KCR Risky Politics : తెలంగాణ లేని రాజకీయం వర్కవుట్ అవుతుందా ? కేసీఆర్ ప్రతీ సారి అద్భుతం జరుగుతుందని అనుకుంటున్నారా ?
తెలంగాణ సీఎం కేసీఆర్ సెంటిమెంట్ రాజకీయాల్ని వదిలేసినట్లేనా ? జాతీయ స్థాయిలో ఆయన ఎజెండా ప్రజలకు నచ్చుతుందా ?
KCR Risky Politics : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాజకీయంగా తిరుగులేని స్థానం ఇచ్చింది తెలంగాణ. ఇక్కడ తెలంగాణ ప్రాంతం కాదు. ఉద్యమం. తెలంగాణ ఉద్యమం.ప్రజల్లో తెలంగాణపై ఉన్న ప్రేమను ఉద్యమంగా మార్చడం.. ఆ ఉద్యమానికి నేతృత్వం వహించడం వల్ల కేసీఆర్‌కు రాజకీయంగా బాహుబలిలాగా ఎదిగారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆయనకు తెలంగాణ ఉద్యమమే అండగా నిలిచింది. మరి ఇప్పుడు కేసీఆర్ ఆ కవచ కుండలాల్ని ఉద్దేశపూర్వకంగా వదిలేశారు. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చేశఆరు. ఇక నుంచి తెలంగాణ గురించి ప్రత్యేకంగా చెప్పలేరు. దేశం గురించి మాత్రమే మాట్లాడాలి. మరి కేసీఆర్ నెగ్గుకు రాగలరా ?
కేసీఆర్‌తో తెలంగాణకు పేగు, పేరు బంధాలు తెగిపోయానని విపక్షాల విమర్శలు !
టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చడం.. తెలంగాణ స్థానంలో భారత్ ను చేర్చడంతో విపక్ష పార్టీలు విమర్శలు ప్రారంభించాయి. కేసీఆర్ ను తెలంగాణ వ్యక్తిగా టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అంగీకరించరు. ఆయన మూలాలు బీహార్‌లో ఉన్నాయని.. పూర్వీకులు విజయనగరం నుంచి వచ్చారని చెబుతూ ఉంటారు. దీన్నే గుర్తు చేస్తూ.. కేసీఆర్‌కు తెలంగాణతో పేగుబంధం లేదని.. ఇప్పుడు పేరు బంధం కూడా తొలగించుకున్నారని విమర్శించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. తెలంగాణ అనే పదంతో రుణం తీర్చేసుకున్నారని మండిపడ్డారు. వీరి విమర్శలు సహజమే అయినా... తెలంగాణ లేని కేసీఆర్ పార్టీ అనేది ఆ పార్టీ నేతకు కూడా జీర్ణించుకోలేని అంశమే.
కేసీఆర్ అంటే తెలంగాణ.. ఈ ముద్రను వదిలించుకోవడం అంత తేలిక కాదు !
తెలంగాణ అంటే టీఆర్ఎస్.. టీఆర్ఎస్ అంటే కేసీఆర్. కేసీఆర్ పేరు చెప్పినా.. టీఆర్ఎస్ ను గుర్తు చేసుకున్నా అందరికీ గుర్తొచ్చేది తెలంగాణనే. తమ లక్ష్యం తెలంగాణ రాష్ట్ర సాధన అని టీఆర్ఎస్‌ను స్థాపించారు. సెంటిమెంట్‌ను రగిలిగించారు. ప్రజలందర్నీ ఏకతాటిపైకి తెచ్చారు. రెండు సార్లు అదే సెంటిమెంట్‌తో అధికారాన్ని చేపట్టారు. కానీ ఇప్పుడు కేసీఆర్ పూర్తిగా తెలంగాణను మర్చిపోవాలని నిర్ణయించుకున్నారు. ఏ ఉద్యమం.. ఏ టీఆర్ఎస్ అయితే తనను ఈ స్థాయిలో నిలబెట్టిందో ఆ తెలంగాణను మార్చేశారు. తెలంగాణ స్థాయిలో ఇండియాను అభివృద్ధి చేస్తామని భారత రాష్ట్ర సమితిగా మారారు. తన విజన్‌ను ప్రకటించారు.
టీఆర్ఎస్ తరహాలోనే ప్రజలు బీఆర్ఎస్ ను ఓన్ చేసుకుంటారా ?
తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చెప్పింది .. చేసింది ఒక్కటే. ఒక్క తెలంగాణ రాష్ట్ర సమితి మత్రమే మన పార్టీ. మిగిలినవన్నీ ఆంధ్రా పార్టీలు. జాతీయ పార్టీలను కూడా తెలంగాణ పార్టీలుగా పరిగణించలేదు. కేసీఆర్ చెప్పే మాటలకు ప్రజలు ఎంతో ఆకర్షితులయ్యే వారు. మన పార్టీ అనే భావన.. సెంటిమెంట్ టీఆర్ఎస్‌కు రక్షణ కవచంగా ఉండేది. ఇప్పుడు మన పార్టీని కేసీఆర్ అంతర్థానం చేశారు. తెలంగాణ ప్రజలకు ఇది మన పార్టీ అనే భరోసాను ఇస్తుందా అనేది కీలకం తెలంగాణ కోసమే ఉద్యమించలేరు. అలా చేస్తే.. ఇతర చోట్లా చులకన అవుతారు. అందుకే ప్రజల మద్దతు కీలకం. ఈ విషయం కేసీఆర్‌కూ తెలుసు కాబట్టే ప్రతీ సభలోనూ నా వెంట ఉండండి అని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
కేసీఆర్ ముందు క్లిష్టమైన సవాళ్లు- ఎదుర్కోలేకపోతే ఇప్పటి వరకూ సాధించింది బూడిదలో పోసిన పన్నీరే !
కారణం ఏదైనప్పటికీ కేసీఆర్ తెలంగాణను ద్వితీయ ప్రాధాన్యతలోకి తీసుకుని జాతీయ రాజకీయాలకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఓ ప్రాంతీయ పార్టీ అధినేత ఇలా జాతీయ పార్టీ పెట్టి రంగంలోకి దిగడం దేశ రాజకీయాల్లో కొత్త అనుకోవచ్చు. కేసీఆక్ ఓ రకంగా సాహసం చేస్తున్నారు. తాను రాజకీయంగా ఎదిగిన తెలంగాణ సెంటిమెంట్ అనే అస్త్రాన్ని వదిలేసి .. రంగంలోకి దిగుతున్నారు. ఇప్పుడు కేసీఆర్ వద్ద ఎలాంటి ఆయుధం లేదు. దాన్ని ఆయన ఇప్పుడు సమీకరించుకుని పోరాటం చేయాలి. లేకపోతే మొదటికే మోసం వస్తుంది. కేసీఆర్ ఆ సవాల్ తీసుకోవడానికి సిద్ధమయ్యారు.