RS Praveen Kumar : మునుగోడులో బీఎస్పీ సత్తా చాటుతుందా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు లిట్మస్ టెస్ట్!
RS Praveen Kumar : మునుగోడు ఉపఎన్నికలో ప్రభావం చూపాలని బీఎస్పీ కూడా బాగానే ప్రచారం చేస్తుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన బరిలోకి దిగుకున్న బీఎస్పీ గత ఎన్నికల కన్నా ఎక్కువ ఓట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తుంది.
RS Praveen Kumar : మునుగోడు ఎన్నికల్లో ఇప్పుడు కీలకంగా మారింది బహుజన్ సమాజ్ వాది పార్టీ. మునుగోడు ఉపఎన్నికలో బీఎస్పీ నుంచి అందోజు శంకరాచారి పోటీ చేస్తున్నారు. 2018 ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థికి కేవలం 738 ఓట్లు మాత్రమే వచ్చాయి. కానీ ఈసారి మునుగోడు బైఎలక్షన్స్ లో మరోసారి బరిలోకి దిగుతోంది. విశ్రాంత ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత తొలిసారి ఉప ఎన్నికల్లో బరిలోకి దిగుతోంది.
ప్రవీణ్ కుమార్ మునుగోడు ఉపఎన్నికల్లో కాలికి బలపం కట్టుకొని ప్రచారం చేస్తున్నారు. ఉప ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటినుంచి ఆయన నియోజకవర్గంలోనే తిష్ట వేశారు. ఈ సారి మునుగోడులో సత్తా చాటాలని చూస్తున్నారు. బీఎస్పీ దూకుడు ఏ పార్టీకి నష్టం చేకూరుస్తుందోనని ప్రధాన పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. ఈ సారి ఉప ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకంగా మారనుంది. ఏ అభ్యర్థి గెలిచిన బోటాబోటి మెజార్టీతోనే గెలుస్తారనే చర్చ మునుగోడులో జరుగుతోంది. దీంతో ప్రధాన పార్టీలు మూడు కూడా తమ అస్త్రాలన్నింటినీ సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ లో స్థిరపడిన మునుగోడు ఓటర్లకు గాలం వేస్తున్నాయి. మునుగోడు ఈ సారి 2 లక్షల 41 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కను వినియోగించుకోనుండగా అందులో దాదాపు 60వేల ఓట్లు ఎల్పీనగర్, హయత్ నగర్ ప్రాంతాల్లోనే ఉన్నాయంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
గుర్తుల బెంగ ఓ వైపు ప్రవీణ్ కుమార్ మరోవైపు
గత ఎన్నికల్లో 91.3శాతం ఓటింగ్ పోలైంది. ఈ సారి కూడా అదే స్థాయిలో ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. ఎందుకు కంటే ప్రధాన రాజకీయపార్టీలు అన్నీ ఓటర్లను పోలింగ్ బూత్ కు తీసుకొచ్చే పనిలో బాగా కసరత్తు చేస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో సీరియల్ నెంబర్లు, గుర్తులు బాగా ఇంపాక్ట్ చూపే అవకాశం లేకపోలేదు. బీఎస్పీ బ్యాలెట్ పేపర్ లో నెంబర్ 1.లో ఉంది. ఏనుగు గుర్తు కూడా బాగా ప్రచారం చేస్తున్నారు. సీరియల్ నెంబర్ 1లో రావడం బీఎస్పీకి కలిసొచ్చే అంశం అని ఆ పార్టీ నేతలు అంటున్నారు. ఆల్ఫాబెటికల్ ఆర్టర్ లో చూస్తే మొదటి పేరు ఉండటం, ఈ సారి స్వయంగా ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ రంగంలోకి దిగి ప్రచారం చేస్తుండటం ఏనుగు గుర్తుకు కలిసొచ్చే అవకాశం లేకపోలేదు. అయితే బిఎస్సీ ఎవరు ఓట్లు చీల్చుతుంది అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ప్రధాన పార్టీలు మూడు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారినే బరిలోకి దింపాయి. బీఎస్పీ దీన్నే ప్రచార అస్త్రంగా మార్చుకుంది.
