KTR on Twitter: కాంగ్రెస్‌ది డిక్లరేషన్ సభ కాదు-ఫ్రస్ట్రేషన్ సభ : కేటీఆర్
కాంగ్రెస్‌ది డిక్లరేషన్ సభ కాదని.. కాంగ్రెస్ ఫ్రస్ట్రేషన్ సభ అన్నారు. కర్ణాటకలో కనీసం రేషన్ ఇవ్వలేని కాంగ్రెస్.. తెలంగాణ వచ్చి డిక్లరేషన్ ఇస్తే నమ్మేదెవరని ప్రశ్నించారు.
చేవెళ్ల కాంగ్రెస్ సభ తర్వాత... బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం జరగుతోంది. ఎస్సీ, ఎస్టీలకు డిక్లరేషన్ పేరుతో 12 హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తే.. దళిత, గిరిజనులకు న్యాయం జరుగుతుందని... సభా వేదికపై నుంచి విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ నేతలు. పదో తరగతి నుంచి పీహెచ్‌డీ పూర్తి చేసిన విద్యార్థులు నగదు ప్రోత్సాహం కూడా ప్రకటించారు. దళిత, గిరిజనులకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని... కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే వారికి న్యాయం జరుగుతుందని అన్నారు. అయితే, కాంగ్రెస్ డిక్లరేషన్ సభపై బీఆర్‌ఎస్ నేతలు మండిపడుతున్నారు. దీనిపై మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు.
చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ సభపై మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్ కాంగ్రెస్ డిక్లరేషన్ సభపై సెటైర్లు వేస్తూ ట్వీట్ చేశారు. అసలు అది డిక్లరేషన్ సభేకాదని... కాంగ్రెస్ ఫ్రస్ట్రేషన్ సభ అని ఫైరయ్యారు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరుతో.. విజన్ లేని కాంగ్రెస్ ఇచ్చిన డజను హామీలు గాల్లో దీపాలేననే విషయం... చైతన్యవంతులైన తెలంగాణ ప్రజలకు తెలుసని అన్నారు. కర్ణాటకలో కనీసం రేషన్ ఇవ్వలేని కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణకు వచ్చి డిక్లరేషన్ ఇస్తే నమ్మేది ఎవరంటూ ప్రశ్నించారు కేటీఆర్. గాడ్సేనే గెలుస్తాడన్న గ్యారెంటీ లేదు.. మీ 12 గ్యారెంటీలకు విలువ ఎక్కడిది అంటూ సెటైర్ వేశారు.
స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా ఎస్సీ, ఎస్టీలు వెనుకబడి ఉన్నారంటే దానికి కారణం.. కాంగ్రెస్ పార్టీనే అని, ప్రధాన దోషి ఆ పార్టీనే అని విమర్శించారు కేటీఆర్. కాంగ్రెస్ హయాంలో దళిత, గిరిజనలకు చేసిన పాపాలు.. ఆ పార్టీని మరో వందేళ్లు శాపంలా వెంటాడుతూనే ఉంటాయన్నారు. కర్ణాటకలో నమ్మి ఓటేసిన ప్రజలను నట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీకి పాలించే అర్హతే లేదన్నారు కేటీఆర్. అసలు కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో క్రెడిబిలిటీనే లేదన్నారు ఆయన.
తెలంగాణ రాష్ట్రం అంటేనే.. దేశానికే ఓ పరిపాలనా పాఠమని చెప్పారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చిందని... ఇవ్వని హామీలెన్నో అమలుచేసింది ట్వీట్‌లో తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలు ఏం చేశాయని యాన ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీకి చరిత్ర లేదని, కాంగ్రెస్‌కు భవిష్యత్తు అంతకన్నా లేదని కేటీఆర్ విమర్శించారు. చరిత్ర, భవిష్యత్తు ఉన్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమే.. అని ట్వీట్ చేశారాయన.