పార్టీని ఎన్నికలకు సిద్ధం చేస్తున్న చంద్రబాబు, నేడు కాకినాడలో పర్యటన
బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ పేరిట 45 రోజుల పాటు ప్రజల్లోకి వెళ్లేందుకు ఆ పార్టీ రెడీ అవుతోంది. పార్టీ అధినేత చంద్రబాబు సహా నియోజకవర్గ ఇన్ఛార్జ్లు అంతా 3 కోట్ల మందిని కలవనున్నారు.
వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా...చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. వీలైనన్ని ఎక్కువ రోజులు ప్రజల్లో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ పేరిట 45 రోజుల పాటు ప్రజల్లోకి వెళ్లేందుకు ఆ పార్టీ రెడీ అవుతోంది. పార్టీ అధినేత చంద్రబాబు సహా నియోజకవర్గ ఇన్ఛార్జ్లు అంతా 3 కోట్ల మందిని కలవనున్నారు. ప్రజలను నేరుగా కలిసి...చైతన్యం తీసుకొచ్చి ...నమ్మకం కలిగించటమే లక్ష్యంగా బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని రూపొందించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తుందో వివరించేందుకు బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని చేపట్టింది.
సెప్టెంబరు 2న కాకినాడలో పర్యటించనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. మధ్యాహ్నం 12.30 నిమిషాలకు రాజమండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన కాకినాడకు చేరుకుంటారు. 2 గంటల నుంచి సాయంత్రం 6.45 నిమిషాల వరకు పార్టీ జోన్-2 నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని అయిదు లోక్‌సభ స్థానాలకు చెందిన నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, ముఖ్య నాయకులు ఆ సమావేశానికి హాజరవుతారు. అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. రాత్రి ఏడు గంటలకు మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు కుమార్తె వివాహానికి హాజరుకానున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన రాజమండ్రి చేరుకుంటారు.
సెప్టెంబరు 5 నుంచి 9 వరకు ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటిస్తారు. రాయదుర్గం, అనంతపురం, బనగానపల్లె, పాణ్యం నియోజకవర్గాల్లో పర్యటన సాగనుంది. 45 రోజులు పాటు 35 నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటించేలా షెడ్యూల్ రూపొందించుకున్నారు.
చంద్రబాబు సంతకంతో కూడిన ప్రమాణపత్రం
చంద్రబాబు నాయుడు అనే నేను మన రాష్ట్ర ప్రజలు...నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను. 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చాక భవిష్యత్తుకు గ్యారెంటీలోని వాగ్దానాలను ఎలాంటి వివక్ష లేకుండా, నిబంధనలు విధించకుండా అమలు చేస్తాను. మన రాష్ట్ర అభివృద్ధికి, పురోగతికి పునరంకితమవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను అంటూ చంద్రబాబు నాయుడు సంతకంతో కూడిన ప్రమాణపత్రం కూడా ప్రజలకు ఇవ్వనున్నారు. కార్యక్రమంలో భాగంగానే ప్రజావేదిక పేరుతో ప్రతి ఐదు వేల మంది ప్రజలకు ఒకటి చొప్పున... నియోజకవర్గ ఇన్‌ఛార్జులు సమావేశాలు నిర్వహిస్తారు. వివిధ సామాజిక వర్గాల వారీగా సమావేశాలు జరుగుతాయి.
ప్రజలకు లెటర్ రాసిన చంద్రబాబు
45 రోజుల పాటు సాగే కార్యక్రమం గురించి వివరిస్తూ.. చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు, నేతలు.. రాష్ట్ర ప్రజలందరినీ కలిసే ఈ కార్యక్రమానికి ప్రజల సహకారం కావాలని కోరారు. అలాగే 2014 నుంచి 2019 మధ్య రెండంకెల వృద్ధితో దేశంలో అగ్రగామిగా ఉన్న నవ్యాంధ్రను.. వైసీపీ సర్కారు నాశనం చేసిందని ఆరోపించారు. కేవలం నాలుగున్నర సంవత్సరాల్లోనే రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం ప్రజలకు కూడా మనశ్శాంతి లేకుండా పోయిందని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా అన్నదాతలకు గిట్టుబాటు ధరలు లేవని, మహిళలకు సాధికారత కల్పించలేదని వివరించారు. అసలు స్త్రీలకు రాష్ట్రంలో భద్రతే లేదని విమర్శించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని.. ముఖ్యంగా నిరుద్యోగం పెరిగిపోయిందని స్పష్టం చేశారు. బడుగు బలహీన వర్గాలపై ప్రతిరోజూ దాడులు జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సమస్యలకు పరిష్కారం చూపేందుకే ‘భవిష్యత్‌కు గ్యారెంటీ’ పేరుతో పథకాలను ప్రకటించామని చంద్రబాబు నాయుడు వెల్లడించారు.