TRS ZP Chairman In Congress : కాంగ్రెస్‌లో చేరిన టీఆర్ఎస్ జడ్పీ చైర్మన్ - గుట్టుగా చేర్పించేసిన రేవంత్ !
టీఆర్ఎస్ కీలక నేత నల్లాల ఓదేలు తన భార్యతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రియాంకా గాంధీ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన మంచిర్యాల జడ్పీ చైర్మన్ నల్లాల భాగ్యలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన భర్త మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు. చెన్నూరు నుంచి ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వారిద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రియాంకా గాంధీ వారికి కండువా కప్పిపార్టీలోకి ఆహ్వానించారు. వీరిని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి , దామోదర రాజనర్సింహా ఢిల్లీకి తీసుకెళ్లి సోనియాతో సమావేశం ఏర్పాటు చేయించారు. తర్వాత ప్రియాంకా గాంధీతో కండువా కప్పించారు. నిన్నటి వరకూ వారు పార్టీ మారుతారన్న అంశాన్ని చాలా సీక్రెట్‌గా ఉంచి.. ఉదయమే వారు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కిన తర్వాత మీడియాకు లీక్ చేశారు. ఎక్కడా పార్టీ మారకుండా టీఆర్ఎస్ నేతలు ఒత్తిడి తేకుండా చూసుకున్నారు.
నల్లాల ఓదెలు ఉద్యమం సమయం నుంచి టీఆర్ఎస్‌లో ఉన్న నేత. ఆయన రెండు సార్లు చెన్నూరు నుంచి గెలిచారు. ఉద్యమం సమయంలో రాజీనామా కూడా చేశారు. అయితే ఆయనను గత ఎన్నికల్లో పక్కకు తప్పించి అక్కడ కేటీఆర్ సన్నిహితుడు బాల్క సుమన్‌కు సీటిచ్చారు. అప్పట్లో ఈ అంశం పై ఓదెలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఎలాగోలా సర్దుబాటు చేశారు. తర్వాత జడ్పీ చైర్మన్ ఎన్నికల్లో ఆయన భార్యకు చాన్సిచ్చారు. దీంతో నల్లాల ఓదెలు సంతృప్తి పడ్డారు.
అయితే అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఓదెలు మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారు. కానీ చెన్నూరు నుంచి మళ్లీ బాల్క సుమన్‌కే ప్రాధాన్యం దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవల ఆ దంపతులకు మంచిర్యాల జిల్లాలో పెద్దగా ప్రాధాన్యం దక్కడం లేదు. మొత్తం బాల్క సుమన్ డామినేషన్ కనిపిస్తూండటంతో ఆ దంపతులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. వారి అసంతృప్తిని కనిపెట్టిన కాంగ్రెస్ నేతలు పార్టీ టిక్కెట్ ఆఫర్ ఇచ్చి చేర్చుకున్నట్లుగా తెలుస్తోంది.
జడ్పీ చైర్మన్ స్థాయి నేత కాంగ్రెస్ పార్టీలో చేరడంతో టీఆర్ఎస్ వర్గాలు కూడా షాక్ తిన్నాయి. పదవి పోతుందని తెలిసి కూడా ఇలా పార్టీని వీడుతారని అధికార పార్టీ వర్గాలు భావించలేదు. కనీసం బుజ్జగించడానికి సమాచారం బయటకు రాకపోవడంతో టీఆర్ఎస్ శ్రేణులు కూడా విస్తుపోయాయి. ఓదెలు ఫ్యామిలీ టీఆర్ఎస్ వీడటం వల్ల పడే ప్రభావం చెన్నూరులో మాత్రం ఉండదని... ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో పొలిటికల్ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తుందని టీఆర్ఎస్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇక నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.