Munugodu ByElections : చలో మునుగోడు ! తెలంగాణ రాజకీయం అంతా ఇక అక్కడే
తెలంగాణ రాజకీయం అంతా మునుగోడుకు మారుతోంది. ఉపఎన్నికల కోసం అందరూ కసరత్తులు ప్రారంభించారు.
Munugoudu ByElections : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇలా రాజీనామా లేఖ రాయడం.. అలా ఆమోదించడం చకచకా జరిగిపోయాయి. అంటే ఉపఎన్ని ఖాయమైపోయింది. ఉపఎన్నిక కూడా ఆలస్యం జరగని.. రెండు నెలల్లోనే ఉండవచ్చని చెబుతున్నారు. దీంతో రాజకీయ పార్టీలు రేసు ప్రారంభించాయి. తమ సన్నాహాలను వేగవంతం చేశాయి. అభ్యర్థులపై కసరత్తు కూడా చేస్తున్నాయి.
అధికారయంత్రాంగాన్ని ప్రక్షాళన చేసే ప్రయత్నంలో టీఆర్ఎస్ !
అధికార పార్టీగా టీఆర్ఎస్‌కు అడ్వాంటేజ్ ఉంటుంది. అధికార యంత్రాంగాన్ని ప్రక్షాళన చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఉన్నతాధికారులను ఒకటి, రెండు రోజుల్లో మార్చవచ్చన్న ప్రచారం జరుగుతోంది. మరో వైపు గ్రౌండ్ లెవల్లో టీఆర్ఎస్ పని ప్రారంభించారు. అభ్యర్థి ఎంపికపై కసరత్తు ప్రారంభించింది. అధికార పార్టీగా పెద్ద ఎత్తున ఓటర్లను లబ్ది చేకూర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆగస్టు పదిహేనో తేదీన పది లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లుగా కేసీఆర్ ప్రకటించారు. అందులో భాగంగా మునుగోడులో దరఖాస్తు చేసిన వారందరికీ పెన్షన్లు ఇవ్వడం ఖాయమని అనుకోవచ్చు. అభ్యర్థిఎంపికైనా కేసీఆర్ సర్వే నిర్వహింప చేస్తున్నట్లుగా చెబుతున్నారు. బీసీ అభ్యర్థికి ఇవ్వాల్సి వస్తే కర్నె ప్రభాకర్ లేకపోతే.. గుత్తా సుఖేందర్ రెడ్డి వంటి వారి పేర్లను పరిశీలించవచ్చని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నారు.
మునుగోడుకు చేరుకున్న బండి సంజయ్ పాదయాత్ర !
ఇక వ్యూహాత్మకంగా ఉపఎన్నికను తీసుకు వచ్చిన బీజేపీ .. అక్కడ కార్యాచరణ ప్రారంభించింది. నిజానికి మునుగోడులో బీజేపీకి అంత బలం లేదు. కానీ బండి సంజయ్ మూడో విడత పాదయాత్ర ప్రారంభించి మునుగోడులోకి ప్రవేశించే సమయానికి అక్కడ ఉపఎన్నిక వచ్చేలా ప్లాన్ చేసుకున్నారు . దాని ప్రకారమే అంతా నడుస్తోంది. ఇప్పుడు మునుగోడులోకి బండి సంజయ్ పాదయాత్ర అడుగుపెడుతోంది. అంటే ఇక బీజేపీ పూర్తి స్థాయిలో రంగంలోకి దిగినట్లే అనుకోవాలి. రాజగోపాల్ రెడ్డి తన అనుచరుల్ని వరుసగా పార్టీలో చేర్చేఅవకాశం ఉంది. 21వ తేదీన భారీ బహిరంగసభ ఏర్పాటు చేస్తున్నారు. ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి నేరుగా రంగంలోకి దిగి .. ఎన్నికల వేడిని కనసాగించే అవకాశాలు ఉన్నాయి.
బహిరంగసభతో తాము తగ్గేది లేదంటున్న కాంగ్రెస్ !
రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తారని తెలియగానే... ముందుగా బహిరంగసభ పెట్టాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. చండూరులో పెద్ద ఎత్తున జన సమీకరణ నిర్వహించి మరీ సభను నిర్వహించారు. ఈ సభలో ఓ రకంగా కాంగ్రెస్ పార్టీ బలప్రదర్శన చేసింది. సంప్రదాయంగా తమకు పట్టు ఉన్న మునుగోడులో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరుతామని రేవంత్ రెడ్డి నమ్మకంతో ఉన్నారు. నల్లగొండ కాంగ్రెస్ సీనియర్లు మునుగోడు బాధ్యత తీసుకునే చాన్స్ లేదు. అందుకే రేవంతే తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే ఓ కమిటీని ఈ ఎన్నికల కోసం నియమించారు. ముందు ముందు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కార్యకలాపాలు పెంచే అవకాశం ఉంది. చెరుకు సుధాకర్‌ను పార్టీలో చేర్చుకుని బీసీ అభ్యర్థిని నిలబెడతామన్న సంకేతాలు పంపారు.
తాము కూడా పోటీ చేస్తామంటున్న ఇతర పార్టీలు...!
ఎన్నికల్లో తాము కూడా పోటీ చేస్తామని ఇతర పార్టీలు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్.. బీఎస్బీ అభ్యర్థిని నిలబెడతామని ప్రకటించారు. బలంఉన్న కమ్యూనిస్టులూ పోటీపై ఆలోచన చేస్తున్నారు. మొత్తంగా తెలంగాణ రాజకీయం మునుగోడుకు షిఫ్ట్ అవుతోంది.