Nara Lokesh: మంత్రికి కోడిగుడ్డు గిఫ్ట్ పంపించిన నారా లోకేశ్ - వైసీపీ హయాంలో అభివృద్ధి నిల్, అవినీతి ఫుల్ అంటూ తీవ్ర విమర్శలు
AP Politics: ఏపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శంఖారావం సభలో తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ కు కోడిగుడ్డును గిఫ్టుగా పంపించారు.
Nara Lokesh Gifted Egg to Minister Amarnath: వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని.. మరో 2 నెలల్లో రాబోయేది టీడీపీ - జనసేన ప్రభుత్వమేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. అనకాపల్లి (Anakapally) జిల్లా మాడుగుల శంఖారావం సభలో ఆయన మాట్లాడారు. ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం సీఎం జగన్ అని.. 3 రాజధానుల పేరిట మనందరి జీవితాలతో మూడు ముక్కలాట ఆడుతున్నారని మండిపడ్డారు. 'ఐదేళ్లుగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లేవు. విశాఖకు పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు తీసుకొస్తామన్నారు. కానీ కొత్తవి కాదు.. ఉన్నవి కూడా పోయే పరిస్థితి వచ్చింది. పాలిచ్చే ఆవును వదులుకుని.. తన్నే దున్నపోతును తెచ్చుకున్నాం. ఐదేళ్లలో ఒక్క చోట రోడ్డైనా వేశారా.?. గ్రామాల్లో రహదారులు గుంతలు పడిపోయాయి. స్థానిక వైసీపీ నేతలు ఒక్క చోట గుంత అయినా పూడ్చారా.?. వైసీపీ హయాంలో అవినీతి ఫుల్, అభివృద్ధి నిల్. ఇష్టం వచ్చినట్లు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు.' అని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రికి కోడిగుడ్డు గిఫ్ట్
గుడ్డు పాలసీతో అంతర్జాతీయంగా ఆంధ్రప్రదేశ్ పరువు తీసిన ఐటీ శాఖ మంత్రి అమర్ నాథ్‌కి ఓ కోడి గుడ్డు గిఫ్టుగా పంపిస్తున్నాను.#BabuSuper6
— Lokesh Nara (@naralokesh) February 19, 2024
#Shankharavam#AndhraPradesh pic.twitter.com/ungijJ4rik
ఈ సందర్భంగా ఐటీ మంత్రి అమర్నాథ్ కు కోడిగుడ్డు గిఫ్ట్ గా ఇస్తున్నట్లు నారా లోకేశ్ ప్రకటించారు. గుడ్డు పాలసీతో అంతర్జాతీయంగా ఏపీ పరువు తీసిన అమర్నాథ్ కు కోడిగుడ్డు అవార్డు పంపుతున్నట్లు చెప్పారు. 'అమర్నాథ్ అన్నకు ఈ అవార్డు పర్ఫెక్ట్ గా సరిపోతుంది. అందుకే జాగ్రత్తగా డెలివరీ చేయమని చెబుతున్నా. పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న అమర్నాథ్ చిన్న వయసులోనే మంత్రి అయ్యారు. నేను ఈ సభ వేదికగా అడుగుతున్నా. మీ నియోజకవర్గంలో కనీసం ఒక్కరికైనా ఉద్యోగం ఇప్పించారా.? ఒక్క పరిశ్రమ అయినా తెచ్చారా.?' అని లోకేశ్ నిలదీశారు.
వారికే పదవులు
వంగుని కొబ్బరికాయ కొట్టలేని ముసలోడు జగన్, నడిచి తిరుమల కొండ ఎక్కే చంద్రబాబు గారిని ముసలోడు అంటున్నాడు.#BabuSuper6
— Lokesh Nara (@naralokesh) February 20, 2024
#Shankharavam#AndhraPradesh pic.twitter.com/xO1zfzo4yI
వచ్చే ఎన్నికల్లో టీడీపీ - జనసేనను గెలిపించాలని.. నారా లోకేశ్ ప్రజలకు పిలుపునిచ్చారు. 'అధికారంలోకి వస్తే అభివృద్ధి అంటే ఇది అనేలా చేసి చూపిస్తాం. సీనియర్లు, జూనియర్లను గౌరవిస్తాను. పనిచేసే వాళ్లను ప్రోత్సహిస్తా. ప్రజల్లో ఉంటూ పని చేసే వారిని వెతుక్కుంటూ వచ్చి నామినేటెడ్ పోస్టులు ఇస్తాం. చంద్రబాబు సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. వైసీపీ ఆపిన సంక్షేమ పథకాలను టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రారంభిస్తాం.' అని పేర్కొన్నారు. సీఎం జగన్ పొద్దున్న లేస్తే బూతులు వింటున్నారని.. పైగా ఆ పార్టీ నేతలను కూడా బూతులు తిట్టమంటున్నారని మండిపడ్డారు. జగన్.. లక్ష కోట్లు ఉన్న పేదవాడు, సొంత కంపెనీలు, ప్యాలెస్ ఉన్న పేదవాడు అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబును ముసలాయన అంటూ హేళన చేస్తున్నారని.. ఆయనతో పోటీ పడి తిరుపతి మెట్లు ఎక్కే దమ్ముందా అంటూ సవాల్ విసిరారు. వైసీపీ ఫ్యాను రెక్కలు విరిగిపోయినట్లేనని.. పీకి చెత్తబుట్టలో వేసుకోవాల్సిందేనని అన్నారు. తన సొంత తల్లి, చెల్లి నమ్మని జగన్ ను రాష్ట్ర ప్రజలెలా విశ్వసిస్తారని ప్రశ్నించారు. టీడీపీ - జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసేలా పక్కా ప్రణాళికలు చేసినట్లు చెప్పారు.
Also Read: AP DSC: రేపటితో ముగియనున్న 'డీఎస్సీ- 2024' ఫీజు చెల్లింపు గడువు, ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తుకు అవకాశం