SC Classification Poltics : ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుతో అసలు సవాల్ - సమర్థించిన పార్టీలకు చిక్కులు - ఎందుకంటే ?
Politics : ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో రాజకీయ పార్టీలకు ఊహించని సవాళ్లు ఎదురు కానున్నాయి. మద్దతిచ్చిన పార్టీలకే ఎక్కువ సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.
Political Heat On SC classification : షెడ్యూల్డ్, తెగల వర్గాల వర్గీకరణ వివాదం దశాబ్దాలుగా ఉంది. ఎస్సీలుగా గుర్తింపు పొందిన వారిలో కొన్ని ఆధిపత్య కులాలకే అవకాశాలు దక్కుతున్నాయని ఇతరులకు దక్కడం లేదన్న అభిప్రాయం ఎస్సీల్లోనే ఉంది. మన రాష్ట్రానికి సంబంధించినంత వరకూ మాలలు, మాదిగల్ని ఎస్సీ జాబితాలో చేర్చారు. మరికొన్ని కులాలు, ఉపకులాలు ఉన్నాయి. కానీ ప్రధానంగా మాలలు ఎక్కువ అవకాశాలు పొందుతున్నారని మాదిగ సామాజికవర్గం వారు వర్గీకరణ కోసం పోరాడారు. జనాభాలో మాదిగలు ఎక్కువగా ఉన్నా మాలలకే ఎక్కువ అవకాశాలు వస్తున్నాయన్న భావనతో మంద కృష్ణ మాదిగ ఉద్యమం ప్రారంభించారు. అది దశాబ్దాలుగా కొనసాగుతోంది. రాజకీయ పార్టీలు ఎక్కువగా వర్గీకరణకు కట్టుబడి ఉన్నాయని చెబుతూ డబుల్ గేమ్ ఆడుతూ రావడంతో అది వివాదాస్పదమయింది. గతంలో సుప్రీంకోర్టు కూడా వర్గీకరణ కుదరదని స్పష్టం చేసింది. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు రాష్ట్రాలకు అధికారం ఇస్తూ తీర్పు చెప్పింది.
సుప్రీంకోర్టు తీర్పుతో అసలు రాజకీయం ప్రారంభం!
ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పుతో.. అన్ని రాష్ట్రాలకు అధికారాలు దఖలు పడినట్లే. ఇప్పుడు రాష్ట్రాలు వర్గీకరణ చేయాల్సి ఉంటుంది. అయితే ఇది అంత తేలిక కాదు. ఎందుకంటే వర్గీకరణకు వ్యతిరేకంగా కొన్ని కులాలు, అలాగే.. ఏబీసీడీలుగా వర్గీకరించే విషయంలో మరికొన్ని కులాలు తమ వాదన గట్టిగా వినిపించే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ పార్టీలు ఇలాంటి వాతావరణాన్ని తమకు అనుకూలంగా మల్చుకునే ప్రయత్నం చేస్తాయనడంలో సందేహం లేదు. మాజీ ఎంపీ హర్షకుమార్ అసలు సుప్రీంకోర్టుకు ఎస్సీ వర్గీకరణ గురించి తీర్పు చెప్పే అధికారం లేదని తేల్చి చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పును అంగీకరించే ప్రశ్నే లేదని మాలలతో కలిసి ఉద్యమం చేస్తామని చెప్పారు. ఒక వేళ ఇతర వర్గాలు కలసి వచ్చి వర్గీకరణ కసరత్తు ప్రారంభించినా.. తాము అత్యంత వెనుబడిన వర్గమని ప్రతి ఎస్సీ కులం వాదిస్తుంది. అందరూ ఏ కేటగిరీలోనే ఉండాలనుకుంటారు. వీరందర్నీ సముదాయించి.. వర్గీకరణ చేయడం కత్తి మీద సామె.
ఎస్సీల్లో మొత్తం 59 కులాలు !
