Ambati Rambabu: 'సీఎం జగన్ గారిది మేనిఫెస్టో, టీడీపీది మోసఫెస్టో' - కుర్చీలను మడత పెట్టడంలో లోకేశ్ ది గిన్నీస్ రికార్డంటూ మంత్రి అంబటి తీవ్ర విమర్శలు
AP Politics: టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ పై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. సీఎం జగన్ ను సవాల్ చేసే సత్తా వారికి లేదని.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ పని అయిపోతుందని జోస్యం చెప్పారు.
Minister Ambati Slams Chandrababu And Nara Lokesh: సీఎం జగన్ విడుదల చేసేది మేనిఫెస్టో అని.. టీడీపీది మోసఫెస్టో అని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) అన్నారు. మంగళగిరిలోని (Mangalagiri) పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ ను సవాల్ చేసే నైతిక హక్కు.. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్ కు లేదని మండిపడ్డారు. ఆ పార్టీ కార్యాలయంలోనైనా, వేరే ఎక్కడైనా.. చంద్రబాబుతో తాను చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. వైసీపీ 'సిద్ధం' సభలకు వస్తోన్న స్పందన చూసి టీడీపీ నేతల భ్రమలు తొలగిపోతున్నాయని అన్నారు. కుర్చీలు మడత పెట్టడంలో లోకేశ్ ది గిన్నిస్ రికార్డని.. రేపు టీడీపీని కూడా ఆయన మడత పెట్టేస్తాడని ఎద్దేవా చేశారు. ఇప్పటికే 99 శాతం అమలు చేశామని.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఖతం అవుతుందని జోస్యం చెప్పారు. 175 స్థానాలకు 175 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
'ఆయన ఆటలో అరటిపండు'
జనసేనాని పవన్ కల్యాణ్ ఆటలో అరటిపండు మాదిరిగా వారాహి అనే వెహికల్ తయారు చేశారని.. ఎన్నిసార్లు ఆ వాహనం ఎక్కారో తెలియదని అంబటి ఎద్దేవా చేశారు. ఇటీవలే దానికి ఆయిల్ కూడా కొట్టించిన పరిస్థితులు కూడా కనిపించలేదని అన్నారు. 'ఆయిల్ కొట్టించాలంటే చంద్రబాబు ప్యాకేజీ ఇవ్వాలేమో, లేక పెట్రోలు బంకులో డబ్బులు కట్టాలేమో.' అంటూ సెటైర్లు వేశారు. 'రా.. కదలిరా' పేరుతో చంద్రబాబు బహిరంగ సభలు నిర్వహించారని వాటికి ఎవరూ కదలట్లేదని విమర్శించారు. శంఖం ఊదలేని స్థితిలో లోకేశ్ శంఖారావం ఉందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
'175 సీట్లు గెలుస్తాం'
వచ్చే ఎన్నికల్లో వైసీపీ 175 స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని.. ఇందులో ఎలాంటి సందేహం లేదని అంబటి ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ సీఎం జగన్ నిర్వహించిన 'సిద్ధం' సభకు జనం నీరాజనం పట్టారని.. దీంతో టీడీపీ నేతల భ్రమలు తొలగిపోయాయని అన్నారు. 'చంద్రబాబు ఏదో చేసేస్తాడు అనుకుంటే, తీరా పరిస్థితి చూస్తే అలా కనిపించట్లేదనే భావన వారిలో కలుగుతుంది. ఇంకా ముందుంది మొసళ్ల పండుగ. మరికొద్ది రోజుల్లో క్లియర్ పిక్చర్ అర్థమైపోతుంది. మళ్లీ సీఎంగా జగనే ఎన్నికవుతారు.' అని స్పష్టం చేశారు.
'చర్చకు నేను సిద్ధం'
సీఎం జగన్ ను సవాల్ చేసేంత సత్తా చంద్రబాబుకు లేదని.. దమ్ముంటే తనతో చర్చకు రావాలని అంబటి రాంబాబు సవాల్ విసిరారు. 'శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా చర్చించమంటే అక్కడి నుంచి చంద్రబాబు పారిపోయారు. నీకు సవాల్ చేసే అర్హత లేకపోయినా సరే.. నీ సవాల్ కు నేను సిద్ధం. నా సవాల్ స్వీకరించలేకపోతే.. పోనీ మా పార్టీలో ఇంకెవరైనా రెడీ.. దేనికైనా సిద్ధం.. నీ టీడీపీ ఆఫీసులో అయినా చర్చకు సిద్ధం.. నాతో చర్చకు నువ్వు రావు, ఒకవేళ వస్తే కనుక ఓ షరతు. చర్చ ముగిసిన తర్వాత బావురు బావురుమని ఏడవకూడదు.' అంటూ వ్యాఖ్యానించారు. 'చంద్రబాబును ముసలోడు అంటారా.?' అని లోకేశ్ చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తున్నారని.. ముసలివాడిని ముసలివాడని కాకుండా కుర్రోడు అంటారా? అని అంబటి ప్రశ్నించారు. ప్రజల్ని ఎంటర్ టైన్ చేయడానికి, మీ టీడీపీ క్యాడర్ ని ఉత్సాహ పరచడానికో మీరు ఎంత చేసినా వాళ్లు ఉత్సాహపడరంటూ ఎద్దేవా చేశారు.
'ఆర్కే రాక మరింత బలం'
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి పార్టీలోకి రావడం మరింత బలం చేకూర్చుతుందని అంబటి అన్నారు. 'ఆర్కే సిన్సియర్ పొలిటీషియన్. నిబద్ధత కలిగిన వ్యక్తి. ఆయన తిరిగి రావడం పార్టీకి మరింత బలాన్ని చేకూర్చుతుంది. డే వన్ నుంచి పార్టీ కోసం కష్టపడిన వ్యక్తి తిరిగి పార్టీలోకి రావడం చాలా సంతోషం.' అని వ్యాఖ్యానించారు.