Atchennaidu: 'వాలంటీర్లపై బొజ్జల వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం' - టీడీపీ అధికారంలోకి వస్తే అన్ని సదుపాయాలు కల్పిస్తామన్న అచ్చెన్నాయుడు
Ap Politics: గ్రామ వాలంటీర్లపై శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి బొజ్జల చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని.. కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్లకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తామని స్పష్టం చేశారు.
Atchennaidu Key Comments On Volunteers: గ్రామ వాలంటీర్లపై శ్రీకాళహస్తి టీడీపీ ఇంఛార్జీ బొజ్జల సుధీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchennaidu) వివరణ ఇఛ్చారు. మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. బొజ్జల వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్లను కొనసాగించడం సహా.. వారికి మెరుగైన సదుపాయాలు, జీతభత్యాలు కల్పిస్తామని పునరుద్ఘాటించారు. ఈ విషయాన్ని గతంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పినట్లు గుర్తు చేశారు. అయితే, ప్రజా ప్రయోజనాలను గాలికొదిలేసి, ఈసీ నిబంధనలు ఉల్లంఘించి, వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొనే వాలంటీర్లను మాత్రం సమర్థించేది లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే నిబంధనలు ఉల్లంఘించిన 200 మంది వాలంటీర్లు సస్పెండ్ అయ్యారని.. వారి భవిష్యత్తును వారే నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కొందరు వాలంటీర్లు వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డితో కుమ్మక్కై అరాచకాలు చేస్తున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఈసీ నిబంధనలు, ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వాలంటీర్లపైనే బొజ్జల సుధీర్ రెడ్డి అలాంటి వ్యాఖ్యలు చేశారని స్పష్టం చేశారు. సీఎం జగన్.. అవినీతికి వత్తాసు పలికిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులే జైలుకు వెళ్లినా ఆయన పట్టించుకోలేదని అన్నారు. వాలంటీర్లు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించొద్దని విజ్ఞప్తి చేశారు.
వైసీపీ నేతల ఆగ్రహం
కాగా, వాలంటీర్లను బొజ్జల సుధీర్ రెడ్డి ఉగ్రవాదులతో పోల్చడం సరికాదని వైసీపీ అభ్యర్థి మధుసూదన్ రెడ్డి హితవు పలికారు. కరోనా టైంలో వాలంటీర్లు ఎంతో సేవ చేశారని.. ఆ సమయంలో టీడీపీ జన్మభూమి కమిటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. బొజ్జల వ్యాఖ్యలపై వాలంటీర్లు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయాలని సూచించారు. అటు, చంద్రబాబు, పవన్ సహా ఆ పార్టీల నేతలు వాలంటీర్లపై అనవసరంగా మాట్లాడితే సహించేది లేదని మాజీ మంత్రి వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వాలంటీర్లను గోనె సంచులు మోసేవారితో పోల్చిన టీడీపీ నేతలు.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక వారికి మెరుగైన సదుపాయాలు కల్పిస్తామని అంటున్నారని అన్నారు. ఒక్క రూపాయి కూడా అవినీతి చేయకుండా వాలంటీర్ వ్యవస్థ పని చేస్తోందని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ చెప్పారు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే.. వాలంటీర్లపై టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు, బొజ్జల వ్యాఖ్యలపై కొన్ని ప్రాంతాల్లో వాలంటీర్లు ఆందోళనలకు దిగారు. తమకు సుధీర్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read: AP BJP : ఏపీ బీజేపీ కీలక సమావేశానికి ఆ నేతలు డుమ్మా - త్రివేణి సంగమం అంటూ పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు