Viswaroop Son Krishna Reddy : రెండేళ్లలో అందరి అంతు చూస్తా - అమలాపురంలో మంత్రి కుమారుడి రివెంజ్ చాలెంజ్ !
రివెంజ్ తీర్చుకుంటానని హెచ్చరికలు జారీ చేస్తున్నారు మంత్రి విశ్వరూప్ కుమారుడు కృష్ణారెడ్డి. వైఎస్ఆర్‌సీపీ ఎంపీటీసీని బెదిరిస్తున్న ఆడియో వైరల్ అవుతోంది.
Viswaroop Son Krishna Reddy : అమలాపురంలో రాష్ట్ర మంత్రి పినిపె విశ్వరూప్ ఇంటిపై దాడి చేసిన ఆరోపణలు ఉన్న వారికి మంత్రి కుమారుడు ఫోన్లు చేసి రెండేళ్లలో అంతు చూస్తానని బెదిరిస్తూండటం కలకలం రేపుతోంది. వైఎస్ఆర్‌సీపీ ఎంపీటీసీకి ఇలాగే కాల్ చేసి బెదిరించడంతో ఆయన రికార్డు చేసి సోషల్ మీడియాకు లీక్ చేశారు. దీంతో ఆ ఆడియో వైరల్ అవుతోంది.
విశ్వరూప్ కుమారుడు కృష్ణారెడ్డి బెదిరింపుల పర్వం
మంత్రి పినిపె విశ్వరూప్ ( Pinipe Viswaroop ) కుమారుడి పేరు కృష్ణారెడ్డి. తమ ఇంటిపై దాడి చేసిన వారిలో వైఎస్ఆర్‌సీపీ నేతలే ఉన్నారని పలుమార్లు మంత్రి విశ్వరూప్ కూడా ప్రకటించారు. ఓ కౌన్సిలర్ ఉన్నారని.. మరో ఎంపీటీసీ ఉన్నారని చెబుతున్నారు. అన్ని ఆధారాలు ఉన్నాయంటున్నారు. అయితే పోలీసుల దర్యాప్తులో మాత్రం వారి పేర్లు బయటకు రాలేదు. వారెవర్నీ అరెస్ట్ చేయలేదు. ఇలాంటి వారిలో అమలాపురం మండలం ఈదరపాలెం ఎంపీటీసీ అడపా సత్తిబాబుపై ( Adapa Sattibabu ) కూడా మంత్రి కుమారుడు అనుమానం పెంచుకున్నారు. ఆయన కూడా తమ ఇంటిపై దాడి చేసిన వారిలో ఉన్నారని కృష్ణారెడ్డి అనుమానం.
పోలీసు కేసులు నమోదు కాని నేతలకు హెచ్చరికలు
పోలీసులు అదుపులోకి తీసుకోలేదని కోపమో.., మరో కారణమో కానీ నేరుగా సత్తిబాబుకే ఫోన్ చేసి రెండేళ్లలో అంతు చూస్తానని హెచ్చరికలు జారీ చేశారు. ‘నా ఇల్లు అంటిస్తారా.. మా అమ్మా, నాన్నను చంపేస్తారా.. రెండు కాళ్లు విరిచేస్తాను, మిమ్మల్ని చంపుతా’’ అంటూ బూతులతో విరుచుకుపడ్డారు. నా ఇల్లు అంటిస్తారా.. మా అమ్మా, నాన్నను చంపేస్తారా.. మిమ్మల్ని చంపుతానంటూ..రెండేళ్లో అంతు చూస్తానని హెచ్చరించారు. పోలీసులు ఏమీ చేయకపోయినా తాను మాత్రం రెండేళ్లలో చంపేస్తానన్నట్లుగా ఆయన మాట్లాడుతూండంటం వైఎస్ఆర్‌సీపీ నేతల్ని ఆందోళనకు గురి చేస్తోంది.
తమకేం సంబంధం లేదంటున్న వైఎస్ఆర్‌సీపీ నేతలు
విశ్వరూప్ కుమారుడు కృష్ణారెడ్డి ఇలా ఒక్కరికి కాదని.. తమ ఇంటిపై దాడి చేసినట్లుగా అనుమానం పెంచుకున్న వైఎస్ఆర్‌సీపీ నేతలందరికీ ఫోన్లు చేసి బెదిరిస్తున్నరన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిందితులు అయితే పోలీసులు అరెస్ట్ చేసే వారు కదా... తమకేం సంబంధం అని వారు మథనపడుతున్నారు. మంత్రి కుమారుడు కాబట్టి ఎదురు చెప్పలేకపోతున్నారు. కృష్ణారెడ్డికి వివాదాస్పదచరిత్ర ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పినిపె విశ్వరూప్ మంత్రిగా ఉన్నప్పుడు ఖరీదైన కారును మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ.. డ్రంక అండ్ డ్రైవ్‌లో దొరికిపోయారు.