ఎస్సీ కేటగిరి కింద మొత్తం 59 వరకూ కులాలను గుర్తించారు. అయితే మాల, మాదిగ వర్గాలకు చెందిన వారే ఇందులో 70 శాతం వరకూ ఉంటారు. ఇతర కులాలకు చెందిన వారి సంఖ్య ముఫ్పై శాతం వరకూ ఉండొచ్చు. అయితే అవకాశాలు మాత్రం ఎక్కువగా మాల వర్గానికే వెళ్తున్నాయని మాదిగలతో పాటు ఇతర కులాల భావనం. మాలలు ఆర్థికంగా, విద్యాపరంగా కొంత అభివృద్ది చెందారని కానీ ఇతర కులాలు అవకాశాలు అంది పుచ్చుకోవడంలో విఫలమయ్యారన్న కారణంతో మందకృష్ణ మాదిగ వర్గీకరణ పోరాటాన్ని ప్రారంభించారు. రాజకీయంగా ప్రభావితం చేసే స్థాయికి ఉద్యమం చేరడంతో రెండో సారి సీఎం అయిన తర్వాత చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ అమలు చేశారు. 2000-2004 వరకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ ను అమలు చేసింది. వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు ఆవిర్భవించింది. అప్పట్లో కాంగ్రెస్ నేతలు ఈ మాలమహానాడును ప్రోత్సహించడంలో ఎస్సీల్లో స్పష్టమైన చీలిక వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయపరమైన చిక్కుల్లో పడి ఆచరణ ఆగిపోయింది. మళ్లీ ఇప్పటికి అమల్లోకి తెచ్చే అవకాశాన్ని సుప్రీంకోర్టు కల్పించింది.
అడ్వాంటేజ్ కోసం ప్రయత్నిస్తే రాజకీయ పార్టీలకే కష్టం !
ఎస్సీ వర్గీకరణను రాజకీయంగా వాడుకునేందుకు పార్టీలు తొందరపడితే రాజకీయంగా నష్టం సంభవించే అవకాశాలు ఉన్నారు. సుప్రీంకోర్టులో తీర్పు రాగానే.. ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా మార్పులు చేస్తామని వెంటనే వర్గీకరణ చేస్తామన తెలంగాణ సీఎం రేవంత్ ప్రకటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు జనాభా దామాషా ప్రకారం అందరికీ అవకాశాలు కల్పించాల్సి ఉందన్నారు. చంద్రబాబునాయుుడు సీఎంగా ఉన్నప్పుడు చేసిన వర్గీకరణను ఇప్పుడు అమలు చేయలేరు. మారిన సామాజిక పరిస్థితులతో మరోసారి ఎస్సీ కులాలను నాలుగు విభాగాల కింద వర్గీకరించాల్సి ఉంటుంది. ఇందులో ఇతర పార్టీలు ఖచ్చితంగా రాజకీయం చేస్తాయి. అందులో సందేహం ఉండదు. మెజార్టీని ఆకట్టుకునే క్రమంలో .. ఇతర వర్గాలను నిర్లక్ష్యం చేస్తే.. మొదటికే మోసం వస్తుంది. రిజర్వేషన్లు, వర్గీకరణలతో రాజకీయం రెండు వైపులా పదునున్న కత్తిలాంటిదే. ఇప్పుడు ఇలాంటి అంశంతో .. అధికార పార్టీలు రాజకీయం చేయాలనుకుంటున్నాయి.
ఇప్పుడే అసలు రాజకీయం ప్రారంభం !
ప్రస్తుత పరిణామాలు చూస్తూంటే.. ఎస్సీ వర్గీకరణ అనే అంశానికి సుప్రీంకోర్టు తీర్పుతో ముగింపు పడలేదు. అసలు ప్రారంభం అయిందని అనుకోవచ్చు. ఇక నుంచి అసలు వర్గీకరణ రాజకీయం ప్రారంభమవుతుంది.