Karnataka Elections 2023 : బీజేపీని ఆదరించని తెలుగు ఓటర్లు - ఘోర పరాజయానికీ ఇదీ ఓ కారణమా?
తెలుగు ఓటర్లు బీజేపీకి కర్ణాటకలో ఓట్లు వేయలేదు. కారణం ఏమిటంటే ?
Karnataka Elections 2023 : కర్ణాటక ఎన్నికల్లో తెలుగు వచ్చిన , తెలుగు మాట్లాడే ఓటర్లు కీలకం అయ్యారని మొదటి నుంచి విస్తృతంగా ప్రచారం జరుగుతూనే ఉంది. వారిని ఆకట్టుకోవడానికి విస్తృతంగా రాజకీయ పార్టీలు ప్రయత్నించాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నేతల్ని పంపి ప్రచారం చేయించారు. అయితే భారతీయ జనతా పార్టీపై అధికార వ్యతిరేకత బాగా కనిపించింది. మరోసారి ఆ ప్రభుత్వం వద్దని తెలుగు వాళ్లుకూడా అనుకున్నారు. అందుకే బీజేపీకి తెలుగు వాళ్లు ఎక్కువగా ఉన్న సరిహద్దు ప్రాంతాల్లో పెద్దగా సీట్లు రాలేదు.
తెలుగువారు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో బీజేపీకి వచ్చింది ఆరు సీట్లే!
ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల సరిహద్దుల్లోనూ తెలుగు ప్రజలు ఉన్నారు. దాదాపుగా ఎనిమిది జిల్లాల్లో తెలుగువారు ఎక్కువగా ఉంటారు. ఆ ఎనిమిది జిల్లాల్లో కలిపి మొత్తం 49 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అయితే అందులో బీజేపీ గెల్చుకుంది కేవలం ఆరు సీట్లనే. అంటే తెలుగు ఓటర్లు బీజేపీని పూర్తి స్థాయిలో దూరం పెట్టారని అర్థం చేసుకోవచ్చని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మొత్తం ఎనిమిది జిల్లాల్లో కోలార్ , యాద్గిర్, చిక్ బళ్లాపూర్ జిల్లాలతో పాటు బీజేపీకి పట్టు ఉన్న బళ్లారి జిల్లాలో కూడా బీజేపీ ఖాతాలో ఒక్క సీటు కూడా పడలేదు. ఈ ఫలితాలు బీజేపీ హైకమాండ్ ను కూడా ఆశ్చర్య పరిచాయని అనుకోవచ్చు.
తెలుగు వారు బీజేపీని ఎందుకు దూరం పెట్టారు ?
కోలార్ జిల్లాలో తెలుగు మాట్లాడేవారు అత్యధికం ఉంటారు. ఆ జిల్లాలో మొత్తం ఆరు సీట్లు ఉన్నాయి. బీజేపీ అభ్యర్థి ఒక్కరు కూడా విజయం సాధించలేదు. చిక్ బళ్లాపూర్‌లోనూ అదే పరిస్థితి.ఆ జిల్లాలో ఐదు అసెంబ్లీ స్థానాలుంటే ఐదింటిలోనూ ఓడిపోయారు. స్వయంగా రాష్ట్ర మంత్రి సుధాకర్ కూడా పరాజయం పాలయ్యారు. ఆయన కోసం బ్రహ్మానందం కూడా ప్రచారం చేశారు. నిజానికి సుధాకర్ కాంగ్రెస్ నేత .. పార్టీ ఫిరాయించి మంత్రి పదవి తెచ్చుకున్నారు.దాంతో ఈసారి ఆయన పరాజయం పాలయ్యారు. తుముకూరు జిల్లాలో పదకొండు అసెంబ్లీ సీట్లు ఉంటే.. రెండు చోట్ల, చిత్ర దుర్గ జిల్లాలో ఆరింటిలో ఒకటి, విజయనగర జిల్లాలో ఐదింటిలో ఒకటి మాత్రమే గెలిచారు. ఇక తెలంగాణ సరిహద్దులో ఉండే రాయచూర్ లో మొత్తం ఐదు అసెంబ్లీ స్థానాలంటే రెండు గెలిచారు. యాద్గిల్ జిల్లాలో ఒక్కటీ రాలేదు.
పూర్తిగా కర్ణాటక రాజకీయాల ప్రభావమే !
అయితే తెలుగు ఓటర్లు బీజేపీకి ఓటు వేయకపోవడానికి కర్ణాటక రాజకీయాలే కారణం కానీ.. తెలుగు రాజకీయాలు వారిని ప్రభావితం చేసి ఉండవని ఎక్కువ మంది అంచనా వేస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉండటం వల్లే వారు కాంగ్రెస్ కు ఓటు వేశారని అంటున్నారు. నిజానికి తెలుగురాష్ట్రాల తరహాలో కాకపోయినా.. తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో బీజేపీ అంత బలంగా ఎప్పుడూ లేదు. కానీ ఈ సారి అధికార పార్టీగా పూర్తి స్థాయిలో ఆధిపత్యం చెలాయిస్తుందని అనుకున్నారు. కానీ తెలుగు ఓటర్లు పడనీయలేదు.