National News: కాంగ్రెస్ నుంచి ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ-రాజస్థాన్ సీఎం గెహ్లాట్ కీలక ప్రకటన
రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికలకు కాంగ్రెస్ నుంచి ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీనే అని చెప్పారు. ముంబైలో జరగబోతున్న ప్రతిపక్ష కూటమి సమావేశాల ముందు ఈ ప్రకటన చేశారు.
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఎలాగైనా బీజేపీ ఓడించాలని కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమయ్యాయి. వరుస సమావేశాలు నిర్వహిస్తున్నాయి. అయితే...ఈ కూటమి నుంచి ప్రధాని అభ్యర్థి ఎవరన్నది ఎప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. ఈ సమయంలో రాజస్థాన్ సీఎం చేసిన ప్రకటన.. హాట్ టాపిక్‌గా మారింది. వచ్చే ఎన్నికల తమ ప్రధాన అభ్యర్థి రాహుల్ గాంధీ అని ఆయన చెప్పారు. ముంబైలో జరగబోతున్న ప్రతిపక్షాల కూటమిలో అందరితో చర్చించి.. దీనిపై ఏకాభిప్రాయ నిర్ణయం తీసుకోబోతున్నామని చెప్పారు. అయితే... 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీనే అని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిర్ణయించిందన్నారు అశోక్ గెహ్లాట్.
2014లో బీజేపీ కేవలం 31 శాతం ఓట్లతోనే అధికారంలోకి వచ్చిందన్నారు గెహ్లాట్. మిగిలిన 69 శాతం ఆయనకు వ్యతిరేక ఓట్లే అని చెప్పారు. కనుక ప్రధాని మోడీ అహంకారంతో ఉండకూడదన్నారు గెహ్లాట్. గత నెలలో బెంగళూరులో జరిగిన ప్రతిపక్ష కూటమి సమావేశం తర్వాత... ఎన్డీయేలో భయం మొదలైందని చెప్పారాయన. 2024 ఎన్నికల్లో 50శాతం ఓట్లతో ఎన్‌డీఏ అధికారంలోకి వస్తుందన్న బీజేపీ కల కలగానే మిగిలిపోతుందన్నారు. మోడీకి వ్యతిరేక ఓటు పెరుగుతోందని.. కనుక దాన్ని ఎప్పటికీ సాధించలేరని చెప్పారు. ఎన్‌డీఏకి ఓట్ల శాతం తగ్గుతోందని... 2024 ఎన్నికల ఫలితాల్లో ఈ విషయం నిర్ధారణ అవుతుందన్నారు. ఆ ఫలితాల్లో ప్రధాని ఎవరో నిర్ణయిస్తాయని అన్నారు గెహ్లాట్.
మోడీ మాట్లాడే తీరును కూడా అశోక్ గెహ్లాట్ విమర్శించారు. ప్రజాస్వామ్యంలో భవిష్యత్తును అంచనా వేయడం ఎవరికీ సాధ్యం కాదని... ప్రజలే నిర్ణయించాలని అన్నారు. ప్రజల నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. ప్రధాని మోడీ చేసిన అనేక హామీలు ఏమయ్యాయో... ప్రజలు గమనిస్తున్నారని గెహ్లాట్. ఇక, చంద్రయాన్-3 విజయవంతగా చంద్రుడిపై ల్యాండ్ అయ్యిందంటే.. .అందులో ఇందిరాగాంధీ, నెహ్రూ చేసిన కృషి కూడా ఎంతో ఉందన్నారు. గతంలో వారు చేసిన కృషి ఫలితంగానే ఇప్పుడు విజయాలు సాధిస్తున్నామన్నారు. నెహ్రూ వల్లే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ-ఇస్రో స్థాపించబడిందని ఆయన గుర్తుచేశారు.
అశోక్ గెహ్లాట్ ప్రకటనతో... ముంబై ప్రతిపక్షాల కూటమి సమావేశం తర్వాత చాలా విషయాలపై క్లారిటీ వస్తుందని తెలుస్తోంది. ముఖ్యంగా... వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి నుంచి ప్రధాని అభ్యర్థి ఎవరనే దానిపై కూడా స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.