Jagan Birthday Expences : ప్రజాధనంతో పుట్టిన రోజు వేడుకలా ? సీఎం జగన్ తీరుపై టీడీపీ విమర్శలు !
సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలకు ప్రజాధనాన్ని ఖర్చు పెడుతున్నారని టీడీపీ మండిపడింది. ఏం సాధించారని ప్రజాధనం ఖర్చు పెట్టి వేడుకలు చేసుకుంటున్నారని ప్రశ్నించింది.
Jagan Birthday Expences : ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలకు పెద్ద మొత్తంలో ప్రజాధనం వృధా చేస్తున్నారని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. జగనన్న స్వర్ణోత్సవ సంబరాల పేరుతో రూ. రెండున్నర కోట్లు ఖర్చు పెట్టి కార్యక్రమాలు చేయడం ఏమిటని టీడీపీ ప్రశ్నిస్తోంది. ఇది ప్రజాధనం దుర్వినియోగం చేయడమేనని మండి పడుతోంది.
జగన్ పుట్టిన రోజు వేడుకలకు ప్రజాధనం ఖర్చు !
జగన్ పుట్టిన రోజుకు సాంస్కృతిక, క్రీడాశాఖలు రూ.2.50 కోట్లు వెచ్చించడం దారుణమని ..గతంలో ఏ సీఎం కు ఇలా చేయలేదని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. ఎన్టీరామారావు పుట్టినరోజు సందర్భంగా ప్రతి యేడాది స్వచ్చందంగా రక్తదానాలు చేశారని ..కానీ శిబిరాల వద్దకు తీసుకొచ్చి రక్తమివ్వండని ఎవరూ అడగరన్నారు డాక్టర్లు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఇతర అభిమానులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారని కానీ ఇప్పుడు జగన్ పుట్టిన రోజు సందర్భంగా రక్తదానం చేయాలని బలవంత పెడుతున్నారని మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ విమర్శలు గుప్పించారు. జేఎన్ టీయు, ఎన్ఎస్ఎస్ సంస్థ ల ద్వారా విద్యార్థులచే బలవంతంగా రక్తదానం చేయించడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు.
రాష్ట్రానికి ఏం చేశారని పుట్టిన రోజు వేడుకలు !
మూడున్నర సంవత్సరాలుగా విద్యార్థులు, మహిళలు, యువకులు, వృద్ధులు, ఉపాధ్యాయులు, ఉద్యోగస్థులు, కూలీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏ వర్గంవారు కూడా సంతోషంగా లేరని టీడీపీ మండిపడింది. జగన్.. రాష్ట్రానికి ఏమీ చేయలేదని... రాష్ట్రాన్ని పరిపరివిధాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఆరోపించారు. జగన్ పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నారని, ఈ పోటీలలో విద్యాదీవెన, వసతి దీవెన, నాడు-నేడు, అమ్మఒడి పెట్టిన అంశాలుగా పెట్టారని, పాల్గొనే విద్యార్థులకు జగన్ ప్రవేశపెట్టిన పథకాలను పొగిడితేనే ఫస్ట్, సెకండ్ మార్కులొస్తాయి కాని, విమర్శనాత్మక ధోరణితో రాస్తే ప్రైజు రాదు అని భయపడి తల్లిదండ్రులు విద్యార్థులకు చెబుతున్నారని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ విమర్శించారు.
రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి పోయేలా చేసినందుకా వేడుకలు !
జగన్ స్వాతంత్ర్య సమరయోధులు కాదు .. రాష్ట్రంలో ఎవరూ తీసుకరాని సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి కూడా కాదు. రాష్ట్రానికి మంచి పనులు కూడ చేయలేదన్న టీడీపీ స్పష్టం చేసిదంి. రాష్ట్రాన్ని అధోగతిపాలు చేశారని,ప్రజల జీవన ప్రమాణాలను అధోపాతాళానికి నెట్టేశారన్నారు. రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కి పోయేలా చేశారని, రాష్ట్రానికి పెట్టుబడులు రానీయకుండా చేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టాక రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాలేదన్నారు. పారిశ్రామిక వేత్తలు భయంతో తరలి వెళ్లిపోయేలా చేశారని,ఎన్నికలకు ముందు అనేక హామీలిచ్చి నమ్మినందుకు నట్టేట ముంచారని విమర్శించారు. నాకొక ఛాన్స్ ఇచ్చి చూడండి నా సత్తా చూపిస్తానని చెప్పి చివరకు చేతులు ఎత్తేసిన విషయం ప్రజలంతా గమనించారని రామకృష్ణ అన్నారు. ఇవన్నీ చేసినందుకా పట్టిన రోజు వేడుకలు అని.. ప్రశ్నించారు.