Ambati Counter : అంత ఖర్మ పట్టలేదు - జనసేన ఆరోపణలపై అంబటి రియాక్షన్ ఇదిగో
చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు ఇచ్చే పరిహారంలో లంచం తీసుకునే ఖర్మ తనకు పట్టలేదని అంబటి రాంబాబు అన్నారు. జనసేన ఆరోపణల్ని ఖండించారు.
Ambati Counter : అవినీతి ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ చేసిన మంత్రి అంబటి రాంబాబు.. తాజాగా జనసేన పార్టీ చేస్తున్న ఆరోపణలను నిరూపించాలని సవాల్ చేశారు. రైతులతో సంబందం లేని వారిని తెరమీదకు తెచ్చి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తన కుమారుడు డ్రైనేజీ పనుల్లో చనిపోతే.. ప్రభుత్వం నుండి వచ్చిన 5లక్షల రూపాయలుు ఆర్దిక సహయంలో రెండున్నర లక్షల రూపాయలు ఇవ్వాలని అంబటి రాంబాబు ఆయన అనుచరులు డిమాండ్ చేశారని ఓ నిరుపేద దంపతులు ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల విడియోలు బయటకు వచ్చాయి- దీని పై టీడీపీ సహ ఇతర రాజకీయ పార్టీలు విమర్శలు ప్రారంభించాయి. చంద్రబాబు సైతం ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.
ఈ వ్యవహరం పై మంత్రి అంబటి కూడా అంతే స్దాయిలో ఎదురు దాడికి దిగారు.రైతుల ఆత్మహత్యల పరిహారంలో డబ్బులు తీసుకున్నానని సత్తెనపల్లి నియోజకవర్గం ధూళిపాళ్ళ వచ్చి తన పై పవన్ కల్యాణ్ ఆరోపణలు చేశారన్నారు. నిరూపించమని తాను సవాల్ విసిరితే ...చేతకాక పారిపోయి, రైతులకు సంబంధం లేని వేరే ఘటనను తెరపైకి తీసుకొచ్చి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, సత్తెనపల్లి నియోజకవర్గంలో మొత్తం 12 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే.. వారికి ఒక్కొక్క కుటుంబానికి రూ.7 లక్షలు చొప్పున మొత్తం రూ. 84 లక్షలను ప్రభుత్వం పరిహారంగా చెల్లించిందని అంబటి రాంబాబు తెలిపారు. ఇందులో ఒక్క రూపాయి కూడా అవినీతికి తావు లేదన్నారు. చేతనైతే నిరూపించు అని మరోసారి పవన్ కల్యాణ్ కు సవాల్ విసిరారు.
అసలు విషయంలో సమాధానం చెప్పలేక, సత్తెనపల్లిలో ఒక ప్రైవేటు వ్యక్తికి చెందిన సెప్టిక్ ట్యాంకు క్లీనింగ్ ఘటనలో మరణించిన ముగ్గురు వ్యక్తులకు సంబంధించిన పంచాయితీని తాను చేసిన సవాల్ కు ముడిపెట్టి ఆరోపణలు చేయడం తగదని మంత్రి అంబటి అన్నారు. జనసేన కోసం సత్తెనపల్లి నియోజకవర్గంలో ప్రాణాలు అర్పించిన యువకుడు మట్టం అశోక్ కుటుంబాన్ని ఆదుకుంటామని మాట ఇచ్చి, ఇక్కడకు వచ్చి కూడా కనీసం పలకరించలేదని అంబటి విమర్శించారు. మృతుడు తండ్రి పరిహారం కోసం వస్తే గెంటేసిన పవన్ కల్యాణ్ తనపై ఆరోపణలు చేయడం సిగ్గు చేటని వ్యాఖ్యానించారు.
పవన్ కల్యాణ్ తరహాలో పార్టీ పెట్టి, దానిని చంద్రబాబు పాదాల వద్ద తాకట్టు పెట్టి, అందుకు ప్యాకేజీగా క్యాష్ తీసుకునే సన్నాసి రాజకీయాలు తాను జన్మలో చేయను అంటూ అంబటి విరుచుకుపడ్డారు. శవాల మీద పేలాలు ఏరుకోవాల్సిన ఖర్మగానీ, రైతుల ఆత్మహత్యల పరిహారాన్ని తీసుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితిగానీ తనకు పట్టలేదని అన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల దగ్గర నుంచి నేను రూ. 2 లక్షలు రూపాయలు తీసుకున్నానని నిరూపిస్తే.. నా పదవిని తృణ ప్రాయంగా వదులుకోవడానికి ఇప్పటికీ సిద్ధంగా ఉన్నానని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. మంత్రి సవాల్‌పై జనసేన నేతలు స్పందించాల్సి ఉంది.