YS Sharmila: 'కేసీఆర్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది', సోనియాతో భేటీ అనంతరం షర్మిల వ్యాఖ్యలు
YS Sharmila: కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీతో షర్మిల భేటీ ముగిసింది.
YS Sharmila: కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీతో వైఎస్ షర్మిల భేటీ ముగిసింది. వైఎస్ షర్మిల స్థాపించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (YSRTP) త్వరలోనే కాంగ్రెస్ లో విలీనం కాబోతోందన్న ఊహాగానాల మధ్య వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. సోనియా గాంధీతో షర్మిల భేటీ అనంతరం వైఎస్ఆర్‌టీపీ కాంగ్రెస్ లో విలీనం పై ప్రకటన విడుదల చేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే అలాంటి ప్రకటన ఏదీ చేయకుండానే షర్మిల సోనియాను కలిసి వెనుదిరిగారు. సోనియాతో బ్రేక్ ఫాస్ట్ భేటీ అనంతరం వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలకు మేలు చేసే విధంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిరంతరాయంగా పని చేస్తోందని అన్నారు. సీఎం కేసీఆర్ కు కౌంట్‌డౌన్ స్టార్ట్ అయిందని వ్యాఖ్యానించారు. అయితే కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విలీనంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం.
'తెలంగాణ ప్రజలకు మేలు చేసే విధంగా రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిరంతరాయంగా పని చేస్తూనే ఉంటుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది' అని సోనియాతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ షర్మిల వ్యాఖ్యానించారు.
రాజన్న రాజ్యం తెస్తానన్న నినాదంతో వైఎస్ షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (YSRTP)ని స్థాపించారు. ఏపీలో కాకుండా తెలంగాణలో రాజకీయం చేశారు. మొదటి నుంచి సీఎం కేసీఆర్ నే టార్గెట్ చేస్తూ వచ్చారు. కేసీఆర్ ను గద్దె దించుతామని తన ప్రసంగాల్లో చెబుతూ వచ్చే వారు. వైఎస్ జగన్ జైలులో ఉన్నప్పుడు షర్మిల రాష్ట్రమంతటా తిరిగి వైసీపీ బలోపేతం చేశారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలోనూ పాలు పంచుకున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ భారీ మెజారిటీతో గెలిచిన తర్వాత తనకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం, ఆస్తి తగాదాలతో జగన్ కు, షర్మిలకు మధ్య గ్యాప్ వచ్చింది. అలా షర్మిల వైఎస్ఆర్‌టీపీ పార్టీని స్థాపించారు. పార్టీ ఏర్పాటు చేసి రాష్ట్రంలోనే ఉంటూ అన్నపై పోరాటం చేయడానికి బదులు.. తెలంగాణలో రాజకీయం చేశారు. కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో పాదయాత్ర కూడా చేశారు. ఆ తర్వాత విజయలక్ష్మిని వైసీపీ గౌరవ అధ్యక్ష పదవి నుంచి జగన్ తొలగించడంతో.. షర్మిల ఏపీ రాష్ట్రాలపైనా ఫోకస్ పెట్టడం మొదలుపెట్టారు.
ఈ క్రమంలోనే.. వైఎస్ కుటుంబానికి సన్నిహితులైన కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ద్వారా షర్మిలను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు జరిపింది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా వైఎస్ షర్మిల ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలియజేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ లో విలీనం కాబోతుందన్న అనుమానాలను ఆనాడే కొందరు రాజకీయవేత్తలు వ్యక్తం చేశారు. ఇవాళ సోనియాతో షర్మిల, ఆమె భర్త అనిల్ భేటీ తర్వాత విలీనం ప్రక్రియ పూర్తిగా కొలిక్కి వస్తుందని భావించారు.
సోనియాతో భేటీ కోసం బుధవారమే(ఆగస్టు 30) ఆమె ఢిల్లీ చేరుకున్నారు షర్మిల. వైఎస్ఆర్‌టీపీ నేతలకు గానీ, భద్రతా సిబ్బందికి గానీ సమాచారం ఇవ్వకుండానే షర్మిల ఢిల్లీ వచ్చినట్లు తెలుస్తోంది. షర్మిల వెంట వైఎస్ఆర్‌టీపీ నేతలు ఎవరూ లేకపోవడం గమనార్హం. షర్మిల, ఆమె భర్త అనిల్ మాత్రమే ఢిల్లీ వచ్చారు. దీంతో వైఎస్ఆర్‌టీపీ కాంగ్రెస్ లో విలీనం కాబోతుందన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. సోనియాతో భేటీలో అన్ని చర్చిస్తారని అనుకున్నారు. వీరి భేటీ తర్వాత విలీనంపై ప్రకటన ఉంటుందని భావించారు. కానీ సోనియాతో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన షర్మిల.. తెలంగాణ ప్రజలకు మేలు చేస్తానని, కేసీఆర్ కు కౌంట్ డౌన్ మొదలు అయిందని మాత్రమే వ్యాఖ్యానించారు. పార్టీ విలీనంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. దీంతో.. విలీనం ఉంటుందా.. లేదా అనే అనుమానం వ్యక్తం అవుతోంది. తెలంగాణ ప్రజలకు మేలు చేస్తానని వ్యాఖ్యానించడం చూస్తుంటే.. ఆమె తెలంగాణ రాజకీయాల్లోనే కొనసాగుతారని చెప్పకనే చెప్పారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.