RajBhavan Vs Pragati Bhavan : ప్రగతి భవన్ వర్సెస్ రాజ్ భవన్ ! కేసీఆర్ తీరుతో వివాదం మరింత ముదురుతోందా?
రాజ్ భవన్‌లో గవర్నర్ ఇచ్చే విందుకు కేసీఆర్ హాజరు కాకపోవడంపై భిన్న చర్చలు జరుగుతున్నాయి. కేసీఆర్ ఉద్దశపూర్వకంగా చేశారని బీజేపీ వర్గాలు అనుమానిస్తున్నాయి.
RajBhavan Vs Pragati Bhavan : తెలంగాణ సీఎం కేసీఆర్ రాజ్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమానికి హాజరు కాకపోవడం రాజకీయవర్గాల్లో మరోసారి చర్చనీయాంశమవుతోంది. మామూలుగా ఆహ్వానం అందితే.. రావడం లేదని చెప్పడం వేరు..కానీ వస్తున్నట్లుగా సమాచారం పంపి.. అర గంట సేపు ఎదురు చూసిన తర్వాత కూడా వెళ్లకపోతే.. చివరికి ఆయన రావడం లేదని మీడియా ద్వారా తెలిసేలా చేయడం వేరు . కేసీఆర్ రాజ్ భవన్ ను అవమానించారన్న అభిప్రాయం వినిపిస్తోంది. గవర్నర్ విషయంలో అసంతృప్తి ఉన్నా ఇలా చేయడం సరి కాదని కొంత మంది వాదిస్తున్నారు. అయితే ఈ విషయంలో కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి.
" ఎట్ హోం " సంప్రదాయంగా ఇచ్చేచిన్నపాటివిందు!
ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే వంటి వేడుకల సమయంలో రాజ్ భవన్‌లో ‘ఎట్ హోమ్’ పేరుతో చిన్నపాటి విందు గవర్నర్ ఇస్తూంటారు. ముఖ్యమంత్రి సహా మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులకు రాజ్‌భవన్ నుంచి ఆహ్వానం వెళ్తుంది. అందరూ పాల్గొంటూ ఉంటారు. గవర్నర్‌తో అభిప్రాయభేదాలు ఉన్నా.. ఇలాంటి సందర్భంలో పట్టించుకోరు. అయితే గవర్నర్ తమిళిసై ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారన్న కారణంగా కేసీఆర్ గవర్నర్ విషయంలో అసంతృప్తిగా ఉన్నారు. రాజ్ భవన్ వైపు వెళ్లడం మానేశారు. గవర్నర్‌కు ప్రోటోకాల్ కూడా ఇవ్వడం లేదు. దీంతో ఈ అంశం మీడియాలో విస్తృతంగా చర్చకు వచ్చింది. అయితే ఇటీవల హైకోర్టు సీజే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనడంతో ఈ సారి ఎట్ హోం విందుకు కేసీఆర్ వెళ్తారని అనుకున్నారు.
షెడ్యూల్ ఖరారు చేసి గైర్హజర్ !
కేసీఆర్ రాజ్ భవన్ విందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారని ప్రగతి భవన్ వర్గాలు ప్రకటించాయి. ఈ మేరకు ఆయన షెడ్యూల్ కూడా ఖరారైంది. రూట్ మ్యాప్ కూడా రెడీ చేశారు. ఆ సమయానికి ట్రాఫిక్ క్లియరెన్స్ కూడా చేశారు. అయితే కేసీఆర్ మాత్రం వెళ్లలేదు. దాదాపుగా అరగంట సేపు విందు ప్రారంభించకుండా ఆపిన తర్వాత కేసీఆర్ రావడం లేదన్న సమాచారం వచ్చింది. ఇలా చేయడం రాజ్‌భవన్‌ను అవమానించినట్లు ఉందన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. ఇటీవల రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ఇటీవల రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. అప్పట్లో పరిస్థితి సద్దుమణిగిందనుకున్నారు. కానీ ఎలాంటి మార్పు లేదని.. తనకు ప్రోటోకాల్ అందడం లేదని గవర్నర్ ఇటీవల ఆరోపణలు చేశారు. తాజాగా బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించినప్పుడూ ప్రభుత్వాన్ని విమర్శించే వ్యాఖ్యలే చేశారు. ఈ కారణాలతో కేసీఆర్ దూరంగా ఉన్నట్లుగా భావిస్తున్నారు.
ముందుగానే రావడం లేదని చెబితే వివాదం తక్కువే !
అయితే దూరంగా ఉండాలనుకుంటే ముందుగానే సమాచారం ఇస్తారని.. అవమానించాలనుకున్నారు కాబట్టే వస్తానని చెప్పి రాలేదన్న వాదన బీజేపీ వర్గాల నుంచి వినిపిస్తోంది. సీఎం కేసీఆర్ తీరుపై మరోసారి గవర్నర్ తమిళిశై నొచ్చుకున్నట్లుగా తెలుస్తోంది.కేసీఆర్ హాజరు అయితేనే రాజ్ భవన్‌కు వెళ్లాలని చాలా మంది టీఆర్ఎస్ నేతలు అనుకున్నారు. అయితే కేసీఆర్ వెళ్లరని ముందస్తు సమాచారం ఉందేమో కానీ వారెవరూ రాజ్ భవన్ వైపు చూడలేదు.
ప్రగతి భవన్ వర్సెర్ రాజ్ భవన్ వివాదం మరింత ముదురుతుందా?
గవర్నర్ రాజకీయాలు చేస్తున్నారని టీఆర్ఎస్ నేతలు కొద్దిరోజులుగా ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం, గవర్నర్ మధ్య గ్యాప్ ఎక్కువయింది. ఈ క్రమంలో రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య మరింత దూరం పెరిగిందన్న వాదన వినిపిస్తోంది. గతంలో నరసింహన్ గవర్నర్‌గా ఉన్నప్పుడు ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య మంచిసంబంధాలు ఉండేది. అయితే ఇప్పుడు పూర్తి వ్యతిరేకంగా పరిస్థితులు ఉన్నాయి.