YS Sharmila : జగన్‌కు షాకిచ్చిన చెల్లి షర్మిల - "పేరు మార్పు" వివాదంపై తాజాగా చేసిన కామెంట్స్ ఏమిటంటే ?
ఒకరి ఖ్యాతి వైఎస్ఆర్‌కు అవసరం లేదని షర్మిల వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు వివాదంపై ఆమె స్పందించారు.
YS Sharmila : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, సోదరుడు జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన సోదరి షర్మిల గట్టిగా ఖండించారు. అది కూడా తన తండ్రికి సంబంధించినది కావడంతో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అవుతోంది. ఇటీవలే సీఎం జగన్ విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు తీేసి .. వైఎస్ఆర్ హెల్త్ యూనివర్శిటీ అని పేరు పెట్టాలని అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు. ఈ అంశంలో వైఎస్ఆర్‌సీపీ నేతలు సీఎం జగన్ నిర్ణయాన్ని గట్టిగా సమర్థిస్తున్నారు. అయితే తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు .. వైఎస్ కుమార్తె, జగన్ సోదరి మాత్రం ఖండించారు. అ నిర్ణయం కరెక్ట్ కాదని అంటున్నారు.
ఒకరి ఖ్యాతి వైఎస్ఆర్‌కు అవసరం లేదన్న షర్మిల
ఒక ప్రభుత్వం పెట్టిన పేరును..మరో ప్రభుత్వం ఆ పేరును తొలగిస్తే అవమాన పరిచినట్లేనని ఆమె స్పష్టం చేశారు. ఓ కుమార్తెగా తనను నాన్న ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించలేదని.. ఈ ప్రపంచంలో నేను నాన్నను ఆరాదించినట్లుగా ఎవరు ఆరాధించి ఉండరని ఆమె ప్రకటించారు. ఆ పెద్ద మనిషిని అవమానిస్తే కోట్లమంది ప్రజలను అవమాన పరిచినట్లేనన్నారు. ఇప్పుడు వైఎస్సార్ పేరు పెడతారు...రేపు వచ్చే ప్రభుత్వం వైఎస్సార్ పేరు మారిస్తే అప్పుడు వైఎస్సార్ ను సైతం అవమానించి నట్లే కదా అని ప్రశ్నించారు. ఒకరి ఖ్యాతిని తీసుకొని వైఎస్సార్ గారికి ఆ ఖ్యాతి ని ఇవ్వాల్సిన అవసరం లేదని.. YSR కి ఉన్న ఖ్యాతి ఈ ప్రపంచంలోనే ఎవరికి లేదని షర్మిల అభిప్రాయం వ్యక్తం చేశారు. YSR చనిపోతే ఆ భాద తట్టుకోలేక 700 వందల మంది చనిపోయారు.. అలాంటి ఖ్యాతి ఉన్న వైఎస్సార్ కి ఇంకొకరి ఖ్యాతి అవసరం లేదని స్పష్టం చేశారు.
జగన్ నిర్ణయాన్ని షర్మిల వ్యతిరేకించడంపై చర్చ
పేరు మార్పు బిల్లు ఆమోదం పొందిన తర్వాత రోజు ఓ మీడియాతో మాట్లాడుతూ షర్మిల చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత షర్మిల నేరుగా విపులంగా ఈ అంశంపై తన అభిప్రాయాన్ని వివరించారు. ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్ఆరే పేరు పెట్టడం కరెక్ట్ కాదని తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా చెప్పారు. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం అసెంబ్లీలో తాను ఈ అంశంపై తనను తాను ప్రశ్నించుకున్నానని.. అర్హుల పేరే వైద్య విశ్వవిద్యాలయానికి ఉండాలని.. అందుకే పేరు మార్చాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఇప్పుడు షర్మిల జగన్ నిర్ణయానికి భిన్నంగా ప్రకటన చేయడం వైఎస్ఆర్‌సీపీ నేతల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.
షర్మిల వ్యాఖ్యలపై స్పందించని వైఎస్ఆర్‌సీపీ నేతలు
కొంత కాలంగా జగన్‌కు.. ఆయన సోదరి షర్మిల మధ్య సత్సంబంధాలు లేవన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో షర్మిల జగన్ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించడం.. అది కూడా తన తండ్రి విషయంలో కావడంతో మరింతగా వైరల్ అవుతోంది. షర్మిల ప్రకటనపై వైఎస్ఆర్‌సీపీ నేతలు ఎలాంటి ప్రకటనలు చేయలేదు.