YSRCP: విజయమ్మ ఇచ్చిన షాక్‌తో వైసీపీలో డైలమా - ఎలా స్పందించాలో అర్థం కాని నేతలు ! సైలెంట్
Andhra Pradesh : ఆస్తుల వివాదంపై షర్మిలను సమర్థిస్తూ విజయమ్మ రాసిన లేఖ వైసీపీలో తీవ్ర చర్చకు కారణం అవుతోంది. ప్రత్యేకంగా పార్టీ ఆఫీసు నుంచి సూచనలు వస్తే తప్ప మాట్లాడకూడదని నిర్ణయించుకున్నారు.
Vijayamma letter : నిన్నటి వరకూ షర్మిల వర్సెస్ జగన్ అన్నట్టుగా సాగిన వైయస్సార్ కుటుంబ ఆస్తులు గొడవ విజయమ్మ బహిరంగ లేఖతో ఒక్కసారిగా కొత్త మలుపు తీసుకుంది. జగన్ అనుమతి తోనో లేక జగన్ పార్టీ మీద ఉన్న అభిమానంతోనో ఇప్పటివరకూ షర్మిలపై ఏదో ఒక స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న వైసిపి నేతలు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఇది ఒక అన్న చెల్లెళ్ల మధ్య గొడవగానే ఉండిపోతుందనుకున్నవారికి తల్లి విజయమ్మ అనూహ్యంగా బహిరంగ లేఖ రాయడం అన్నది మింగుడు పడని అంశమే. దానితో ఈ అంశంపై తమకు తాముగా నోరెత్తలేని పరిస్థితి ఎదురైంది. ఇక వాట్ నెక్స్ట్ అంటూ వైసీపీలో అంతర్గత చర్చ బలంగా సాగుతున్నట్టు సమాచారం అందుతోంది.
బహిరంగ లేఖ తో ఎంట్రీ ఇచ్చిన విజయమ్మ
వైయస్ కుటుంబంలో విభేధాలు ఉన్న విషయం గురించి ఎప్పటినుంచో లీకులు వస్తున్నా 2024 ఎన్నికల ముందు వరకూ అంటే వైయస్ షర్మిల ఏపీ పాలిటిక్స్ లో ఎంట్రీ ఇచ్చేవరకు ఆ విభేదాలు ఇంత తీవ్ర స్థాయిలో ఉన్నాయని ఎవరూ ఊహించలేదు. కేవలం షర్మిలను పొలిటికల్ గా దూరం పెడుతున్నారన్న కోపంతోనే ఆమె రాజకీయంగా తన దారి తను చూసుకున్నారన్న అభిప్రాయమే చాలామందిలో ఉండేది. అయితే దానికి మూలం ఆస్తుల పంపకంలో ఉందని ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. గత కొన్ని రోజులుగా జగన్,షర్మిల మధ్య ఆస్తుల పంపకం వివాదం గురించి తారా స్థాయిలో విమర్శలు ప్రతి విమర్శలు నడిచాయి. తనకు రావలసిన ఆస్తి ఇవ్వకుండా జగన్ మోసం చేశాడు అంటూ షర్మిల, ఇవ్వాల్సిన ఆస్తి ఎప్పుడో ముట్ట చెప్పేసానంటూ జగన్ తమ తమ వాదన వినిపిస్తూ వచ్చారు. ఇటీవల జగన్ షేర్ల వాటాలకు సంబంధించి తల్లి, చెల్లి కి వ్యతిరేకంగా న్యాయపోరాటం కూడా మొదలుపెట్టడం, దానికి స్పందిస్తూ షర్మిల విజయవాడ ప్రెస్ మీట్ లో కన్నీళ్లు పెట్టుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. దీనిపై జగన్ సన్నిహితులు, వైసీపీ కీలక నేతలైన విజయసాయి రెడ్డి, వై వి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఇలాంటి వాళ్ళు షర్మిలపై విమర్శలు గుప్పించారు. ఇక ఈ వివాదం లోని నిజా నిజాలు ఏంటో తెలియక ప్రజల సైతం అయోమయానికి గురయ్యారు.
విజయమ్మ బహిరంగలేఖతో జగన్‌కు చిక్కులు - ఆస్తుల వివాదం మరింత ముదరడం ఖాయమేనా ?
జగన్ వాదనల్ని అబద్దాలుగా తేల్చేసిన విజయమ్మ
అయితే అనూహ్యంగా వైయస్ విజయమ్మ ఒక బహిరంగ లేఖను రిలీజ్ చేయడం అందర్నీ షాక్ కు గురి చేసింది. అసలు వైయస్ కుటుంబంలో ఆస్తుల పంపకం జరగనేలేదని అప్పట్లో వైయస్సార్ కొన్ని ఆస్తులు జగన్ పేరు మీద,మరి కొన్ని ఆస్తులు షర్మిల పేరు మీద కొన్నారని వాటినే ఇప్పుడు ఆస్తులు పంచేసినట్టుగా చూపిస్తున్నారని ఆమె తన కొడుకు జగన్ పై విమర్శలు చేసారు. జగన్ ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఇజ్రాయేల్ తీసుకువెళ్లి మరీ పిల్లలు పెద్ద వాళ్ళవుతున్నారు కాబట్టి ఆస్తులు పంచేసుకుందామని స్వయంగా జగనే ఒక ప్రతిపాదనను షర్మిల ముందు ఉంచారని ఆమె స్పష్టం చేశారు. అయితే రియాల్టీలో ఆ పంపకం జరగలేదు అన్నారు. నిజానికి సాక్షి మీడియా కూడా షర్మిలకే చెందుతుందని ఆమె లేఖలో తెలపడం అందర్నీ షాక్ కు గురిచేసింది. ఇది అన్నా చెల్లెళ్ళ మధ్య గొడవ అనీ మధ్యలో ఎవరు ఎంటర్ కావొద్దని విజయమ్మ లేఖలో పేర్కొనడంతో షర్మిల ని విమర్శిస్తున్న వైసీపీ నేతలకు ఇది మింగుడుపడని విషయం లా మారింది.
ఆస్తుల వివాదంపై వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖ - జగన్‌కు గట్టి షాక్ !
వాట్ నెక్స్ట్ అంటున్న వైసీపీ హై కమాండ్
జగన్ కు ప్రస్తుత పరిస్థితుల్లో డబ్బు కన్నా అత్యంత ముఖ్యమైనది వైయస్సార్ రాజకీయ వారసత్వం. ఇన్నాళ్లు ఆ విషయంలో ఇబ్బంది లేకపోయినా ఏకంగా తల్లి విజయమ్మే కూతురికి అండగా ఉన్నానంటూ బహిరంగ లేఖ రిలీజ్ చేయడంతో ఇది ఆస్తుల పరిధి దాటి రాజకీయంగా కూడా జగన్ భవిష్యత్తును దెబ్బ కొట్టే అంశంగా మారే ప్రమాదం ఏర్పడిందని వైసిపి నేతల్లో చర్చ మొదలైంది. ఇప్పటికీ సామాన్య జనం లో అధిక భాగం జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు గానే అక్కున చేర్చుకుంటుంటారు. అలాంటిది ఇప్పుడు విజయమ్మ లేఖ తో మునుముందు ఎలాంటి పరిణామాలు చూడాల్సి వస్తుందో అన్న చర్చ పార్టీ నేతల్లో జోరుగా నడుసస్తోంది.