Politics With Mogulaiah : మొగులయ్య పావుగా బీజేపీ , టీఆర్ఎస్ రాజకీయాలు ! ఆ వీడియోలతో హల్ చల్
కిన్నెర వాయిద్యకారుడు మొగులయ్య కేంద్రంగా టీఆర్ఎస్, బీజేపీ రాజకీయాలు చేస్తున్నాయి. ఆయన వీడియోలు విడుదల చేస్తూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.
పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర వాయిద్యకారుడు మొగులయ్యతో తెలంగాణ రాష్ట్ర సమితి, బీజేపీ రాజకీయాలు చేస్తున్నాయి. ఆయనతో మాట్లాడించి ఆ మాటలను సోషల్ మీడియాలో పెట్టి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. మొగలయ్య అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని రెండు పార్టీలు ఆయనను పావుగా పెట్టి రాజకీయ ఆట ఆడుతున్నాయన్న విమర్శలు సామాన్యుల నుంచి వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఇటీవల మొగులయ్య తనకు కేసీఆర్ రూ. కోటి ఆర్థిక సాయం ప్రకటించారని ఇంకా అందలేదని .. తనకు నగదు ఇప్పిస్తానని తమ ఎమ్మెల్యే చెప్పారని అంటున్న వీడియో ఒకటి వైరల్ అయింది.
మే 26న తెలంగాణకు రానున్న ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర బీజేపీలో పెరిగిన జోష్
మొగులయ్యను పలకరించిన కొంత మంది బీజేపీ నేతలు ఆయనతో మాటలను రికార్డు చేస్తున్నట్లుగా మొగులయ్యకు తెలియకుండా రికార్డు చేశారు. తర్వాత ఆ రికార్డింగ్‌లో కొంత భాగాన్ని సోషల్ మీడియాలో పెట్టి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై విమర్శలు ప్రారంభించారు. కేసీఆర్ .. ఆర్భాటంగా మొగులయ్యకు రూ. కోటి ఆర్థిక సాయం ప్రకటించారు కానీ రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పడం ప్రారంభించారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో టీఆర్ఎస్ నేతలు వెంటనే స్పందించారు. వారు కూడా మొగులయ్య వద్దకు వెళ్లి మాటలు కలిపారు.
శిల్పకళా వేదికలో విషాదం, ఉపరాష్ట్రపతి ఈవెంట్ స్టేజీ వేదికపై నుంచి పడి ఐబీ అధికారి మృతి
కేసీఆర్‌కు వ్యతిరేకంగా మొగులయ్య మాట్లాడారని.. బీజేపీ నేతలు దానికి సంబంధించిన వీడియోలను బీజేపీ వైరల్ చేస్తోందని ఆయనకు చెప్పి ఖండనగా మరో వీడియో రెడీ చేయించారు. అందులో బీజేపీ నేతలకు ఫోన్ చేసిన మొగులయ్య తన మాటలను ఎందుకు సోషల్ మీడియాలో పెట్టారని బీజేపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు.. తనకు కేసీఆరే ముఖ్యమని.. కావాలంటే పద్మశ్రీ అవార్డు వెనక్కి ఇచ్చేస్తానని వార్నింగ్ ఇచ్చారు.ఈ వీడియోను టీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో పెట్టి బీజేపీ నేతలు చిల్లర రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు.
కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడితే తనకు ప్రకటించిన రూ. కోటి మంజూరు చేయరేమోనని పేదరికంతో బాధపడుతున్న మొగలయ్యకు భయం ఉండటం సహజం. దీన్ని ఆసరా చేసుకుని రెండు పార్టీల నేతలు.. తమ తమ రాజకీయ పార్టీల కోసం ఆయనను పావుగా చేసుకుని వీడియోలు విడుదల చేయడం విమర్శలకు కారణం అవుతోది. అయితే ఆయా పార్టీల నేతలు మాత్రం ఆయన ఆవేదనను.. బాధను.. నిస్సహాయతను పట్టించుకోవడం లేదు. రాజకీయంలో బిజీగా ఉన్నారు.