By: ABP Desam | Updated at : 06 Apr 2022 07:04 PM (IST)
ఇక తెలంగాణలోనూ రాజ్ భవన్ వర్సెస్ ప్రభుత్వం ! బెంగాల్ రాజకీయమే రిపీటవబోతోందా ?
తెలంగాణ రాజకీయాలు బెంగాల్ తరహాలో మారుతున్నాయి. బెంగాల్‌లో గవర్నర్ వర్సెస్ సీఎం మమతా బెనర్జీ అనే పోరాటం ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రతీ రోజూ వెల్లడవుతూనే ఉంది. తాజాగా తెలంగాణలోనూ అదే పరిస్థితి కనిపించేలా ఉంది. ఢిల్లీలో గవర్నర్ తమిళిశై సౌందరరాజన్ ... తెలంగాణ ప్రభుత్వం తనను ఎలా అవమానిస్తుందో బహిరంగంగా చెప్పారు. తనను వ్యక్తిగతంగా కాదని రాజ్యాంగాధినేతను అవమానిస్తున్నారని ఆరోపించారు. తాను ఎక్కడ రాజకీయం చేశానో చెప్పాలని సవాల్ చేశారు. చర్చకు సిద్ధమన్నారు. ఇది ఆరంభం మాత్రమేననే దానికి సంకేతాలని రాజకీయవర్గాలు ఓ గట్టి నిర్ణయానికి వచ్చాయి.
గవర్నర్ అంటే రాజ్యాంగాధినేత. అయితే ఇప్పుడు గవర్నర్‌ను గుర్తించడానికి తెలంగాణ ప్రభుత్వం నిరాకరిస్తోంది. గవర్నర్‌ను ప్రభుత్వ పరంగా.. పార్టీ పరంగా గుర్తించడానికి కేసీఆర్, టీఆర్ఎస్ నిరాకరిస్తున్నారు. ఇటీవల రాజ్‌భవన్ ఉగాది వేడుకలకు కేసీఆర్ దూరంగా ఉన్న సమయంలో గవర్నర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వాటి సారాంశం ఏమిటంటే తాను తలొంచనని.. ఇంక దూకుడుగా ముందుకెళ్తానని. అదే సమయంలో తాను స్నేహపూర్వకంగానే ఉన్నానని ఉంటానని కూడా చెప్పారు. ఇప్పటి వరకూ జరిగిన పరిణామాలను చూస్తే గవర్నర్ అంత దూకుడుగా లేరు. కానీ కేసీఆర్ మాత్రం అసలు గవర్నర్‌ను గుర్తించడానికి సిద్ధపడటం లేదు. ఈ వ్యవహారాలను ఆమె ప్రదాని, హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. వారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే ఢిల్లీలోనే ఘాటు వ్యాఖ్యలు ప్రారంభించారని భావిస్తున్ారు.
గవర్నర్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇటీవల ప్రభుత్వం పలు అభియోగాలతో ఓ నోట్ విడుదల చేసింది. అందులో ఎమ్మెల్సీగా పాడి కౌశిక్ రెడ్డిని సిఫార్సు చేసినా అంగీకరించకపోవడంతో ప్రజాదర్బార్‌లాంటివి నిర్వహించడం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడమేనని పేర్కొన్నారు. నిజానికి ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డి సిఫార్సును అంగీకరించకపోతే.. కేసీఆర్ ఓ సారి కలిసి ఉంటే సమస్య పరిష్కారమయ్యేది. ఏపీలోనూ గవర్నర్ అలాగే ఎమ్మెల్సీలను ఖరారు చేయకపోతే జగన్ వెళ్లి సమావేశమై.. అభ్యంతరాలను పరిష్కరించారు. దాంతో వెంటనే ఆమోదం లభించింది. నిజానికి ఈ విషయంలో గవర్నర్ అధికారాలు పరిమితం. ప్రభుత్వం పట్టుబడితే తమిళిశై ఆమోదించి ఉండేవారు. కానీ రెండో సారి మాట్లాడటానికి కేసీఆర్ సిద్ధపడలేదు. ఇక ప్రజాదర్బార్ లాంటివి నరసింహన్ టైమ్‌లోనూ జరిగాయి. కానీ కేసీఆర్ ఇప్పుడు మాత్రమే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకిలా ఒక్క సారిగా వ్యతిరేకత పెంచుకున్నారో టీఆర్ఎస్ నేతలకూ అర్థం కాని పరిస్థితి.
