BRS activity: మున్సిపల్ ఎన్నికలు ముంచుకొస్తున్నా ఆన్‌లైన్ రాజకీయమే - బీఆర్ఎస్ బహిరంగసభలు ఇంకెప్పుడు?
Municipal elections: మున్సిపల్ ఎన్నికలు ముంచుకొస్తున్నా బీఆర్ఎస్ ఆఫ్‌లైన్‌లో అంత చురుకుగా కనిపించడం లేదు.కేసీఆర్ ప్రకటించిన బహిరంగసభల గురించీ సైలెంట్ అయిపోయారు.

KCR Active Politics: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగకముందే రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రధానంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య క్షేత్రస్థాయి పోరాటం విషయంలో స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇప్పటికే ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టగా, బీఆర్ఎస్ మాత్రం కేవలం ప్రకటనలకే పరిమితమవుతోంది.
బహిరంగసభలపై కసరత్తు ఏది?
నెల రోజుల క్రితం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి, పదిహేను రోజుల్లో మూడు జిల్లాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ ప్రకటనతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం వస్తుందని అందరూ భావించారు. కానీ, ఆ గడువు ముగిసి నెల రోజులు గడుస్తున్నా, ఆ సభల ఊసే ఎత్తకపోవడం పార్టీ క్యాడర్‌కూ ఇబ్బందికరంగానే మారింది. కేసీఆర్ ప్రకటన తర్వాత క్షేత్రస్థాయిలో ఎలాంటి కదలిక లేకపోవడంతో, ద్వితీయ శ్రేణి నాయకత్వం , కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలపై రోడ్డెక్కి పోరాడాల్సిన సమయంలో, కేసీఆర్ మౌనం దాల్చడం బీఆర్ఎస్ వ్యూహకర్తలను కూడా ఆలోచనలో పడేస్తోంది.
తన పని తాను చేసుకెళ్తున్న రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ కార్యాచరణలో అత్యంత చురుకుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే జిల్లాల పర్యటనలు ప్రారంభించిన ఆయన, వచ్చే నెలలో తొమ్మిది జిల్లాల్లో భారీ బహిరంగ సభలకు ప్రణాళికలు సిద్ధం చేశారు. పాలమూరులో ట్రిపుల్ ఐటీ శంకుస్థాపన, మేడారంలో కేబినెట్ భేటీ వంటి నిర్ణయాల ద్వారా పాలనను ప్రజల వద్దకు తీసుకెళ్తూనే, రాజకీయంగా కూడా మైలేజ్ పొందే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తుండటంతో కాంగ్రెస్ శ్రేణులు పూర్తిస్థాయి ఎన్నికల మోడ్‌లోకి వెళ్లిపోయాయి.
ఆన్ లైన్ రాజకీయాల్లోనే ఇంకా బీఆర్ఎస్
బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం సోషల్ మీడియా విమర్శలు, ప్రెస్ మీట్లు , ట్విట్టర్ వేదికగా చేసే ఆరోపణలకే పరిమితం అవుతోంది. కేటీఆర్, హరీష్ రావు వంటి నేతలు నిత్యం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నప్పటికీ, అది కేవలం డిజిటల్ వేదికలకే పరిమితం కావడం వల్ల సామాన్య ఓటరుపై దాని ప్రభావం తక్కువగా ఉంటోంది. రాజకీయాల్లో కంటికి కనిపిస్తేనే ఓటు అనే సూత్రం బలంగా ఉంటుంది. రేవంత్ రెడ్డి జనంలోకి వెళ్తుండగా, బీఆర్ఎస్ నేతలు ఇళ్లకే పరిమితమవ్వడం ఆ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో చేటు తెచ్చే ప్రమాదం ఉంది.
మున్సిపల్ ఓటర్ల ఓటింగ్ ఎజెండా పక్కా లోకలే!
మున్సిపల్ ఎన్నికలు అనేవి స్థానిక సమస్యలు, నేరుగా ఓటరుతో ముడిపడి ఉన్నవి. ఇక్కడ భావోద్వేగాల కంటే నాయకుల చురుకుదనం ముఖ్యం. రేవంత్ రెడ్డి దూకుడును అడ్డుకోవాలంటే బీఆర్ఎస్ కేవలం ఆరోపణలతో సరిపెట్టకుండా, కేసీఆర్ చెప్పినట్లుగా బహిరంగ సభల ద్వారా ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. లేనిపక్షంలో, అధికార యంత్రాంగం , సంక్షేమ పథకాల జోరుతో దూసుకుపోతున్న కాంగ్రెస్‌ను ఎదుర్కోవడం గులాబీ దళానికి కత్తిమీద సామే అవుతుంది. ప్రకటనలకు.. ఆచరణకు మధ్య ఉన్న ఈ అంతరం బీఆర్ఎస్ ఓటు బ్యాంకును దెబ్బతీసే అవకాశం ఉంది. రాజకీయాల్లో టైమింగ్ చాలా ముఖ్యం. రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల వేటను ప్రారంభించిన తరుణంలో, బీఆర్ఎస్ ఇంకా సభల ముహూర్తాల కోసమే ఎదురుచూస్తుండటం ఆ పార్టీ బలహీనతను సూచిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు బీఆర్ఎస్ తన పంథాను మార్చుకోకపోతే, పట్టణ ఓటర్లు అధికార పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.





















