Chandrababu: చంద్రబాబుతో పవన్, బీజేపీ నేతల భేటీ - కీలక అంశాలపై చర్చ, అదే లక్ష్యం!
Andhrapradesh News: టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేనాని పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, ఇతర బీజేపీ సీనియర్ నేతలు శుక్రవారం భేటీ అయ్యారు.
Pawan Kalyan And Bjp Leaders Meet With Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబుతో (Chandrababu) కూటమి నేతలు భేటీ అయ్యారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan), బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి (Purandesari), ఆ పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇంఛార్జీ సిద్దార్థ్ నాథ్ సింగ్, బీజేపీ నేతలు అరుణ్ సింగ్, ఇతర సీనియర్ నేతలు ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబుతో భేటీ అయ్యారు. మరోవైపు, కోయంబత్తూరు పర్యటన ముగించుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సైతం ఈ భేటీకి హాజరయ్యారు. దాదాపు 2 గంటల పాటు సాగిన సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఉమ్మడి మేనిఫెస్టో, ఎన్నికల ప్రచార శైలి, భవిష్యత్ కార్యాచరణ, క్షేత్రస్థాయి పరిస్థితులపై చర్చ జరిగినట్లు సమాచారం. అనపర్తి, ఉండి తదితర స్థానాలు, పొత్తు నేపథ్యంలో ఇప్పటికే స్థానాలు ఫైనల్ కాగా.. పరస్పరం మార్పు కోరుకుంటున్న కొన్ని స్థానాలపైనా ఈ భేటీలో చర్చించారని తెలుస్తోంది. ప్రధాని మోదీ పాల్గొనే బహిరంగ సభల నిర్వహణపైనా కూటమి నేతలు చర్చించారు. కొందరు ఉన్నతాధికారులు ఏకపక్ష వైఖరిపైనా భేటీలో చర్చకు వచ్చినట్లు సమాచారం. అంతకు ముందు పవన్ కల్యాణ్, పురంధేశ్వరి, బీజేపీ నేతలకు చంద్రబాబు ఘన స్వాగతం పలికారు. దీంతో పాటు చర్చ జరుగుతున్నట్లు సమాచారం.
కీలక నిర్ణయాలు
ఈ భేటీలో కూటమి పెద్దలు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. బూత్, అసెంబ్లీ, పార్లమెంట్ పరిధిలో సమావేశాలు నిర్వహించాలని నేతలు నిర్ణయించారు. ప్రచార వ్యూహం, ఎన్నికల నిర్వహణపై పరిశీలనకు రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని.. అలాగే, ఓట్ల బదిలీపై క్షేత్రస్థాయిలో ఫలితాలు సాధించేలా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సాధ్యమైనన్ని ఎక్కువ చోట్ల ఉమ్మడి సభలు నిర్వహించాలని.. అధికార దుర్వినియోగంపై ఎప్పటికప్పుడు ఈసీకి ఫిర్యాదు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. కూటమి తరఫున ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డా, రాజ్ నాథ్ సింగ్ సభల్లో పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో 160కి పైగా అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారం సాగాలని కూటమి నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు.
బాలకృష్ణ బస్సుయాత్ర
అటు, ఎన్నికల ప్రచారంలో భాగంగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారు. 'స్వర్ణాంధ్ర సాకార యాత్ర' పేరుతో బస్సు యాత్ర నిర్వహించనున్నారు. ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాలోని నియోజకవర్గాల్లో పర్యటనలు కొనసాగుతాయి. కదిరిలో శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం యాత్రను ప్రారంభిస్తారు. బస్సు యాత్ర ఏప్రిల్ 13న శింగనమల, తాడిపత్రి నియోజకవర్గాల్లో, ఏప్రిల్ 14న బనగానపల్లె, ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల్లో యాత్ర సాగనుంది. ఏప్రిల్ 15న పాణ్యం, నందికొట్కూరు, కర్నూలు, ఏప్రిల్ 16న కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో బాలకృష్ణ పర్యటించనున్నారు. ఈ నెల 17న పత్తికొండ, ఆలూరు, రాయదుర్గ్ ప్రాంతాల్లోనూ పర్యటిస్తారు. మూడోసారి హిందూపురం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్నారు బాలకృష్ణ. 1985 నుంచి ఎన్టీఆర్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న హిందూపురం నుంచి హ్యాట్రిక్ ఖాయమని బాలకృష్ణ అంచనా వేసుకుంటున్నారు. బాలకృష్ణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. ఈ నెల 25 నుంచి ఉత్తరాంధ్రలో చేపట్టనున్న ప్రచారంలో ఆయన పాల్గొననున్నారు. 19వ తేదీన హిందూపురంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తారు.
Also Read: AP Inter Results 2024: ఏపీ ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి, విద్యార్థుల ఉత్తీర్ణత వివరాలు ఇలా