IB Official Dies: శిల్పకళా వేదికలో విషాదం, ఉపరాష్ట్రపతి ఈవెంట్ స్టేజీ వేదికపై నుంచి పడి ఐబీ అధికారి మృతి
IB official dies: భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరుకానున్న ఈవెంట్ ఏర్పాట్లు చెక్ చేస్తూ ఇంటెలిజెన్స్ బ్యూరో అసిస్టెంట్ డైరెక్టర్ అమిరేశ్(51) మృతి చెందారు.
హైదరాబాద్‌లోని మాదాపూర్ శిల్పకళా వేదికలో విషాదం జరిగింది. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరుకానున్న ఈవెంట్ ఏర్పాట్లు చెక్ చేస్తూ ఇంటెలిజెన్స్ బ్యూరో అసిస్టెంట్ డైరెక్టర్ అమిరేశ్(51) మృతి చెందారు. అధికారులకు నివేదిక ఇవ్వడం కోసం స్టేజీపై ఫొటోలు తీస్తూ గుంతలో పడిపోయి డీఎస్పీ తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్ శిల్పకళా వేదికలో మే 20న సిరివెన్నెల సీతారమశాస్ట్రీ బుక్ ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. ఈ ఈవెంట్‌కు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరు కానున్నారు. ఈ క్రమంలో ఈ కార్యక్రమం ఏర్పాట్లపై అధికారులకు నివేదిక ఇవ్వడం కోసం ఇంటెలిజెన్స్ డీఎస్పీ కుమార్ అమ్మిరేశ్ అక్కడికి వెళ్లారు. స్టేజీపై ఉన్న ఆయన ఫోటోలు తీస్తూ ప్రమాదవశాత్తూ స్టేజీపై నుంచి సమీపంలో ఉన్న గుంతలో పడిపోయారు. దాంతో డీఎస్పీ తలకు తీవ్ర గాయాలు కావడంతో రక్తస్రావమైంది.
తీవ్ర గాయాలపాలైన డీఎస్పీ కుమార్ అమ్మిరేశ్‌ను వైద్య చికిత్స కోసం మెడికవర్ హాస్పిటల్ కి తరలించారు. తలకు తీవ్రమైన గాయం కావడం, అధిక రక్తస్త్రావం కావడంతో చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం ఆయన తుదిశ్వాస విడిచారు. కేసు నమోదు చేసుకున్న మాదాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
డీఎస్పీ స్వస్థలం బిహార్
ఇంటెలిజెన్స్ బ్యూరోలో అసిస్టెంట్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న కుమార్ అమ్మిరేశ్ స్వస్థలం బిహార్ రాష్ట్రంలోని పాట్నా. ఆయన భార్య, ఇద్దరు పిల్లలతో జూబ్లీహిల్స్ ఐ బీ క్వార్టర్స్ లో నివాసం ఉంటున్నారు.
వెంకయ్య నాయుడు సంతాపం
శుక్రవారం నాడు తాను పాల్గొననున్న శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పుస్తకావిష్కరణ కార్యక్రమం ముందస్తు ఏర్పాట్లలో భాగంగా, హైదరాబాద్ శిల్పకళావేదికలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఇంటిలిజెన్స్ విభాగ పోలీసు అధికారి కుమార్ అమిర్నేష్ ప్రమాదవశాత్తు మృతి చెందారన్న వార్త నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. వారి మృతి అత్యంత విచారకరం. కుమార్ అమిర్నేష్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు వెంకయ్య నాయుడు.