Munugode News: మూడు పార్టీల వ్యూహంలో మునుగోడు, ఒకరికి మించి మరొకరి వ్యూహాలు - రంగంలోకి అమిత్ షా
Munugode: తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు చర్చానీయాంశంగా మారిన మునుగోడు ఉప ఎన్నికలు మూడు ప్రధాన పార్టీల మధ్య రసవత్తరంగా మారింది.
మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా తెలంగాణలో వచ్చే సాధారణ ఎన్నికల్లో సత్తా చాటేందుకు అన్ని పార్టీలు సిద్దమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ తన సీటును కాపాడుకోవడంతోపాటు వచ్చే ఎన్నికల్లో తన సత్తాచాటాలని, హుజూరాబాద్ ఎన్నికల్లో విజయం సాధించి మంచి ఊపులో ఉన్న బీజేపీ సైతం తెలంగాణలో పాగా వేసేందుకు మునుగోడు ఉప ఎన్నికకు కారణమైంది. ఇక్కడ విజయం సాధించి తద్వారా తెలంగాణలో పాగావేయాలని భావిస్తోంది. మరోవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ పార్టీ ఇక్కడ గెలవడం ద్వారా ముచ్చటగా మూడోసారి అధికారాన్ని చేజిక్కుంచుకోవాలని చూస్తోంది.
నాలుగు నెలల పాటు అక్కడే..
గత కొద్ది రోజులుగా మునుగోడు విజయావకాశాలపై కసరత్తులు చేసిన అన్ని పార్టీలు ఇప్పుడు నేరుగా మునుగోడులోనే తమ నాయకత్వాన్ని మోహరించాలనే వ్యూహంతో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అన్ని పార్టీలకు చెందిన ప్రధాన నాయకుల టూర్లు సిద్దం కావడం గమనార్హం. మునుగోడుకు అక్టోబర్ లేదా నవంబర్ నెలలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పట్నుంచే ఇంటింటికి తిరిగి ప్రచారం ప్రారంబించాలనే వ్యూహంతో ప్రధాన పార్టీలు సిద్దమయ్యాయి. ఈ నేపథ్యంలోనే మండల, గ్రామ కమిటీ బాద్యులను సైతం ఎంపిక చేశారు. ఇదిలా ఉండగా జాతీయ స్థాయి నాయకులు సైతం ఇప్పుడు మనుగోడులో ప్రచారం తమ పార్టీని గెలిపించుకునేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.
పార్టీ సీటును కాపాడుకునేందుకు కాంగ్రెస్..
మునుగోడులో రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కావడంతో తిరిగి ఆ సీటును గెలుచుకోవాలని ఆ పార్టీ చూస్తోంది. ఇప్పటికే రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసిన తర్వాత చండూరులో సభ నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని భావిస్తోంది. ఈ మేరకు మండలాల వారీగా ఇన్‌చార్జ్‌లను నియమించిన పార్టీ అధినాయకత్వం గ్రామస్థాయిలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం చేసేలా వ్యూహం రచిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్యం ఠాగూర్ హైదరాబాద్‌లో ఉంటూ అందరిని ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. ఈ నెల 20 నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రచారం ప్రారంబించనుంది. దీంతోపాటు రాహుల్, ప్రియాంకలను సైతం మునుగోడులో పర్యటించేలా వ్యూహాలు రచించారు. టీపీసీసీ అధ్యక్షుడు సైతం ఎక్కువ రోజులు మునుగోడులో ఉండేలా ప్రణాళికలు చేశారు.
వ్యూహాత్మకంగా టీఆర్‌ఎస్ పార్టీ..
మునుగోడుపై దృష్టి సారించిన టీఆర్‌ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే మునుగోడు నియోజకవర్గం కీలక నేతలతో సమావేశాలు ఏర్పాటు చేయడంతోపాటు అసంతృప్తులను బుజ్జగించే పనిలో పడింది. మరోవైపు కేసీఆర్ ఈ నెల 20 తర్వాత ఇక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేయడం ద్వారా ఎన్నికల శంకారావం పూరించేందుకు సిద్దమయ్యారు. ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి నాయకులను మండలాల్లో ఇన్‌చార్జీలుగా ఏర్పాటు చేసి ఎలాగైనా మునుగోడులో విజయం సాదించాలనే వ్యూహంతో టీఆర్‌ఎస్ పార్టీ ముందుకు సాగుతుంది. మునుగోడులో విజయం సాదించి ముచ్చటగా మూడోసారి తెలంగాణలో అధికారం తెచ్చుకోవాలనే ఆలోచనతో టీఆర్‌ఎస్ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో పాగా వేసేందుకు చూస్తున్న బీజేపీ..
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ పార్టీలో చేరిన తర్వాత ఆయనతో రాజీనామా చేయించిన బీజేపీ ఇక్కడ విజయం సాదించడం ద్వారా తెలంగాణలో పాగా వేయాలని బావిస్తోంది. వెంకటరెడ్డి బలమైన అభ్యర్థి కావడంతో తమ మద్దతుతో ఇక్కడ విజయం సాదించాలని చూస్తోంది. ఇప్పటికే చేరికలతో అటు టీఆర్‌ఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీలను ఇరుకునపెడుతుంది. మరోవైపు ఈ నెల 21న అమిత్‌షా మునుగోడులో పర్యటించనుండటంతో భారీ ఎత్తున జనసమీకరణ చేసి మునుగోడులో విజయం సాదించాలని బావిస్తున్నట్లు సమాచారం. అటు బండి సంజయ్, ఇటు ఈటెల రాజేందర్‌లు ఈ నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్‌చుగ్ సైతం మునుగోడుపై ప్రత్యేక దృష్టి పెట్టడం గమనార్హం. ఏది ఏమైనా మూడు ప్రధాన పార్టీలకు కీలకంగా మారిన మునుగోడు ఉప ఎన్నికల్లో ఎవరు విజయం సాదిస్తారనేది వేచి చూడాల్సిందే.