YSRCP Plenary 2022: నేను వైసీపీ ప్రాథమిక సభ్యుడ్ని, ఆ తరువాతే MLA, స్పీకర్ పదవులు: తమ్మినేని కీలక వ్యాఖ్యలు
AP Speaker Tammineni Sitaram: తాను వైఎస్సార్‌సీపీ ప్రాథమిక సభ్యుడినని.. తర్వాతే వైసీపీ ఎమ్మెల్యేను, తర్వాతే స్పీకర్‌ననంటూ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు.
YSRCP Plenary 2022 Live Updates: తాను వైఎస్సార్‌సీపీ ప్రాథమిక సభ్యుడినని.. తర్వాతే వైసీపీ ఎమ్మెల్యేను, తర్వాతే స్పీకర్‌ననంటూ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్లీనరీ పండుగ ఘనంగా జరుగుతుంటే తాను ఇంట్లో ఎందుకు కూర్చోవాలని ప్రశ్నించారు. గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సీఎం జగన్ తీసుకొచ్చారని, ఏపీలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని అందులో తాను భాగస్వామిని కావాలనుకున్నట్లు చెప్పారు.
వైసీపీ ప్లీనరీ రెండో రోజు కార్యక్రమంలో పాల్గొని తమ్మినేని సీతారామ్ (AP Assembly Speaker Tammineni Sitaram) మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి విజయమ్మ, విషాదాన్ని కూడా దిగమింగి.. అనేక అవమానాలను ఎదురొడ్డి తన కుమారుడిని గొప్ప సీఎంగా తీర్చిదిద్దేందుకు కీలక భూమి పోషించారని తమ్మినేని అన్నారు. రాష్ట్రంలోనే కాదు దేశంలోనే విజయమ్మ పాత్ర మరువలేమన్నారు. అసెంబ్లీ స్పీకర్లు పార్టీ సమావేశాలకు హాజరుకావడంపై పచ్చ మీడియా గొంతెత్తి అరుస్తోందని .. గతంలో టీడీపీ మహానాడుకు కోడెల శివప్రసాద్ హాజరు కావడం కనిపించలేదా అని ప్రశ్నించారు. పచ్చ మీడియాకు ఓ విషయం గుర్తు చేస్తున్నాను.. నేను మొదటగా వైఎస్సార్‌సీపీ ప్రాథమిక, ఆ తరువాతే ఎమ్మెల్యే అయ్యాను, స్పీకర్ అయ్యానని కీలక వ్యాఖ్యలు చేశారు.
మూడేళ్ల పాలనలో ఎన్నో విజయాలు
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయ్యాయి. ఈ మూడేళ్లలో సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఎన్నో విజయాలు సాధించిందని, అన్ని వర్గాల సంక్షేమానికి సైతం భారీగా నిధులు ఇచ్చిందని తమ్మినేని సీతారామ్ గుర్తుచేశారు. మూడేళ్ల పాలన, సక్సెస్‌ను వైసీపీ శ్రేణులు కచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలని, 2024లో మళ్లీ విజయాన్ని సాధించడమే మనముందున్న లక్ష్యం అన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు వచ్చే ఎన్నికల్లో విజయం దిశగా ఉత్సాహంగా అడుగులు వేయాలంటూ వైసీపీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. సంక్షేమం, అభివృద్ధి అనేవి వైఎస్ జగన్ ఆయుధాలు అన్నారు.
మంచిని కాదని చెడు ప్రచారం..
గత మూడేళ్ల పాలనలో ఏపీ ప్రభుత్వం చేసిన సాధించిన ప్రగతిని పక్కనపెట్టి, కేవలం దుష్ప్రచారం చేస్తున్న పచ్చ మీడియాకు మంచి పనులు కనిపించవా అని ప్రశ్నించారు. ప్రజల కోసం అమలవుతున్న అనేక సంక్షేమ పథకాలు, ప్రతి వర్గానికి జరుగుతున్న మేలు గురించి రాయడం లేదన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ వైసీపీ ఘన విజయం సాధిస్తుందని దీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను గడప గడపకూ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రజలకు వివరించి వారికి అవగాహన వచ్చేలా చేయాలని పిలుపునిచ్చారు.