బీజేపీయేతర రాష్ట్రాల ప్రభుత్వాలు ఉన్న చోట్ల గవర్నర్లు ఎలా వ్యవహరిస్తారో ప్రత్యేకంగా ఉదాహరణలు చెప్పాల్సిన పని లేదు. కాంగ్రెస్ ఉన్నప్పుడు కర్ణాటకలో గవర్నర్ వ్యవహరించిన తీరు ఇంకా కళ్ల ముందు ఉంది. అదే సమయంలో ప్రస్తుతం బెంగాల్ గవర్నర్ వ్యవహరిస్తున్న తీరు.. తమిళనాడు గవర్నర్.. స్టాలిన్ ప్రభుత్వంతో తలపడేందుకు చేస్తున్న ప్రయత్నాలు చూసిన తర్వాత.. తెలంగాణ గవర్నర్ అసలు ఏమీ వివాదాస్పదం చేయడం లేదని అనుకోవచ్చు. ఎందుకంటే బెంగాల్‌లో తానే ప్రభుత్వం అన్నట్లుగా అక్కడి గవర్నర్ మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రితో మాటల యుద్ధానికి దిగుతున్నారు. తెలంగాణలో అలాంటి పరిస్థితులు లేవు. చాలా రకాలుగా తమిళిశై ప్రజాస్వామ్య బద్దంగా వ్యవహరిస్తున్నారని అనుకోక తప్పదు. కానీ ఇక ముందు ఆ పరిస్థితి ఉంటుందా అనేది చెప్పడం కష్టమే.
గవర్నర్ తమిళిశై దూకుడుగా ఉండకపోయినా ఆమెపై కేసీఆర్ అనుమానాలు పెంచుకున్నారు. బీజేపీ ఎజెండాకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారని అనుమానిస్తున్నారు. అయితే బహిరంగంగా ఆమె ప్రభుత్వాన్ని పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. కానీ అంతర్గతంగా కేంద్రానికి ఏమైనా రహస్య నివేదికలు పంపుతున్నారన్న సమాచారం కేసీఆర్‌కు చేరిందేమోనన్న అభిప్రాయం వినిపిస్తోది. ఏమీ తెలియకుండా ఆయన ఉద్దేశపూర్వంగా గవర్నర్‌తో వైరం పెంచుకోరని కొంత మంది అంచనా వేస్తున్నారు. గవర్నర్ ప్రాధాన్యం తెలుసుకాబట్టే గతంలో నరసింహన్‌తో కేసీఆర్ అంత చనువుగా వ్యవహరించారని అంటున్నారు.
ప్రధాని మోదీని కలిసిన తర్వాత ఇక తాను చేయాలనుకున్నది చేస్తానన్నట్లుగా గవర్నర్ ప్రకటించారు. మే నుంచి ప్రజాదర్భార్‌లు నిర్వహిస్తానని ప్రకటించారు. ఇప్పుడు ఆమెలోనూ పట్టుదల పెరిగే అవకాశం ఉంది. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇబ్బందిపెడితే ఆమెకు కేంద్రం నుంచి సపోర్ట్ వస్తుంది కానీ నిరుత్సాహం రాదు. అందుకే ఇప్పుడు ఆమె తానేంటో చూపించాలనుకుంటున్నట్లుగా మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. అంటే బెంగాల్ తరహాలో రాజ్ భవన్ వర్సెస్ సీఎం ఎపిసోడ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Chandrababu New Style : 40 శాతం సీనియర్ల సీట్లకు గండి - చంద్రబాబు కొత్త ఫార్ములా !
MLC Kavitha Comments : జైశ్రీరాం నినాదాలకు కౌంటర్ గా జైహనుమాన్ - టీఆర్ఎస్ కార్యకర్తలకు ఎమ్మెల్సీ కవిత పిలుపు !
Revant Reddy : కేసిఆర్‌ను చెప్పులతో కొట్టుడే గద్దె దింపుడే - జయశంకర్ స్వగ్రామంలో రేవంత్ చాలెంజ్ !
Hindupur YSRCP : హిందూపురం వైఎస్ఆర్సీపీ నేతల తిరుగుబాటు - ఆయనొస్తే ఎవరూ వెళ్లరట !
Complaint On Avanti Srinivas : "ఒరేయ్ పంతులూ .." అన్నారు - మాజీ మంత్రిపై పోలీసులకు ఫిర్యాదు !
Petrol-Diesel Price, 22 May: బిగ్ గుడ్ న్యూస్! నేడు భారీగా తగ్గిన ఇంధన ధరలు, లీటరుకు ఏకంగా రూ.9కి పైగా తగ్గుదల
Gold-Silver Price: పసిడి ప్రియులకు కాస్త షాక్! నేడు పెరిగిన బంగారం ధర, వెండి మాత్రం నిలకడే - మీ నగరంలో రేట్లు ఇవీ
MI Vs DC Highlights: ముంబై గెలిచింది - బెంగళూరు నవ్వింది - ఐదు వికెట్లతో ఓడిన ఢిల్లీ!
Bindu Madhavi: ‘బిగ్ బాస్ తెలుగు’ హిస్టరీలో తొలిసారి - విజేతగా లేడీ కంటెస్టెంట్, బిందు సరికొత్త రికార్డ్