ప్రభుత్వ వ్యతిరేకత ఓటు
బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆందోజు శంకరాచారిని బీఎస్పీలో రంగంలోకి దింపి తాము బహుజనుల పక్షమని ప్రచారం చేస్తోంది. మునుగోడులో అత్యధికంగా బీసీ సామాజికి వర్గానికి చెందిన ఓటర్లు అధికంగా ఉన్నారు. అంటే బీసీలు 66.2 శాతం ఓటర్లు ఉండగా మిగిలిన వారిలో ఎస్సీలు 15.6% , ఓసీలు 8.9%, ఎస్టీలు 5.7%, మైనారిటీలు 3.5% ఉన్నట్లు సమాచారం. దీంతో బీసీ ఓటు బ్యాంకుతోపాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్ల మీద కూడా బీఎస్పీ ప్రధానంగా ఓట్లు చీల్చే అవకాశం లేకపోలేదు. అధికార టీఆర్ఎస్ మాత్రం ప్రభుత్వ వ్యతిరేకత ఓటును బీఎస్పీ చీల్చగలిగితే అది తమకు కలిసొస్తుందని భావిస్తోంది. కానీ టీఆర్ఎస్ కు కోర్ ఓటు బ్యాంకు ఎస్సీ ఓటు బ్యాంకు. దాని మీద ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ఎఫెక్ట్ ఏ మేరకు ఉంటుందో చూడాలి.
బీసీ ఓటు బ్యాంకు
ఇక బీజేపీ ప్రధానంగా బీసీ ఓటు బ్యాంకు మీద ఆశలు పెట్టుకుంది. బీఎస్పీ బీసీ అభ్యర్థిని దించడంతో బీజేపీ ఆశల మీద బిఎస్సీ ఏ మేరకు నీళ్లు చల్లుతుందో చూడాలి. ఇక కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కూడా బహుజనులే. ఇప్పటికే ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీ మారి బీజేపీలో చేరడం, మరోవైపు పార్టీ క్యాడర్ ను కూడా రాజగోపాల్ రెడ్డి తనతోపాటు కొంతమంది తీసుకెళ్లడం తో కొంత ఇబ్బంది కలిగిస్తుండగా, మరోవైపు బీఎస్పీ తమ కోర్ ఓటు బ్యాంక్ మీద కన్నేయడంతో కాంగ్రెస్ పార్టీకి కూడా భారీ నష్టాన్ని బీఎస్పీ తీసుకోచ్చే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు రోడ్ రోలర్ గుర్తుతో అధికారపార్టీ పరేషాన్ అవుతోంది.
నోటాకు ఐదో స్థానం
గత ఎన్నికల్లో రోడ్ రోలర్ గుర్తు నాలుగో స్థానం సాధించింది. మొత్తం పోలైన ఓట్లలో 1. 79శాతం ఓట్లు సాధించింది. అంటే 3569 ఓట్లు రోడ్ రోలర్ గుర్తు అభ్యర్థికి వచ్చాయి. నోటా గుర్తుతో కలిపి 48 మంది ఈ సారి ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారు. గత ఎన్నికల్లో కూడా నోటాకు తక్కేవం ఓట్లు రాలేదు. 3086 వేల ఓట్లు వచ్చాయి. నోటా కు వచ్చిన ఓట్లే 5వ స్థానంలో ఉంది. ఈ మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రతి ఓటు చాలా కీలకం కానుంది. మూడు ప్రధాన రాజకీయాపార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అటు బీఎస్పీ కూడా తక్కువేం ప్రచారం చేయడంలేదు. ప్రతి ఓటర్నీ టచ్ చేస్తూ జోరు పెంచుతున్నారు. మునుగోడు ఉప ఎన్నికలకు ముందు ప్రచారంలో ఉన్న బీఎస్పీ దూకుడు ఓట్ల రూపంలో రాబడుతుందో చూడాలంటే నవంబర్ మూడో తారీఖువరకు ఆగాల్సింది.
రాబోయే ఎన్నికలకు రూట్ మ్యాప్
ఒక వేళ మునుగోడులో గెలుపు ఓటములను బీఎస్పీ నిర్ణయించే స్థాయికి కనుక వస్తే అది ఖచ్చితంగా రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. ఇక్కడ చతికలపడితే ప్రధాన రాజకీయపార్టీలు ఊపిరి పీల్చుకునే అవశం కూడా లేకపోలేదు.