Tiruvuru News: స్వామిదాసుపై సానుభూతి చూపేనా? - కొలికలపూడి కుంభస్థలం కొట్టేనా?
Tiruvuru Therpu: తిరువూరులో పూర్వవైభవం కోసం టీడీపీ ప్రయత్నిస్తుండగా..వైసీపీ హ్యాట్రిక్ విజయంపై కన్నేసింది.
Tiruvuru constituency: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పార్లమెంట్ పరధిలోని తిరువూరు(Tiruvuru) అసెంబ్లీ నియోజకవర్గం...ఆంధ్రరాష్ట్రం విభజన చట్టం ప్రకారం 1952లో ఏర్పాటైన ఈ నియోజకవర్గం తొలి ఎన్నికలు మద్రాస్ ప్రెసిడెన్సీలోనే జరిగాయి. అప్పటి నుంచి ఎవరెవరు గెలిచారు..? ఏయే పార్టీలు పైచేయి సాధించాయో ఓసారి చూస్తే..
తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గం
తిరువూరు అసెంబ్లీ నియోజవర్గం 1952లో ఏర్పాటు కాగా...తొలిసారి జరిగిన ఎన్నికల్లో సీపీఐ(CPI), కాంగ్రెస్(Congress) పార్టీలు పోటీపట్టాయి. కాంగ్రెస్ అభ్యర్థి పేటబాపయ్యపై సీపీఐ నేత పేట రామారావు 21 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 1955 జరిగిన ఎన్నికల్లో మరోసారి ఈ ఇద్దరే ప్రత్యర్థులుగా బరిలో దిగగా..ఈసారి కాంగ్రెస్(Congress) అభ్యర్థి బాపయ్య విజయం సాధించారు. 1962లో జరిగిన ఎన్నికల్లో రెండోసారి కాంగ్రెస్ తరపున పోటీపడి సీపీఐ అభ్యర్థి సుంకర వీరభద్రరావుపై బాపయ్య విజయం సాధించారు. ఇప్పటి వరకు జనరల్ స్థానంలో ఉన్న తిరువూరు నియోజకవర్గం 1967 నుంచి ఎస్సీ రిజర్వుడ్ గా మారింది. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్టు కూర్మయ్య దక్కించుకుని సీపీఎం(CPM) అభ్యర్థి బీమ్లా సంజీవ్‌పై 10 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1972లో మరోసారి కాంగ్రెస్ పార్టీ ఈ సీటు నిలబెట్టుకోగా.. ఆ పార్టీ నుంచి పోటీ చేసిన కోట రామయ్య ఇండిపెండెంట్ అభ్యర్థి బీమ్లా సంజీవ్‌పై విజయం సాధించారు.1978లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్(ఐ) అభ్యర్థి వక్కలగడ్డ ఆడం..జనతాపార్టీ అభ్యర్థి కోటా పున్నయ్యపై విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ వరుస విజయాలకు తెలుగుదేశం(Telugudesam) బ్రేక్‌లు వేసింది. తెలుగుదేశం ఆవిర్భావం అనంతరం జరిగిన 1983 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసిన మిర్యాల పూర్ణానంద్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీకాంతయ్యపై 2వేల 500 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1985లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం(Telugudesam) ఈ సీటును నిలబెట్టుకోగా... ఆ పార్టీ నుంచి పిట్టా వెంకటరత్నం సమీప ఇండిపెండెంట్ అభ్యర్థి మోడుగు రాఘవులపై 12 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1989లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థి కొత్తపల్లి రవీంధ్రనాథ్(Ravindranath)పై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోనేరు రంగారావు(Koneru Rangarao) 2వేల ఓట్లతో విజయం సాధించారు.
అనంతరం కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగానూ, మున్సిపల్, దేవదాయశాఖ మంత్రిగా పని చేశారు. 1994లో రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం గాలి వీయడంతో ఆ పార్టీ నుంచి నల్లగడ్ల స్వామిదాసు(Nallagadla Swamydas) కాంగ్రెస్ అభ్యర్థి కోనేరు రంగారావుపై దాదాపు 8వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1999లోనూ మళ్లీ అదే అభ్యర్థులు పోటీపడగా...ఈసారి స్వామిదాసును విజయం వరించింది. కేవలం 1100 ఓట్ల మెజార్టీతో ఆయన బయటపడ్డారు. 2004లో మరోసారి స్వామిదాసు, కోనేరు రంగారావు పోటీపడగా...విజయం కాంగ్రెస్‌ను వరించింది. 2009లో మరోసారి తెలుగుదేశం నుంచి నల్లగడ్ల స్వామిదాసు పోటీ చేయగా...కాంగ్రెస్ అభ్యర్థి దిరిశం పద్మజ్యోతి(Padma Jyothi) కేవలం 265 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2014లోని టీడీపీ స్వామిదాసుకు అవకాశం ఇచ్చింది. వైసీపీ(YCP) నుంచి పోటీ చేసిన రక్షణనిధి 1600 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2019లో మంత్రి జవహర్(Javahar)ను తిరువూరు నుంచి తెలుగుదేశంం రంగంలోకి దింపగా...వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణనిధి(Rakshana Nidhi) పోటీలో నిలిచి రెండోసారి గెలుపొందారు. ప్రస్తుత ఎన్నికల్లో తెలుగుదేశం, వైసీపీ రెండు పార్టీలు అభ్యర్థులను మార్చాయి. తెలుగుదేశం నుంచి వైసీపీలో చేరిన నల్లగడ్ల స్వామిదాసు ఆ పార్టీ నుంచి బరిలో దిగుతుండగా....తెలుగుదేశం ప్రొఫెసర్ కొలికపూడి శ్రీనివాసరావు(Kolikapudi Srinivasarao)కు టిక్కెట్ ఇచ్చింది. వరుసగా మూడుసార్లు స్వల్ప తేడాతో ఓటమిపాలైన స్వామిదాస్‌పు సానుభూతి పనిచేస్తుందో లేక విద్యావంతుడైన కొలికపూడి వైపు తిరువూరు ఓటర్లు మొగ్గు చూపుతారో చూడాలి.