మీసాలు తిప్పి విజిల్ వేస్తూ ఆందోళన- అసెంబ్లీ సమావేశాల్లో బాలయ్య హంగామా
బాలకృష్ణ సభలో అడుగు పెట్టి 9 ఏళ్లకుపైనే అవుతుంది. సభలో పెద్దగా హైలైట్ అయింది లేదు. చంద్రబాబు అరెస్టు తర్వాత సీన్ మారిపోయింది. ఇప్పుడు ఆయనే టాక్ ఆఫ్‌ది సెషన్ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్ ఆసెంబ్లీ సమావేశాల్లో నందమూరి బాలకృష్ణ హైలైట్‌గా నిలుస్తున్నారు. తనదైన శైలిలో ఆందోళన చేస్తూ అధికార పక్షాం నుంచి విమర్శుల ఎదుర్కొంటున్నారు. చివరకు స్పీకర్ కూడా స్పందించి వార్నింగ్ ఇచ్చారు.
నందమూరి బాలకృష్ణ సభలో అడుగు పెట్టి 9 ఏళ్లకు పైనే అవుతుంది. ఒకట్రెండు సార్లు సభలో మాట్లాడటమే తప్ప పెద్దగా హైలైట్ అయింది లేదు. పార్టీలో కూడా పెద్దగా జోక్యం చేసుకున్న దాఖలాలు లేవు. ముఖ్యమైన సమావేశాల్లో పాల్గొనడం తన అభిప్రాయం చెప్పడం తప్ప వేరే విషయాల్లో జోక్యం చేసుకున్న పరిస్థితి లేదు.
చంద్రబాబు అరెస్టు తర్వాత సీన్ మారిపోయింది. పార్టీలో యాక్టివ్ అయ్యారు. లీడర్లకు తాను ఉన్నాను అనే భరోసా ఇస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో కూడా అదే తీరు కనిపిస్తోంది. తోటి సభ్యులతోపాటు ప్రభుత్వంపై పోరాడుతున్నారు. స్పీకర్ పోడియం చుట్టుముడుతున్నారు.
మొదటి రోజు అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీ సభ్యులు చేసిన కామెంట్స్‌కు అంతే ఘాటుగా రియాక్ట్ అయ్యారు. మీసాలు తిప్పుతూ సవాల్ చేశారు. దీనిపై అంబటి రాంబాబు లాేటి వాళ్లు సీరియస్ అయ్యారు. అలాంటివి సినిమాల్లో పనికి వస్తాయేమో కానీ సభల్లో కాదని వారించారు. మరో వైసీపీ లీడర్ ఆయన ముందుకు వెళ్లి తొడ కొట్టారు. ఆయన కూడా అదే తీరున సమాధానం ఇచ్చారు.
ఈ చర్యలపై స్పీకర్ సీరియస్ అయ్యారు. నందమూరి బాలకృష్ణ చర్యలను ఆక్షేపించారు. సభలో తొడలు కొట్టడం, మీసాలు మెలేయడం సంప్రదాయం కాదని వారించారు. ఆయన చేసినవి మొదటి తప్పుగా భావించి క్షమిస్తున్నట్టు ప్రకటించారు స్పీకర్. ఈ గందరగోళంలోనే టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేసి బయటకు పంపేశారు.
మొదటి రోజు బాలకృష్ణ ప్రవర్తన్నే బూచిగా చూపించిన అధికార పక్షం మాటల దాడి చేసింది. ఆయనపై మంత్రులు అంబటి, రోజా, జోగి రమేష్ లాంటి వాళ్లు తీవ్రమైన పదజాలంతో బాలకృష్ణను విమర్శించారు.
మొదటి రోజు ప్రవర్తనతో విమర్శలు ఎదుర్కొన్న బాలకృష్ణ రెండో రోజు అంతకు మించి అన్నట్టు రెచ్చిపోయారు. ఈసారి ఏకంగా విజిల్ తీసుకొచ్చి ఊదుతూ నినాదాలు చేశారు. దీనిపై అధికార పక్ష సభ్యులు అక్షేపించినా ఆయన పట్టించుకోలేదు. తన పంథాలో నిరసన కొనసాగించారు.
మొదట స్పీకర్ పోడియం వద్ద విజిల్ ఊదుతూ ఆందోళన చేపట్టిన బాలకృష్ణ తర్వాత చంద్రబాబు సీటు వద్దకు వచ్చి నిరసన తెలియజేశారు. ఆయన సీటుపై నిల్చొని విజిల్ ఊదుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
బాలకృష్ణ తీరుపై మంత్రి అంబటి మరోసారి ఫైర్ అయ్యారు. చంద్రబాబు సీటులో కూర్చోవలసిన టైంలో నిల్చొని ఇలా నిరసన తెలియజేయడం ఏంటని ప్రశ్నించారు. తన తండ్రికి వెన్నుపోటు పొడిచి అధికారం చేపట్టిన వ్యక్తి సీటు లాక్కునే టైం వచ్చిందని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అయినా బాలకృష్ణ వెనక్కి తగ్గలేదు. ఇలా రెండు రోజులు కూడా అసెంబ్లీ సమావేశాల్లో హైలైట్ అయ్యారు.