YSRCP Perminent President Jagan : వైఎస్ఆర్‌సీపీ జీవితకాల అధ్యక్షుడు జగన్ - ప్లీనరీలో తీర్మానం ! రాజ్యాంగపరంగా సాధ్యమేనా ?
వైఎస్ఆర్‌సీపీ జీవిత కాల అధ్యక్షుడిగా జగన్‌ను ప్లీనరీ ఎన్నుకుంది. అయితే ఇది నిబంధనల ప్రకారం చెల్లుతుందా అనే సందేహం ఎక్కువ మందిలో ఉంది.
YSRCP Perminent President Jagan : వైఎస్ఆర్‌సీపీ రాజ్యాంగాన్ని ఆ పార్టీ ప్లీనరీలో సవరించారు. సీఎం జగన్ ను జీవిత కాల అధ్యక్షుడిగా నియమించారు. అంటే ఇక ముందు అధ్యక్ష పదవికి ఎలాంటి ఎన్నికలు వైఎస్ఆర్‌సీపీలో జరగవు. సంస్థాగత ఎన్నికలు జరిగినా జరగకపోయినా అధ్యక్షునిగా జగనే ఉంటారు. ఇతర పదవులకు ఎన్నికలు జరగుతాయి. సాధారణంగా ఇతర పదవులకు ఎన్నికలు అంటే అధ్యక్షుడే ఎంపిక చేస్తారు. ఆయన ఎవరు పేరు చెబితే వారే ఆ పదవుల్లో నియమితులవుతారు కాబట్టి వైఎస్ఆర్‌సీపీలో ఇక సంస్థాగత ఎన్నికలు ఉండవని అనుకోవచ్చు.
మేనిఫెస్టో అమలు చేశామని నమ్మకం కలిగితేనే ఆశీర్వదించండి - ప్రజలకు జగన్ పిలుపు !
అయితే భారతదేశ రాజకీయ వ్యవస్థలో ఓ పార్టీకి శాశ్వత అధ్యక్షుడు అంటూ ఇప్పటి వరకూ ఎవరూ లేరు. సాధారణంగా రాజకీయ పార్టీగా ఈసీ వద్ద రిజిస్టర్ చేసుకోవాలంటే నిబంధనలు పాటించాలి. ఈసీ వద్ద ఉన్న నిబంధనల ప్రకారం ప్రతి రాజకీయ పార్టీ రెండేళ్లకోసారి సంస్థాగతంగా ఎన్నికలు నిర్వహించాలి. ఆ వివరాలను ఈసీకి పంపించారు. చాలా రాజకీయ పార్టీలు తూ తూ మంత్రంగా సంస్థాగత ఎన్నికల ప్రక్రియ చేసేస్తూంటాయి. ఎందుకంటే ఖచ్చితంగా చేయాలన్న నిబంధనల ఉండబట్టే ఇలా చేస్తున్నారు. అయితే అనూహ్యంగా వైఎస్ఆర్‌సీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ను నియమిస్తూ పార్టీ రాజ్యాంగాన్నే మార్చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎప్పటికప్పుడు ఎన్నికలు ఉండాలని.. ఒక్క సారే శాశ్వత అధ్యక్షుడిగా నియమించుకోవడం సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు.
నేను వైసీపీ ప్రాథమిక సభ్యుడ్ని, ఆ తరువాతే MLA, స్పీకర్ పదవులు: తమ్మినేని కీలక వ్యాఖ్యలు
ఏ పార్టీకైనా శాశ్వత అధ్యక్షుడు అనే విధానం మన దేశంలో కుదరదని ఎన్నికల నిపుణులు చెబుతున్నారు. ఎవరూ పోటీ చేయకపోతే ఏకగ్రీవం చేసుకోవచ్చని.. శాశ్వత, జీవితకాల అధ్యక్షుడు అంటే కుదరదని చెబుతున్నారు. ఈ అంశాన్ని ఈసీ అంగీకరించదని.. సంస్థాగత ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలనే అంటుందని అంటున్నారు. అదే సమయంలో వైఎస్ఆర్‌సీపీకి చెందిన ఎవరైనా కోర్టుకు వెళ్లవచ్చు. ఇప్పటికే వైఎస్ఆర్‌సీపీ రెబల్‌గా మారిన ఎంపీ రఘురామకృష్ణరాజు న్యాయపోరాటం చేస్తానని ప్రకటించారు.
ఇప్పటి వరకూ రాజకీయ పార్టీలు శాశ్వత అధ్యక్షుడిగా నియమితులు కావాలనే ఆలోనచ ఎవరికీ రాలేదు. నిజానికి ప్రాంతీయ పార్టీల్లో అధ్యక్షుడి చేతిలోనే అధికారం మొత్తం ఉంటుంది. ఆయన యాక్టివ్‌గా ఉన్నంత కాలం ఆయనే అధ్యక్షుడిగా ఉంటారు. అయితే ప్రతీ సారీ ఎందుకు ఎన్నిక కావాలి.. ఒక్కసారే అధ్యక్షుడిగా ప్రకటించుకుంటామన్న ఆలోచన ఎవరికీ రాలేదు. ఇప్పుడు జగన్‌కు వచ్చింది. అమలు చేశారు. అయితే ఈసీ నిబంధనల ప్రకారం సాధ్యమా కాదా అన్నది ముందు ముందు తేలే అవకాశం ఉంది.