Nara Lokesh: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఎనీ ప్లేస్, ఎనీ టైం రెడీ - సమస్యల పరిష్కారంలో లోకేష్ ప్రత్యేకత !
Andhra: ఆన్ లైన్, ఆఫ్ లైన్ వేదికగా సమస్యలను పరిష్కరించడంలో నారా లోకేష్ ప్రత్యేకత చూపిస్తున్నారు. ప్రజాదర్బార్ పేరుతో ఆయన యాభై రోజుల పాటు విజ్ఞప్తులు తీసుకుని పరిష్కారాలు చూపించారు.
Andhra Minister Lokesh: ఏపీ మంత్రి నారా లోకేష్ సమస్యల పరిష్కారంలో తనదైన ముద్ర వేస్తున్నారు. మంగళగిరి నివాసంలో ప్రజాదర్బార్ 50 రోజులు పూర్తిచేసుకుంది. కష్టం ఏదైనా మీ వెంట నేనున్నానంటూ.. ప్రజాదర్బార్ తలుపు తట్టిన వారికి అండగా నిలుస్తున్నారు. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.. పదవీ బాధ్యతలు చేపట్టిన మూడో రోజు నుంచే ఉండవల్లిలోని తన నివాసంలో ప్రజాదర్బార్ చేపట్టి భరోసా ఇచ్చారు. ఇప్పటివరకు 50 ప్రజాదర్బార్ లు నిర్వహించి బాధితుల సమస్యలు పరిష్కరిస్తున్నారు.
సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగం
ప్రజాదర్బార్ లో వచ్చిన విజ్ఞప్తుల్లో ఇప్పటివరకు 75శాతం సమస్యలకు పరిష్కారం చూపించారు. ప్రజల నుంచి మొత్తం 5,810 విజ్ఞప్తులు అందగా.. 4,400 అర్జీలను పరిష్కరించారు. 1,410 విజ్ఞప్తులు పెండింగ్ లో ఉన్నాయి. సమస్యల్లో దాదాపు 50శాతం వరకు రెవెన్యూ, హోంశాఖకు సంబంధించినవి. ఆ తర్వాత స్థానాల్లో మానవ వనరులు, ఆరోగ్యం, పంచాయతీ రాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలకు సంబంధించిన విజ్ఞప్తులు అందాయి. భూవివాదాలకు సంబంధించి 1,585 విజ్ఞప్తులు అందగా.. 1,170 సమస్యలను పరిష్కరించారు. 415 అర్జీలు పెండింగ్ లో ఉన్నాయి. హోంశాఖకు సంబంధించి 1,276 విజ్ఞప్తులు రాగా.. 1,158 విజ్ఞప్తులను పరిష్కరించారు. 118 విజ్ఞప్తులు పెండింగ్ లో ఉన్నాయి. వీటితో పాటు ఉద్యోగాల కోసం 800 వరకు దరఖాస్తులు అందగా.. అర్హతలను బట్టి 347 మందికి త్వరలోనే వీరికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. పెన్షన్ కోసం 350 దరఖాస్తులు అందాయి. ఆయా సమస్యలకు కూడా త్వరలోనే పరిష్కారం చూపిస్తామని ఆయన టీం ధీమా వ్యక్తం చేస్తోంది.
సమస్యలు పరిష్కారమవుతున్న భరోసాతో పెరుగుతున్న స్పందన
కష్టాల్లో ఉన్న వారికి మొదట గుర్తొచ్చేది మంత్రి నారా నారా లోకేష్ ప్రజాదర్బార్ అని మంగళగిరి ప్రజలు చెబుతున్నారు. . ఇక్కడకు వస్తే చాలు.. తమ సమస్యలకు పరిష్కారం లభించినట్లేనని ప్రజలు విశ్వసిస్తున్నారు. దీంతో ప్రజాదర్బార్ కు విశేష స్పందన లభిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నా సేవా కార్యక్రమాలతో మంగళగిరి ప్రజల మనసు గెలుచుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట మంగళగిరి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రజాదర్బార్ ఏర్పాటుచేయగా.. క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా బాధితులు తరలివచ్చి తమ సమస్యలను విన్నవిస్తున్నారు. గత పాలకుల మాదిరిగా ఇక్కడ ఎలాంటి బారికేడ్లు, పరదాలు లేవు. ప్రజల కోసం తమ ఇంటి ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయనే హామీని మంత్రి లోకేష్ నిలబెట్టుకున్నారు. ఉండవల్లి నివాసానికి చేరుకుంటున్న ప్రజలను ఉదయం 8 గంటలకు స్వయంగా కలుసుకుని.. వారిని ఆప్యాయంగా పలకరిస్తూ వినతులు స్వీకరిస్తున్నారు. జిల్లాల పర్యటనలోనూ ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజలకు భరోసా ఇస్తున్నారు.
Also Read: బంగ్లాదేశ్‌పై పవన్ కల్యాణ్ ఆగ్రహం - అందరూ మాట్లాడాల్సిన సమయం వచ్చిందని పిలుపు
సోషల్ మీడియా విజ్ఞప్తులకూ స్పందన
సోషల్ మీడియా, ప్రజాదర్బార్ లో వచ్చే సమస్యల సత్వర పరిష్కారానికి మంత్రి నారా లోకేష్ కృషిచేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటుచేశారు. ఆయా సమస్యలను సంబంధిత శాఖలకు పంపి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. తానే స్వయంగా మంత్రులతో మాట్లాడి సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని కోరుతున్నారు. ప్రతి కేబినెట్ సమావేశంలో అప్పటివరకు తాను స్వీకరించిన విజ్ఞప్తులను మంత్రులకు అందజేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా తమ కష్టాలకు, సమస్యలకు మంత్రి నారా లోకేష్ ప్రజాదర్బార్ ద్వారా పరిష్కారం లభిస్తుండటంతో బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గల్ఫ్ లో ఇరుక్కుపోయామని సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేస్తున్న వారినీ కాపాడుతున్నారు. ఇప్పటి వరకూ గల్ఫ్ లో చిక్కుకున్న దాదాపు 21 మందిని రాష్ట్రానికి రప్పించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపారు. ముగిసిపోయిందనుకున్న తమ జీవితాలకు మంత్రి లోకేష్ ప్రాణం పోశారంటూ వారంతా కృతజ్ఞతలు తెలిపారు.
సమస్యల పరిష్కారంలో యువనేతల్లో నారా లోకేష్ ప్రత్యేకత చూపిస్తున్నారని అనుకోవచ్చు.