TSPSC Leaks What Next : ఓ వైపు లిక్కర్ కేసు - మరో వైపు పేపర్ లీకేజీ దుామరం ! కేసీఆర్ పరిస్థితుల్ని ఎలా చక్కదిద్దబోతున్నారు ?
తెలంగాణ సర్కార్ ను చుట్టుముట్టిన సమస్యలు ఓ వైపు లిక్కర్ కేసులో కవిత విచారణమరో వైపు పేపర్ లీకేజీ గందరగోళంయువతలో నమ్మకం ఎలా పెంచుకుంటారు ?కేసీఆర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు ?
TSPSC Leaks What Next : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగ పరీక్షల లీకేజీల వ్యవహారం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారింది. ఎన్నో ఏళ్ల తర్వాత ప్రభుత్వం ప్రకటించిన నోటిఫికేషన్లన్నింటిపై అనుమానాలు వచ్చేలా ఈ వ్యవహారం చేసింది. దీంతో అసలు ఆగ్రహంతో ఉన్న నిరుద్యోగులు మరింతగా ప్రభుత్వంపై మరింత ఫైర్ అయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు వారిలో విశ్వాసం నెలకొల్పాల్సిన పరిస్థితి ప్రభుత్వంలో ఏర్పడింది. ఇందు కోసం కఠిన చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఉద్యోగ నియామకాల అంశంపై సీరియస్‌గా నిపుణులతో చర్చిస్తున్న కేసీఆర్
తెలంగాణ నిరుద్యోగులకు నమ్మకం కలిగిస్తూ పరీక్షలు ఎలా నిర్వ హంచాలన్న అంశంపై కేసీఆర్ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సోమవారం ఈ అంశంపై పలువురు నిపుణులతో మాట్లాడినట్లు తెలిసింది. ఇప్పటికే ఈ అంశంపై సిట్ వేసిన నేపథ్యంలో ఈ నివేదిక వచ్చాక తదుపరి చర్యలు తీసుకునే అవకాశాలు కనబడుతు న్నాయి. రద్దు చేసిన పరీక్షలను ఇప్పటికిపుడు మళ్లి పెట్టినా అనుమానాలు చెలరేగే ప్రమాదం ఉందనే అభిప్రాయం ఎక్కువగా వ్యక్తమవుతున్నాయి. అన్ని పరీక్షలు రద్దుచేసి అత్యంత పారదర్శక విధానం తీసుకురావాలని, 90 రోజుల్లో పరీక్షలు పూర్తిచేయాలనే ఆలోచనతో సీఎం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీనికోసం ఆర్డినెన్స్ ద్వారా కొత్త చట్టం తెచ్చే ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు. ఈ అంశం సున్నితమైనది కావడంతో.. విభిన్న వర్గాల స్పందనలను అంచనా వేసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
విపక్షాల ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి !
పేపర్ల లీకేజీ వ్యవహారంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, విమర్శలు బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. ఓ వైపు లిక్కర్ కేసులో కవిత విచారణ ఎదుర్కొంటున్నారు. కవిత ఈడీ ఆఫీసుకు విచారణకువెళ్తే సీనియర్ మంత్రులు ఢిల్లీలోనే ఉంటున్నారు. దీంతో విపక్షాల విమర్శలకు ఎదురుదాడి చేయడం తగ్గిపోయింది. అందుకే అటు విపక్షాల విమర్శలకు చెక్ పెట్టడం.. ఇటు నిరుద్యోగులు, యువతలో నమ్మకాన్ని పెంచడానికి కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలనే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎన్నికల్లోపు నిరుద్యోగ యువతలో నమ్మకం కలిగించి నోటిఫికేషన్లు పూర్తి చేయకపోతే సమస్యలు వస్తాయని భావిస్తున్నారు.
బహిరంగలేఖ యువతలో ఆగ్రహాన్ని తగ్గించడానికేనా ?
తెలంగాణలోని ప్రతీ అంశంపై తనకంటే ఎక్కువ బాధ్యత ఎవరికీ లేదని, ఉద్యమనేతగా తనకే ఇక్కడి యువతపై బాధ్యత ఉందని.. నమ్మకం కలి గించేందుకు కేసీఆర్ సందర్భం లేకపోయినా సోమవారం బహిరంగ లేఖ రాశారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అసలు తెలంగాణతో కేసీఆర్‌కు, గులాబీ పార్టీకి ఉన్న పేగుబంధం గుర్తు చేస్తూ బహరంగ లేఖను కేసీఆర్ రాశారు. మీరే నా బలం.. బలగం అంటూ సాహసమే ఊపిరిగా చేసిన ప్రయాణాన్ని గుర్తుచేశారు. వ్యూహాత్మకంగా లేఖను విడుదల చేసిన కేసీఆర్ క్రమంగా యువతలో నమ్మకం పాదుకొల్పే చర్యలు చేపట్టారని అంచనా వేస్తున్నరు. ఓ వైపు కవితపై లిక్కర్ కేసులో విచారణ.. మరో వైపు ప్రభుత్వానికి అప్రతిష్ట వచ్చే ప్రమాదం ఉండడంతో దీని తీవ్రతను తగ్గించేందుకు సీఎం కేసీఆర్ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు.
ఏ నిర్ణయం తీసుకున్నా కత్తి మీద సామే !
టీఎస్పీఎస్సీ వ్యవస్థలో దొర్లిన తప్పులను సరిదిద్దేందుకు సరైన ప్రణాళిక రూపొందించమని ఇప్పటికే నిపుణులను ఆదేశించినట్లుగా చెబుతున్నారు. ఏకకాలంలో ఉద్యోగాల ప్రక్రియ ఎలా పూర్తిచేయాలి.. ఇందుకు ఉన్న ఆటంకాలు, అవరోధాలపై నిపుణులు ఇప్పటికే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కసరత్తు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలలో, దేశాలలో ఉత్తమ పద్దతులను అధ్య యనం చేస్తున్నారు. సిట్ నివేదిక వచ్చాక.. ఈ అంశంపై సీఎం కేసీఆర్ స్పందించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఏ నిర్ణయం తీసుకున్నా విమర్శలు తప్పవు. కానీ యువతలో నమ్మకం కలిగేలా చేయగలిగితే ప్రభుత్వానికి రిలీఫ్ . లేకపోతే నిరుద్యోగుల ఆగ్రహాన్ని చూడాల్సి ఉంటుంది.