AP Three States : మూడు రాజధానులు కాదు మూడు రాష్ట్రాల ఉద్యమం - ఏపీలో కొత్తగా విభజనవాదం !
ఆంధ్రప్రదేశ్ ను మూడు రాష్ట్రాలు చేయాలనే డిమాండ్ పెరుగుతోంది. ఉత్తరాంధ్ర రాష్ట్రం వాదనతో మంత్రి ధర్మాన చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు విస్తృత చర్చ జరుగుతోంది.
AP Three States : ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల వివాదం కాస్తా మూడు రాష్ట్రాల వివాదంగా మారుతోంది. ఏపీని మూడు రాష్ట్రాలుగా విభజించాలన్న డిమాండ్ పెరుగుతోంది. విశాఖను రాజధానిగా అంగీకరించకపోతే ఉత్తరాంధ్రను ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేశారు. ఇప్పుడు ధర్మాన ప్రసాదరావుకు పోటీగా రాయలసీమ నేతలు కూడా.. ప్రత్యేక రాష్ట్ర డి్మాండ్ చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా పలువురు నేతలు రాయలసీమలో రాజధాని పెట్టాలని లేకపోతే ప్రత్యేక రాష్ట్రం పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. రాను రాను ఈ వివాదం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది.
ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం కావాలన్న ధర్మాన
విశాఖపట్నాన్ని రాజధానిగా చేయాల్సిందేనని.. లేని పక్షంలో కొత్త రాష్ట్రంగానైనా ప్రకటించాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆదాయం మొత్తం ఖర్చుపెట్టి హైదరాబాద్‌ను అభివృద్ధి చేశాక.. విభజనతో విడిచిపెట్టి వచ్చాం అన్నారు. ఆ పొరపాటు పునరావృతమైతే మరో 70 ఏళ్లు ఈ ప్రాంతం వెనుకబాటుతోనే ఉండాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్రలో తిరుగుతూ అమరావతి రాజధాని అని చంద్రబాబు చెప్పడం మన చేతులతో మన కళ్లనే పొడిచే ప్రయత్నమే అన్నారు. చంద్రబాబు అమరావతి రాజధాని అని చెబుతున్నారని అదే జరిగితే మాకు విశాఖ రాజధాని ఇచ్చేయండి మేము ఒక చిన్న రాష్ట్రం ఏర్పాటు చేసుకుంటామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ధర్మాన వ్యాఖ్యలపై రాయలసీమ వాసుల స్పందన
ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యలపై రాయలసీమ నేతలు స్పందించారు. బీజేపీకి చెందిన బైరెడ్డి విష్ణువర్దన్ రెడ్డి, టీడీపీకి చెందిన శ్రీనివాసలరెడ్డి తనకు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మూడు రాజధానుల వివాదం కారణంగా మూడు ప్రాంతాల మధ్య .. ప్రత్యేక రాష్ట్ర వాదం బలపడుతున్న సూచనలు వీరి కారణంగా కనిపిస్తోంది. అటు రాయలసీమలో.. ఇటు ఉత్తారంధ్ర రాజకీయ నేతలు... తమ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా కావాలనుకుంటున్నారు. మధ్యలో కోస్తా ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కావాలని కానీ వద్దని కానీ అడిగే అవకాశం ఉండదు. అలాగే...కలిపి ఉంచాలని వారు ఉద్యమాలు కూడా చేయరన్న వాదన ఉంది. దీంతో మూడు ప్రాంతాలను మూడు రాష్ట్రాలు చేయాలనే డిమాండ్ పెరిగే అవకాశం ఉందన్న వాదన వినిపిస్తోంది.
వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం వచ్చాకే పెరిగిన ప్రాంతీయ ఉద్యమాలు
రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టింది. అమరావతిని రాజధానిగా నిర్ణయించారు. ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. ఏకగ్రీవంగా అంగీకరించారు. రైతులు కూడా ముఫ్ఫై మూడు వేల ఎకరాలిచ్చారు. అమరావతిని ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఒక్కరంటే ఒక్కరూ వ్యతిరేకించలేదు. అటు రాయలసీమలో కానీ ఇటు ఉత్తరాంధ్రలో కానీ తమ ప్రాంతానికి రాజధాని కావాలని ఒక్కరూ అడగలేదు. రాష్ట్రం మధ్యలో రాజధాని అంటే అందరూ బాగుందని అనుకున్నారు. సాక్షాత్తూ అసెంబ్లీలోనే జగన్ .. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేందుకు ఇష్టం లేక అమరావతికి అంగీకరిస్తున్నానన్నారు. తన అంగీకారానికి గుర్తుగా ఇల్లు కట్టుకున్నామని చెప్పారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత ప్రజల ఆకాంక్షల మరేకంటే మూడు రాజధానుల ప్రస్తావన తెచ్చారు. దీంతో మూడు ప్రాంతాల ప్రజల మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయి.
అమరావతి అభివృద్ధి చెందితే విభజన.. ముందే చేయాలంటున్న నేతలు
అమరావతి రాజధానిగా అభివృద్ధి చెందితే.. ఏపీ మూడు రాష్ట్రాలకు విడిపోతుందని ఓ వాదనను వైసీపీ నేతలు వినిపిస్తున్నారు. హైదరాబాద్ అలాగే అయిందంటున్నారు. ఈ వాదనకు ప్రజలకు ఎంత మద్దతిస్తారన్నదానిపై ఈ విషయంలో పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఒక్కటి మాత్రం నిజం.. ప్రజల్లో విభజన బీజాలు నాటారు. ఇది పెరుగుతుందే తప్ప తగ్గేది కాదు.