్ జరిగిందా ? బీజేపీపైనే ఎందుకు విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి ?
Chandrababu Naidu Arrest : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు 14 ఏళ్లు సీఎంగా చేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్నారు. జడ్ ప్లస్ సెక్యూరిటీలో ఉన్నారు. అలాంటి నేతను ఎఫ్ఐఆర్‌లో పేరు లేకుండా అరెస్ట్ చేయడం సాధ్యమా ?. అరెస్టు చేసేటప్పుడు ఏ కేసో కూడా చెప్పకుండా నోటీసులు ఇచ్చి అరెస్టు చేశారు. 73 ఏళ్ల వయసులో ఉన్న ఆయనను పన్నెండు గంటల పాటు రోడ్లపై జర్నీ చేయించి.. మరో పన్నెండు గంటల పాటు నిద్ర కూడా పోనివ్వకుండా విచారణ జరిపి.. మరో పదహారు గంటల పాటు కోర్టులో కూర్చోబెట్టారు. దేశంలోని అత్యంత సీనియర్ లీడర్లలో ఒకరు అయిన చంద్రబాబుపై ఇంత క్రూరత్వం ఎందుకు చూపించారు ? ఇలాంటివి కేంద్రం మద్దతు లేకుండా జరుగుతాయా ?. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో కనీస ఆధారాలు లేవని తెలుస్తున్నా కోర్టుల్లోనూ చంద్రబాబుకు ఊరట దక్కకపోవడం .. రాజమండ్రి సెంట్రల్ జైల్లో పాతిక రోజులుగా ఉండటం సాధ్యమేనా ? అన్న ప్రశ్న వినిపిస్తోంది.
అధికారులకు తెలియకుండా చంద్రబాబే అంతా చేశారా ?
ముఖ్యమంత్రి, మంత్రులు పాలసీలు చేస్తారు. వాటిని లోపాల్లేకుండా అధికారులు అమలు చేస్తారు. ప్రజాస్వామ్యంలో ఇది మొదటి పాఠం. తప్పులు చేస్తే అధికారులదే బాధ్యత. వారి చేతుల మీదుగానే అన్నీ జరుగుతాయి. ఇది సివిల్ సర్వీసులపై ఆసక్తి ఉన్న వారికి క్లాసుల్లో చెప్పే మొదటి పాఠం. మరి ఇక్కడ అధికారులు అందరూ సేఫ్ గా ఉన్నారు. కానీ ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబును మాత్రమే ఎందుకు అరెస్టు చేసి జైలుకు పంపించారు ? ఇది సామాన్యుడికే కాదు.. రాజకీయంగా ముఖ్య నేతలకూ వస్తున్న సందేహం. న్యాయస్థానాల్లోనూ ఎందుకు ఊరట దక్కడం లేదన్నది సామాన్యుడికీ పెద్ద మిస్టరీగా మారింది. ప్రభుత్వం కొన్ని విరవాలు చెబుతోందని..అత్యధిక సమాచారం దాచి పెడుతోందని ఆరోపణలు వస్తున్నా కేంద్రం వైపు నుంచిపెద్దగా స్పందన ఉండటం లేదు.
ఏపీలో పరిస్థితుల్ని కేంద్రం ఆరా తీసిందా ? లేదా ?
ఓ ప్రతిపక్ష నేతను అరెస్టు చేశారు. అప్పుడే ఆయన కుమారుడ్ని కూడా అరెస్టు చేస్తామని వైసీపీ నేతలు బెదిరిస్తున్నారు. ఒకటికి నాలుగు కేసులు పెట్టారు. ఆ కేసులపై ప్రజల్లో ఇప్పటికే విస్తృత చర్చ జరుగుతోంది. డాక్యుమెంట్లు అన్నీ పబ్లిక్ డొమైన్‌లో ఉన్నాయి. అదే సమయంలో నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలను కూడా అరెస్టు చేస్తామని సోషల్ మీడియాలో వైసీపీ నేతలు బెదిరిస్తున్నారు. పవన్ కల్యాణ్ పేరునూ అరెస్టయ్యే వారి జాబితాలో తెచ్చారు. ఏపీలో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కేంద్రం ఎందుకు మౌనంగా ఉంటుందని ఎక్కువ మందికి వస్తున్న సందేహం. రాష్ట్రంలో పరిస్థితుల గురించి తెలుసి కూడా మౌనంగా ఉంటోందా లేకపోతే.. రాజకీయ కారణాలతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి పూర్తి మద్దతుగా నిలుస్తోందా అన్న సందేహాలు వస్తున్నాయి. అందుకే ఇలాంటి కీలక పరిణామాలు బీజేపీకి తెలియకుండా జరగవని.. ఖచ్చితంగా బీజేపీ మద్దతుతోనే జరుగుతోందన్న భావనకు వస్తున్నారు.
ముందుగానే ఖండించిన బీజేపీ నేతలు - కానీ నమ్మని ప్రజలు
నిజానికి చంద్రబాబు అరెస్టును ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ముందుగానే ఖండించారు. తర్వాత తెలంగాణ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్, కే లక్ష్మణ్ ఖండించారు. రాజకీయ కక్ష సాధింపుల అరెస్టేనని మండిపడ్డారు. అయితే వీరి స్పందనలు ప్రజల్లో నమ్మకాన్ని కలిగించలేదు. జాతీయ నాయకత్వం వైపు నుంచి ఎవరూ స్పందించలేదు. రాష్ట్ర పరిణామాల పట్ల అసలు తమకేమీ తెలియదన్నట్లుగా ఉన్నారు. దీంతో తెలుగుదేశం పార్టీని లేకుండా చేయడానికి చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబసభ్యులందర్నీ అరెస్టు చేయడానికి ప్లాన్ చేసుకున్నారని..ఇదంతా బీజేపీ కనుసన్నల్లో వైసీపీ చేస్తోందన్న అభిప్రాయానికి రాజకీయవర్గాలు వస్తున్నాయి. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీకి ఇబ్బందికరంగా మారుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.