PM Modi Speech: వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది: ప్రధాని మోదీ
Andhra Pradesh Politics: టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని బొప్పూడిలో నిర్వహిస్తున్న బహిరంగసభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు.
Prajagalam Public Meeting at Chilakaluripet: చిలకలూరిపేట: ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ సీపీ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, ఇది గమనించి ప్రజలు తమకు ఓటు వేయాలని ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించి ముచ్చటగా మూడోసారి కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో 400 దాటాలి, ఎన్డీఏకు ఓటు వేయాలి అని ప్రధాని మోదీ తెలుగులో ప్రసంగించారు. మనం నెగ్గితేనే వికసిత భారత్‌తో పాటు, వికసిత ఆంధ్రప్రదేశ్ సాధ్యమవుతుందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. జూన్ 4న ఫలితాలు రాబోయే ఫలితాలలో ఎన్డీఏ కూటమి 400కు పైగా సీట్లు సాధించాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.
టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని బొప్పూడిలో నిర్వహిస్తున్న బహిరంగసభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. ఎన్డీయే కూటమి ప్రాంతీయ పార్టీలను కలుపుకుని వెళ్తూ వారి అభివృద్ధిని కోరుకుంటుందన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల కోసం రాత్రింబవళ్లు కృషి చేస్తున్నారని ప్రధాని మోదీ కితాబిచ్చారు. రాష్ట్రంలో మనం గెలిస్తే డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడి, అప్పుడే వికసిత ఆంధ్రప్రదేశ్ సాధ్యం అన్నారు.
ఎన్డీఏ ప్రభుత్వం పేదల కోసం పని చేస్తుంది
‘బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుంది. ఏపీలో అభివృద్ధి జరగాలంటే రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి. పీఎం ఆవాస్ యోజన కింద ఏపీలో 10 లక్షల ఇళ్లు నిర్మించి ఇచ్చాం. ఈ పల్నాడు జిల్లాలో దాదాపు 5 వేల ఇళ్లు ఇచ్చాం. ఆయుష్మాన్ భారత్ తో ఏపీలో కోటీ 25 లక్షల మందికి లబ్ధి చేకూరింది. జలజీవన్ మిషన్ కింద కోటి ఇళ్లకు నల్లా కనెక్షన్లతో నీరు ఇచ్చాం. రైతుల కోసం ఎన్డీఏ ఎంతగానో కృషిచేస్తోంది. కిసాన్ సమ్మాన్ నిధితో పల్నాడు జిల్లా వారికి రూ. 700 కోట్లు ఇచ్చాం. ఆంధ్రప్రదేశ్‌ను ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చాం. విశాఖలో ఐఐఎం, ఐఐపీఈ ఏర్పాటు చేశాం. తిరుపతిలో ఐఐటీ, ఐసర్ నిర్మించాం. మంగళగిరిలో ఎయిమ్స్, విజయనగరంలో ట్రైబల్ యూనివర్సిటీ లాంటి ఎన్నో ఏర్పాటు చేశాం. ఎన్డీఏలోని ప్రతి ఒక్కరూ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుంటారు.’ - ప్రధాని నరేంద్ర మోదీ
తెలుగు వారిని గౌరవించుకున్న ఎన్డీఏ ప్రభుత్వం
ఏపీలో నీలి విప్లవానికి ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉంటుందని.. యువతకు, మహిళలకు ఉద్యోగాలతో పాటు కొత్త అవకాశాల కల్పనకు ప్లాన్ చేస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు. I.N.D.I.A (కాంగ్రెస్) కూటమిలోని పార్టీలు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తాయని, వారికి ఏకాభిప్రాయం ఉండదని మోదీ సెటైర్లు వేశారు. ఓ రాష్ట్రంలో కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలు పోటీ పడతాయి. కేంద్రంలో వాళ్లు కలిసిపోయామని చెప్పడం ప్రజలు గుర్తించాలని మోదీ కోరారు.
దివంగత నేత, మహానటుడు నందమూరి తారక రామారావు (NTR) శత జయంతి సందర్భంగా రూ.100 వెండి నాణెం విడుదల చేశామన్నారు. వెండితెరపై రాముడు, కృష్ణుడిగా ఎన్టీలు పోసించిన పాత్రలు అజరామరం అన్నారు. మరో తెలుగు బిడ్డ, మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ‘భారత రత్న’ తమ ప్రభుత్వం గౌరవించుకుందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ గుర్తుచేశారు.