TS Cabinet ; కేసీఆర్ కేబినెట్‌లో మార్పు చేర్పులు - సంక్రాంతి తర్వాత ఎన్నికల టీంతో ప్రమాణస్వీకారం ఉంటుందా ?
తెలంగాణ కేబినెట్ విస్తరణపై మరోసారి చర్చ జరుగుతోంది. సంక్రాంతి తర్వాత కేసీఆర్ నలుగురికి ఉద్వాసన పలికి ఐదుగుర్ని కొత్తగా చేర్చుకుంటారన్న చర్చ జరుగుతోంది.
TS Cabinet ; తెలంగాణ మంత్రివర్గ మార్పుచేర్పులపై మళ్లీ చర్చ ప్రారంభమయింది. 2021 ఏడాది నవంబర్‌లో ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసేటప్పుడు పూర్తిగా మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ సమీకరణాలనే చూసుకున్నారన్న ప్రచారం జరిగింది. కేసీఆర్ కూడా మంత్రి వర్గ విస్తరణ చేపట్టాలని చాలా కాలంగా అనుకుంటున్నారు. మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్‌ను బర్తరఫ్ చేసినప్పటి నుండి విస్తరణపై చర్చ జరుగుతోంది. మంత్రివర్గంలో స్వల్పమార్పులు చేర్పులు ఉంటాయని భావిస్తున్నా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేల వివాదాస్పద వైఖరి విపక్షా లకు అనుకూలంగా మారకూడదనే ఉద్దేశంతో దిద్దు బాటు చర్యలు కూడా చేపట్టాలని భావిస్తున్నారు.
ఎన్నికల టీంను మార్చాలనుకుంటున్న కేసీఆర్ !
మంత్రివర్గాన్ని మార్చడానికి కేసీఆర్ ఎప్పుడో ప్రణాళికలు వేసుకున్నారు. రాజ్యసభ సభ్యునిగా ఉండ బండా ప్రకాష్‌ను ఎమ్మెల్సీ చేశారు. కలెక్టర్‌గా ఉన్న వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్సీ అయ్యారు. చాన్స్ లేదనుకున్న కడియం శ్రీహరికీ అవకాశం కల్పించారు. కేబినెట్ సమీకరణాలతోనే వీరికి అవకాశం కల్పించారని టీఆర్ఎస్ వర్గాలు ఓ అంచనాకు వచ్చాయి. కేసీఆర్ ఏ క్షణమైన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించే చేస్తారని ఏడాది నుంచి ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వివాదాస్పదమైన మంత్రుల్ని ఆయన తొలగిస్తారని.. రెడ్డి సామాజికవర్గానికి చెందిన ముగ్గుర్ని తొలగిస్తారని చెబుతున్నారు. తెలంగాణలో ఆరుగురు రెడ్డి సామాజికవర్గ మంత్రుల ఉన్నారు. మరో నలుగురైదుగురు మంత్రులు పనితీరు విషయంలో ప్రజాగ్రహానికి గురయ్యారు. వీరిని మార్చాలని కేసీఆర్ అనుకుంటున్నారు.
సంక్రాంతి తర్వాత మార్పుచేర్పులు ఉంటాయా ?
బడ్జెట్ తర్వాత అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తారన్న ఉహాగానాలు వస్తున్నాయి. అదే నిజమైతే కేసీఆర్.. మంత్రి వర్గాన్ని సంక్రాంతిలోపే సంస్కరించే అవకాశం ఉంది. కానీ పరిస్థితులు బాగో లేవనుకుంటే కేసీఆర్ ముందస్తుకు వెళ్లరని.. అదే జరిగితే.. మంత్రివర్గ విస్తరణ చేసే అంశంపై ఆలోచించే అవకాశం ఉందని అంటున్నారు. రాజకీయ వ్యూహ ధురంధురిడిగా పేరొందిన కేసీఆర్ ఇటీవల ఆత్మరక్షణ ధోరణిలో ఉన్నారు. రాజకీయ పరిణామాలతో ఆయన ఏ నిర్ణయమూ వెంటనే తీసుకోలేకపోతున్నారు. పార్టీని బీఆర్ఎస్‌గా మార్చేశారు కానీ..దాన్ని వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నారు. కనీసం ఓ ప్రెస్ మీట్ పెట్టి.. దేశ ప్రజలకు తమ పార్టీ విధివిధానాలేంటో చెప్పలేకపోయారు. భారీ బహిరంగసభ ఆలోచనలు ఎప్పటికప్పుడు వెనక్కి పోతూనే ఉన్నాయి. సంక్రాంతి నాటికి మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ఉండొచ్చు. జనవరి మూడో వారంలో మంచి రోజు చూసుకుని కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహిస్తారని చెబుతున్నారు. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన వెంటనే ఆ పనిచేస్తారని కేసీఆర్ సెంటిమెంట్లు తెలిసిన వాళ్లు చెబుతున్నారు. సంక్రాంతి నెలలో మంచి రోజు లేదని భావిస్తే మాత్రం ఫిబ్రవరి మొదటి వారానికి వాయిదా వేస్తారు.
అశావహుల పేర్లు ఎక్కువగానే !
ఏదైనా సరే ఫిబ్రవరి లోపే మంత్రివర్గంలో మార్పులు ఖాయమని నమ్ముతున్నారు. ప్రమాణ స్వీకారం చేసే వారిలో కొందరిపేర్లు ప్రస్ఫుటంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ విప్ గా ఉన్న బాల్క సుమన్ పేరు మొదటి వరుసలో ఉంది. సీనియర్ నాయకుడు మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో పాటు మాజీ స్పీకర్ మధుసూధనాచారి, బండ ప్రకాశ్ కు కూడా ఈ సారి కెబినెట్లో అవకాశం రావచ్చు. ప్రాంతాలు సామాజికవర్గాల వారీగా లెక్కలు చూసుకునే కేసీఆర్ తన మంత్రివర్గంలో మార్పులు చేస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఎన్నికల టీమ్ ను ఏర్పాటు చేసుకుని సిద్ధం కావాలని కేసీఆర్ అనుకుంటున్నట్లుగా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.