Telangana BJP : అగ్రనేతలు సరే నియోజకవర్గాల్లో నాయకులేరి ? తెలంగాణ బీజేపీ ముందున్న అతిపెద్ద సవాల్ ఇదే !
తెలంగాణ బీజేపీలో ద్వితీయ శ్రేణి నాయకత్వ కొరత కనిపిస్తోంది. ఎంతో మంది నేతలు ఉన్నా... బలమైన అభ్యర్థుల స్థాయి నేతల కోసం వెదుకులాట తప్పడం లేదు.
Telangana BJP : తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జోష్ మీద ఉంది. ప్రతిపక్షాలు లేకుండా చేయాలని కేసీఆర్ చేసిన రాజకీయమో.. బీజేపీ దశ తిరిగిందో కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో 100కుపైగా స్థానాల్లో డిపాజిట్ కోల్పోయి.. ఒక్కటంటే ఒక్క ఎమ్మెల్యే సీటే గెల్చుకున్న బీజేపీ ఇప్పుడు హాట్ ఫేవరేట్లలో ఒకటిగా మారింది. బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ఆ పార్టీ ఫేట్ మారిపోయింది అనుకోకుండా వచ్చినవో.. కేసీఆర్ అనుకుని తెచ్చినవో కానీ వరుసగా వచ్చిన ఉపఎన్నికలు.. గ్రేటర్ ఎన్నికలు ఆ పార్టీకి ఉత్సాహం తెచ్చి పెట్టాయి .దాన్ని బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్తోంది. ఇంత వరకూ బాగానే ఉంది కానీ.. బీజేపీ ముందు అసలు సవాల్ ఉంది. అదే ద్వితీయ శ్రేణి నాయకత్వం.
దూకుడుగా తెలంగాణ బీజేపీ అగ్రనేతలు !
తెలంగాణ బీజేపీలో అగ్రనేతలకు కొదవలేదు. రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా బండి సంజయ్ తిరుగులేని ఇమేజ్ సంపాదించుకున్నారు. ఇక లక్ష్మణ్ జాతీయ స్థాయి నాయకుడయ్యారు. ఆయన ఏకంగా పార్లమెంటరీ బోర్డు మెంబరే అయ్యారు. కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా ఉన్నారు. డీకే అరుణ, ఈటల రాజేందర్, జితేందర్ రెడ్డి, వివేక్ , ఇంద్రసేనారెడ్డి, రామచంద్రరావు, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్.. ఇలా చాలా మంది ముఖ్య నేతలు రాష్ట్ర స్థాయిలో ఉన్నారు. వారిలో నియోజకవర్గాల్లో పట్టు ఉన్నవాళ్లు తక్కువే.. కానీ మంచి గుర్తింపు ఉంది. వీరందరూ రాష్ట్ర స్థాయిలో పోరాటం చేస్తున్నారు. టీఆర్ఎస్‌ను ఢీకొట్టే విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. ఏ రకంగా చూసినా తెలంగాణ బీజేపీ రాష్ట్ర నాయకత్వం చాలా పటిష్టంగా ఉంది. అందుకే ఆ పార్టీ అధికారం అందుకునే రేస్‌లో ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి ఏమిటి ?
నియోజవకర్గాల్లో బలమైన అభ్యర్థులు ఎంత మంది ?
రాష్ట్ర నాయకులు.. ఓ పది..పదిహేను నియోజకవర్గాల్లో బలంగా ఉంటారు. మరి మిగతా నియోజకవర్గాల్లో ఎవరు పార్టీ బాధ్యత తీసుకుంటారు? . ఇదే ఆ పార్టీకి పెద్ద సమస్యగా మారింది. ఇటీవలి కాలంలో బీజేపీకి చాలా చోట్ల నాయకులు కలిసి వచ్చారు. క్యాడర్ కూడా పెరిగింది. కానీ నియోజకవర్గం మొత్తాన్ని నడిపించే నాయకుల కొరత మాత్రం తీవ్రంగా ఉంది. తాము పోటీ చేస్తామంటే.. తాము పోటీ చేస్తామని రేసులోకి నియోజకవర్గానికి నలుగురైదుగురు పోటీ పడుతున్నారు కానీ వారెవరూ పార్టీ బలానికి తమ బలం యాడ్ చేసి సీటును గెలిపించుకువస్తామనే వాళ్లు కాదు. పూర్తిగా పార్టీ మీద ఆదారపడేవారే. అక్కడే అసలు సమస్య వస్తోంది. గెలుపు గుర్రాల కోసం ఎదురు చూపులు చూడక తప్పని పరిస్థితి.
చేరికల మిషన్ ఎందుకు పట్టాలెక్కడం లేదు ?
ఈటల రాజేందర్ నేతృత్వంలో చేరికల కమిటీని ఏర్పాటు చేశారు. కానీ ఆ కమిటీ ఏం చేస్తుందో కానీ బండి సంజయ్ నేతృత్వంలో ఒకరిద్దరు ఢిల్లీ వెళ్లి కండువా కప్పుకుని వస్తున్నారు. ఇటీవల పార్టీలో చేరిన దాసోజు శ్రవణ్ కూడా అంతే. కారణం ఏమైనా కావొచ్చు కానీ..పార్టీలో నియోజకవర్గ స్థాయి నేతలు మాత్రం చేరడం లేదు. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు.. మాజీ ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నారు. కానీ ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. చర్చలు జరిపి.. సుముఖత వ్యక్తం చేసిన తర్వాత కూడా కొందరు వెనుకడుగు వేస్తున్నారు. వారికి సరైన భరోసా లభించకపోవడమే కారణం.
మునుగోడు ఉపఎన్నిక తర్వాత పెద్ద ఎత్తున నేతలు చేరుతారని బీజేపీ నేతల అంచనా !
అయితే నియోజకవర్గాల్లో బలమైన నేతల కొరత మునుగోడు ఉపఎన్నికల తర్వాత తీరిపోతుందని ఆ పార్టీ నేతలు గట్టి నమ్మకంతో ఉన్నారు. అక్కడ గెలిచి తీరుతామని.. ఆ తర్వాత టీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి నేతలు క్యూ కడతారని అంటున్నారు. బలమైన అభ్యర్థుల్ని వెదుక్కునే అవసరం కాకుండా ఎంపిక చేసుకునే చాయిస్ ఉంటుందని నమ్ముతున్నారు. కానీ మునుగోడు ఉపఎన్నిక ఫలితం తేడా వస్తే.. రాజకీయం అలా ఉండదు.