Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Goshamahal MLA Raja Singh Future: తనను మళ్లీ బీజేపీలోకి రానివ్వడం లేదని రాజాసింగ్ అసంతృప్తితో ఉన్నారు. తాను ఇక్కడ రాజకీయం చేయనని..చేయాలనుకుంటే ఇతర రాష్ట్రాల్లో చేస్తానంటున్నారు.

Raja Singh Maharashtra Hindutva Rallies: తెలంగాణ రాజకీయాల్లో కరడుగట్టిన హిందూత్వ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన గోషామహల్ ఎమ్మెల్యే టి. రాజాసింగ్ భవిష్యత్తు ఇప్పుడు సస్పెన్స్‌లో ఉంది. గతంలో రాష్ట్ర నాయకత్వ ఎంపికతో పాటు పలు అంశాలపై తీవ్ర అసంతృప్తి చెంది ఆవేశంతో బీజేపీకి రాజీనామా చేసిన రాజాసింగ్‌కు, క్రమశిక్షణే ప్రాతిపదికగా పనిచేసే కమలం పార్టీ అధిష్ఠానం షాక్ ఇచ్చింది. ఆయన రాజీనామాను ఆమోదిస్తూ కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకోవడం, ఆయన లేవనెత్తిన అంశాలు అసంబద్ధమైనవి అని తేల్చిచెప్పడం తెలంగాణ బీజేపీలో ఆయన శకం ముగిసిందనే సంకేతాలను స్పష్టంగా పంపింది.
మళ్లీ బీజేపీలోకి వెళ్లేందుకు రాజాసింగ్ ప్రయత్నాలు
రాజీనామా చేసిన తొలినాళ్లలో దూకుడు ప్రదర్శించిన రాజాసింగ్‌కు, ఆ తర్వాతి పరిణామాలతో బీజేపీని వీడడం ఎంతటి ప్రతికూల నిర్ణయమో బోధపడింది. తనకున్న హిందూత్వ రాజకీయ ఐడెంటిటీ బీజేపీతోనే ముడిపడి ఉందనే సత్యాన్ని గ్రహించిన ఆయన, మళ్లీ పార్టీలోకి చేరేందుకు రకరకాల మార్గాల్లో తీవ్రమైన లాబీయింగ్ ప్రారంభించారు. కేంద్ర పెద్దలకు విజ్ఞప్తులు పంపడం, అధిష్ఠానం దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించడం వంటివి చేశారు. అయితే, ఎప్పటికప్పుడు అధిష్ఠానానికి, రాష్ట్ర నాయకత్వానికి ఎదురు తిరిగి శ్రుతిమించిన వ్యాఖ్యలు చేసే రాజాసింగ్‌ను మళ్లీ వెనక్కి తీసుకునేందుకు బీజేపీ జాతీయ నాయకత్వం ఏమాత్రం సుముఖంగా లేదని స్పష్టమవుతోంది.
అడ్డుకుంటున్నారని బీజేపీ నేతలపై విమర్శలు
ఇదే సమయంలో, బీజేపీ తనను పట్టించుకోకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన రాజాసింగ్.. తన అసహనాన్ని శాపనార్థాల రూపంలో వెళ్లగక్కుతున్నారు. రాష్ట్రంలో బీజేపీ బాగుపడదని, పార్టీని నాశనం చేస్తున్నారని విమర్శిస్తూనే మరోవైపు లోపాయికారీగా మళ్లీ ప్రవేశం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. తెలంగాణలో గోషామహల్ నియోజకవర్గం మినహా రాష్ట్రవ్యాప్తంగా సొంత బలం మీద ఓట్లను ప్రభావితం చేసే స్థాయిలో రాజాసింగ్‌కు వ్యక్తిగత ఓటు బ్యాంక్, పార్టీ కేడర్ మద్దతు లేకపోవడం ఆయనకున్న అతిపెద్ద బలహీనత. ఇక్కడ ఆయనకు మరో ప్రాంతీయ పార్టీలో చేరే అవకాశం కూడా లేదు.
వేరే రాష్ట్రాల్లో రాజకీయం చేస్తానంటున్న రాజాసింగ్
ఈ క్రమంలోనే రాజాసింగ్ తన రాజకీయ దృష్టిని తెలంగాణ దాటి ఇతర రాష్ట్రాల వైపు మళ్లిస్తున్నట్లు రాజకీయ భావిస్తున్నారు. నేను తెలంగాణలో రాజకీయాలు చేయకపోయినా.. దేశంలో హిందూత్వ కోసం పనిచేస్తాను అని చెబుతున్నారు. తెలంగాణలో కంటే రాజాసింగ్‌కు పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఉత్తరప్రదే వంటి ఉత్తరాది రాష్ట్రాల్లోని హిందూత్వ వర్గాల్లో విస్తృతమైన పాపులారిటీ, క్రియాశీల ఫాలోయింగ్ ఉంది. సకల్ హిందూ సమాజ్ నిర్వహించే పలు సభల్లో ఆయన ప్రసంగాలకు అక్కడి తీవ్ర హిందూత్వ వర్గాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో రాజాసింగ్‌కు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పలు వేదికలపై యోగి సిద్ధాంతాలను, బుల్డోజర్ మార్క్ పాలనను రాజాసింగ్ బహిరంగంగానే కొనియాడారు. యోగి అండదండలతో ఉత్తరప్రదేశ్‌లో గానీ, లేదా తన భావజాలానికి అనుకూలంగా ఉండే మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో గానీ బీజేపీ తరఫున ఒకవేళ అధిష్ఠానం కరుణిస్తే లేదా హిందూత్వ సంస్థల మద్దతుతో కొత్త రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించినా ఆశ్చర్యపోనవసరం లేదు.
ఆవేశంలో తీసుకున్న నిర్ణయం వల్ల సొంత నియోజకవర్గమైన గోషామహల్‌కే పరిమితమైన రాజాసింగ్ పరిస్థితి ప్రస్తుతం త్రిశంకు స్వర్గాన్ని తలపిస్తోంది. తెలంగాణలో తలుపులు మూసుకుపోవడంతో, తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి యూపీ, మహారాష్ట్రల రూపంలో ఆయనకు లభించే జాతీయ హిందూత్వ ఇమేజే ఏకైక శరణ్యంగా కనిపిస్తోంది. మరి యోగి ఆదిత్యనాథ్ మద్దతుతో రాజాసింగ్ జాతీయ రాజకీయ వేదికపై రీ-ఎంట్రీ ఇస్తారో లేక తెలంగాణ రాజకీయాల్లోనే మరో కొత్త వ్యూహంతో ముందుకు వస్తారో వేచి చూడాలి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















